చలిని లెక్కచేయకుండా 10 వేల అడుగుల ఎత్తులో.. మంచులో రన్నింగ్

చలిని లెక్కచేయకుండా 10 వేల అడుగుల ఎత్తులో.. మంచులో రన్నింగ్

ఓ వైపు చలి...మరో వైపు మంచు..పైగా అత్యంత ఎత్తైన ప్రదేశం..ఇన్ని ప్రతికూలతలో పరుగెత్తడం అంటే మామూలు విషయం కాదు. అయినా రన్నర్లు ఉత్సాహంగా పరిగెత్తారు. మొదటి బహుమతి కోసం పోటీపడ్డారు. ఈ అద్బుత ఈవెంట్ కు హిమాచల్ ప్రదేశ్ వేదికైంది. ప్రపంచంలోనై అత్యంత ఎత్తైన ప్రదేశంలో స్నో మారథాన్ ఆకట్టుకుంది. 

ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సిస్సు వద్ద  స్నో మారథాన్ ప్రారంభమైంది. చలిని సైతం లెక్కచేయకుండా రన్నర్లు పరిగెత్తారు. ఈ స్నో మారథాన్ కోసం ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేశారు. ఈ మారథాన్ లో  హిమాచల్ ప్రదేశ్‌తో పాటు చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల నుంచి పరుగు పందెం రాయుళ్లు  పాల్గొన్నారు. 

రీచ్‌ ఇండియా ఆధ్వర్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహౌల్‌ స్పితి జిల్లాలో సెకండ్ ఎడిషన్ స్నో మారథాన్‌ను నిర్వహించారు. 10వేల అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ మంచు మారథాన్లో 252 మంది రన్నర్లు పాల్గొన్నారు.  ఇందులో 70 మంది మహిళలు కూడా ఉన్నారు.  స్నో మారథాన్‌లో సోలన్‌కు చెందిన వికేష్ సింగ్ మొదటి స్థానంలో నిలిచాడు. 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్‌లో వికేష్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో కులుకు చెందిన కుశాల్ ఠాకూర్ రెండో స్థానంలో నిలిచాడు. 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ విభాగంలో బిలాస్ పూర్ కు చెందిన అనీష్ చందేల్ ప్రథమ స్థానం, చంబాకు చెందిన పవన్ ద్వితీయ స్థానం సాధించారు. అటు 10 కిలోమీటర్ల విభాగంలో మండికి చెందిన రుస్తం ప్రథమ స్థానం, జమ్ముకు చెందిన రాజేంద్ర ద్వితీయ స్థానం సాధించారు. మహిళల ఫుల్ మారథాన్ విభాగంలో కాజాకు చెందిన టాంజిన్ డోల్మా ప్రథమ స్థానంలో నిలవగా, హాఫ్ మారథాన్ విభాగంలో మనాలికి చెందిన పాలక్ ఠాకూర్, 10 కిలోమీటర్ల విభాగంలో సన్నా ప్రథమ స్థానంలో నిలిచారు.