వరద సాయంపై 24 గంటల్లోనే మాట మార్చిన ఎస్ఈసీ

వరద సాయంపై 24 గంటల్లోనే మాట మార్చిన ఎస్ఈసీ
  • ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది
  • రిజల్ట్స్ వచ్చే దాకా  10 వేలసాయం ఇవ్వొద్దని ఆర్డర్స్
  • ఈసీ తీరుపై వరద బాధితుల మండిపాటు
  •  ప్రభుత్వమే ఇలా చేయించిందని ఆగ్రహం

హైదరాబాద్‌, వెలుగుగ్రేటర్‌ హైదరాబాద్‌లో వరద బాధితులకు రూ.10 వేల సాయం పంపిణీపై 24 గంటల్లోనే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మాటమార్చింది. సాయాన్ని బాధితుల బ్యాంకు అకౌంట్లలో జమ చేసుకోవచ్చని మంగళవారం చెప్పిన ఎస్ఈసీ.. పంపిణీ ఆపాలంటూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని, రిజల్ట్స్ ప్రకటించే దాకా సాయం పంపిణీని ఆపాలని ఆదేశించింది. దీంతో సాయం కోసం దరఖాస్తు చేసేందుకు మీ సేవా కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలుచున్న జనం.. ఎస్‌ఈసీ ఆదేశాలపై మండిపడుతున్నారు. ప్రభుత్వమే ఇలా చేయించిందంటూ ఆరోపిస్తున్నారు. మంగళవారం జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల సందర్భంగా మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌‌‌‌‌‌‌ పార్థసారథి… వరద సాయం పంపిణీ ఆన్‌‌‌‌‌‌‌‌గోయింగ్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమం అని, నగదు రూపంలో కాకుండా బాధితుల బ్యాంకు అకౌంట్లలో జమ చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఓటర్లను రూ.10 వేల సాయం ప్రభావితం చేసే అవకాశం ఉందని, పంపిణీని ఆపాలని ఆదేశిస్తూ ఎస్‌‌‌‌‌‌‌‌ఈసీ సెక్రటరీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే దాకా సాయం చేయొద్దని చెప్పారు. నగదు సాయం పంపిణీపై ఎస్‌‌‌‌‌‌‌‌ఈసీకి ఏవైనా ఫిర్యాదులు వచ్చాయా? లేదా? అనే దానిపై నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో ఎక్కడా పేర్కొనలేదు.

లీడర్లను నిలదీస్తం: బాధితుల ఆగ్రహం

తమను రాష్ట్ర ప్రభుత్వమే వరదల్లో ముంచిందని, ఇప్పుడు రోడ్లపై తీసుకువచ్చి సాయం ఆపేసిందని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌ ఆదేశాల వెనుక ప్రభుత్వమే ఉందని ఆరోపిస్తున్నారు. నిండా మునిగిన తమను ఆదుకుంటామని ఆశపెట్టి.. ఇప్పుడు ఈసీ పేరు చెప్పి తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. ‘‘సర్కారు సాయంతో నిత్యావసరాలైనా కొనుక్కుందామని మూడు రోజులుగా మీ సేవా కేంద్రాలకు వస్తున్నాం. సైట్‌‌‌‌‌‌‌‌ పనిచేయడం లేదని, సర్వర్‌‌‌‌‌‌‌‌ హ్యాంగ్‌‌‌‌‌‌‌‌ అయిందని మీసేవ నిర్వాహకులు చెబుతున్నారు. రాత్రిళ్లు కూడా క్యూలో ఉంటున్నాం. తీవ్ర చలి, ఎండలో మమ్మల్ని నిల్చోబెట్టిన ప్రభుత్వం ఉన్నట్టుండి సాయం ఆపేసింది” అని బాధితులు ఆవేదన చెందుతున్నారు. క్యూలైన్లలో కిలోమీటర్ల కొద్దీ నిల్చోవడంతో కొందరు స్పృహతప్పి పడిపోయారు. తోపులాటలో కొందరు కిందపడి గాయపడ్డారు. గోల్కొండలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. సీఎంకి తెలియకుండానే ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ నిర్ణయం తీసుకుంటదా అని బాధితులు ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే లీడర్లను నిలదీస్తామని, తమను రోడ్లపైకి తెచ్చివారికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.

2.86 లక్షల అప్లికేషన్లు

అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 13 నుంచి వారం రోజుల పాటు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కురిసిన భారీ వర్షాలకు వందలాది కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10 వేల చొప్పున ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 20 నుంచి ఈనెల ఒకటో తేదీ వరకు 4.86 లక్షల మంది లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున రూ.486 కోట్లు నగదు రూపంలో అందజేసినట్లు ప్రకటించింది. తర్వాత మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించింది. దీంతో గత మూడు రోజుల్లో 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 1.78 లక్షల అప్లికేషన్లు పరిశీలించి వారి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేసినట్టు సర్కార్‌‌ ప్రకటించింది. మిగతా వారికి ఎన్నికలు ముగిసిన తర్వాత సాయం అందజేస్తామని తెలిపింది. ఇప్పటిదాకా అప్లై చేసుకోలేకపోయిన వారికి ఎన్నికల తర్వాత అవకాశం కల్పిస్తామని పేర్కొంది.

– మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి చెప్పిన విషయం..

జీహెచ్‌ఎంసీలోని ఓటర్లను రూ.10 వేల సాయం ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే వరద బాధితులకు సాయం పంపిణీని ఆపాలని ఆదేశిస్తున్నం. ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు ప్రకటించే దాకా వరద బాధితులకు సాయం చేయొద్దు.

– బుధవారం స్టేట్ ఎలక్షన్‌ కమిషన్‌ ఆర్డర్స్