
కారైనా, బైకైనా వాడినవాటిపైనే జనం ఇంట్రస్ట్
తక్కువ ధర, మంచి ఫీచర్స్ ఉండటమే కారణం
ఆన్లైన్లో అమ్మకాలు.. లోన్లు ఇస్తున్న బ్యాంకులు
ఆర్టీఏకూ పెరుగుతున్న రిజిస్ట్రేషన్ ఆదాయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సెకండ్ హ్యాండ్ బండ్లకు మస్తు గిరాకీ నడుస్తోంది. కారు, బైక్.. ఏ వాహనమైనా సరే సెకండ్ హ్యాండ్ వైపే జనం మొగ్గుచూపుతున్నారు. ధర తక్కువ, పైగా మంచి ఫీచర్స్ ఉండటంతో వాటిని కొనేందుకే ఇష్టపడుతున్నారు. బ్యాంకులు కూడా లోన్లు ఇస్తున్నాయి. ఎక్కువగా అమ్మకాలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కార్లను తయారుచేసే కంపెనీలు కూడా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బండ్లను అమ్మేందుకు ప్రధాన పట్టణాల్లో ఏజెన్సీలను ఏర్పాటు చేశాయి.
టాప్ స్పీడ్‌లో బైక్‌లు
2017–18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018–19 ఆర్థిక సంవత్సరం మన రాష్ట్రంలో అదనంగా 85 వేల దాకా సెకండ్ హ్యాండ్ బండ్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇందులో ఎక్కువగా బైక్‌లే ఉన్నాయి. రాష్ట్ర ఆర్టీఏ లెక్కల ప్రకారం.. 2017–-18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,99,443 వాహనాలు రెండోసారి రిజిస్టర్ అయ్యాయి. 2018–-19 సంవత్సరంలో 9,84,623 వాహనాలు రెండోసారి రిజిస్టరయ్యాయి. అంటే ఏడాదిలో 85,180 వాహనాలు పెరిగాయన్న మాట. 9,84,623 వాహనాల్లో బైకులు 8,41,133, మోటార్ కార్లు 1,29,684, మోటార్ క్యాబ్‌లు 12,009, మ్యాక్సీ క్యాబ్‌లు 1797 ఉన్నాయి.
లగ్జరీ బండ్లు కూడా..
చిన్న చిన్న బండ్లే కాదు.. లగ్జరీ బండ్లను కూడా సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేసేందుకు జనం ఇష్టపడుతున్నారు. మారుతి 800 వంటి కార్లతో పాటు బెంజ్, బీఎండబ్ల్యూ లాంటి కార్లు కూడా మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఇక బైక్‌ల విషయానికొస్తే రాయల్ ఎన్ఫిల్డ్, యమహా తోపాటు పలు స్పోర్ట్స్ బైక్‌లు కూడా సెకండ్ హ్యాండ్‌కు లభిస్తున్నాయి.
రివ్యూలు, రేటింగ్‌లు చూసి..
గతంలో అయితే తెలిసిన డీలర్లు, ఏజెంట్లు, వ్యక్తుల వద్ద సెకండ్ హ్యాండ్ బండ్లను కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఎక్కువ మంది ఆన్‌లైన్‌లోనే బండ్ల మోడల్స్‌ను, ఫీచర్స్‌ను, రివ్యూలను, రేటింగ్స్‌ను చూసి కొనుగోలు చేస్తున్నారు. ఓఎల్‌ఎక్స్, క్వికర్, డ్రూమ్, కార్‌దేకో, కార్‌వాలే వంటి పలు ఆన్లైన్ సంస్థలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పెద్దపెద్ద కార్లు, బైక్‌ల కంపెనీలు సైతం సెకండ్ హ్యాండ్ వాహనాల బిజినెస్ ప్రారంభించాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో ఆయా కంపెనీలు తమ షాపులను తెరిచాయి.
లోన్లు, ఈఎంఐ ఫెసిలిటీస్
సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉండటంతో బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు ప్రత్యేక రుణ సౌకర్యాలను అందిస్తున్నాయి. ఎక్కువగా కార్లకు రుణాలు ఇస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ వాహనాలకు ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి.
ఆర్టీఏకు ఫుల్ ఇన్‌కమ్
సెకండ్ హ్యాండ్ బండ్లతో ఆర్టీఏకు మస్తు ఇన్‌కమ్ వస్తోంది. ఏడాదికి వేలాది వాహనాలు రెండోసారి, మూడో సారి రిజిస్టర్ అవుతున్నాయి. మోటార్ బైక్ రిజిస్ట్రేషన్ ట్రాన్స్‌ఫర్‌కు సుమారు రూ. 685 తీసుకుంటున్నారు. కార్ల రిజిస్ట్రేషన్ ట్రాన్స్‌ఫర్‌కు రూ. 1085 వరకు తీసుకుంటున్నారు. ఈ లెక్కన ఏడాకి కోట్ల ఆదాయం ఆర్టీఏకు వస్తోంది.
కొనేటప్పుడు చెక్ చేసుకోండి
యూజ్డ్ వెహికిల్ కొనేందుకు తప్పనిసరిగా జాగ్రతలు తీసుకోవాలి. వాహనానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయోలో లేదో చూసుకోవాలి. వాటిలో ఉన్న వివరాల ప్రకారం ఇంజన్, చాసిస్ నంబర్ సరి చూసుకోవాలి. తెలిసిన మెకానిక్‌ను తీసుకెళ్లి బండి కండిషన్ చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇంజన్ సామర్థ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. వాహనాన్ని కొనుగోలు చేయగానే తమ పేరు మీద వెంటనే మార్చుకోవాలి. అంతేకాకుండా వాహనంపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలి. వాహనం ఫైనాన్స్‌లో తీసుకుంటే అందుకు సంబంధించిన ఫైనాన్స్ సంస్థ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి.