చలో ఇండియా

చలో ఇండియా

రెండో అతిపెద్ద ఎకానమీ, ప్రపంచానికి మాన్యుఫాక్చరింగ్ హబ్‌‌, ప్రతి దేశంలోనూ ఆ దేశ ప్రొడక్ట్‌‌.. మాట్లాడుతుంది చైనా గురించే. యూఎస్‌‌ ఆధిపత్యానికే సవాలు చేస్తున్న చైనాకు ఇండియా దీటుగా నిలవనుంది. యూఎస్‌‌, తైవాన్‌‌తో టెన్షన్స్‌‌, పక్క దేశాలతో గొడవలు, కఠినంగా కరోనా రిస్ట్రిక్షన్లు, టెక్నాలజీని ట్రాన్స్‌‌ఫర్ చేయాలనే డిమాండ్లతో చైనా నుంచి బయటకు వెళ్లిపోదామనుకునే కంపెనీలు ఎక్కువయ్యాయి. యాపిల్ నుంచి ఫాక్స్‌‌కాన్ వరకు చాలా కంపెనీలు చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు ఇండియా వైపు చూడడం మొదలు పెట్టాయి. 


చైనాతో మంచి సంబంధాలు ఉన్న అమెరికన్ మిత్ర దేశాలు ఇరువురి గొడవ మధ్య నలిగిపోకూడదని భావిస్తున్నాయి. ఉదాహరణకు సౌత్ కొరియా ఎగుమతులపై ఆధారపడే దేశం. కొరియన్ కంపెనీలకు చైనానే సప్లయ్ చెయిన్ సమస్యలు తీరుస్తోంది. యూఎస్‌‌–చైనా మధ్య ట్యాక్స్ వార్‌‌‌‌ మొదలయ్యాక ఈ దేశ కంపెనీలు ఎక్కువగా ఇబ్బంది పడ్డాయి. తాజాగా తైవాన్‌‌తో నెలకొన్న గొడవ ఎక్కడి వరకు ముదురుతుందోనని భయపడుతున్నాయి. అందుకే శామ్‌‌సంగ్‌‌, హ్యుండాయ్‌‌, పోస్కో వంటి కంపెనీలు ఇండియాకి కొంత మాన్యుఫాక్చరింగ్ బేస్‌‌ను ట్రాన్స్‌‌ఫర్ చేసుకోవాలనే ప్లాన్‌‌లో ఉన్నాయి.  

   ఇండియా వైపే ఎందుకు?

 నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చిన వెంటనే తెచ్చిన ముఖ్యమైన ఇనీషియేటివ్ ‘మేక్ ఇన్ ఇండియా’. దేశంలో తయారీని పెంచేందుకు ఈ ఇనీషియేటివ్‌‌ మొదలు పెట్టారు. నేడు చైనా తయారీ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా ఆసియాలో ఇండియా కనిపిస్తోంది. గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఇండియా ప్రొఫైల్‌ను పెంచడానికి, ఇక్కడ ప్రొడక్షన్​ చేసేలా మల్టీ నేషనల్ కంపెనీలను ఎంకరేజ్​ చేయడానికి ‘‘మేక్ ఇన్ ఇండియా” ప్రచారాన్ని మొదలుపెట్టారు.  
ఆ తర్వాత ఆత్మ నిర్భర్‌‌‌‌ భారత్‌‌, ప్రొడక్షన్ లింక్డ్‌‌ ఇన్సెంటివ్‌‌ (పీఎల్‌‌ఐ) స్కీమ్ వంటి గేమ్‌‌ చేంజర్ పాలసీలను ప్రభుత్వం తెచ్చింది. మోడీ గవర్నమెంట్ ముందు నుంచే చైనాకు ఆల్టర్నేటివ్‌‌గా ఇండియా అనే నినాదాన్ని బాగా తీసుకెళ్లింది. కార్పొరేట్ ట్యాక్స్‌‌లను తగ్గించడం, కొన్ని రకాల కేసులను డీక్రిమినలైజ్ చేయడం వంటివి దేశాన్ని పోటీలో నిలపడంలో సాయపడ్డాయని అనొచ్చు.  ప్రస్తుత పరిస్థితుల్లో చైనాకు ఆల్టర్నేటివ్‌‌గా ఇండియా బాగా సరిపోతుందని ఎనలిస్టులు చెప్తున్నారు. ప్రపంచంలోనే జనాభా ఎక్కువగా ఉన్న దేశంగా ఇండియా ఎదిగింది. మన దగ్గర కేవలం 7 శాతం మంది మాత్రమే 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్నవారు ఉన్నారు. అదే చైనాలో వీళ్లు14 శాతం, యూఎస్‌‌లో 18 శాతం ఉన్నారు. ఇండియాలో ఒక వ్యక్తి సగటు వయసు 28 ఏళ్లుగా ఉంటే, చైనాలో ఈ నెంబర్ 36 ఏళ్లుగా ఉంది. అంటే మన దగ్గర పనిచేసే యువత ఎక్కువగా అందుబాటులో ఉన్నారు. ఇదొక్కటే కాదు కంపెనీలను ఆకర్షిస్తోంది. ఇండియా పెద్ద దేశమే కాకుండా వైవిధ్యమైనది. అతిపెద్ద కన్జూమర్ మార్కెట్‌‌ కూడా. కరోనా టైమ్‌‌లోనూ దేశ ఎకానమీ స్ట్రాంగ్‌‌గా ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్‌‌) 2022–2023లో దేశ జీడీపీ గ్రోత్ రేట్‌‌ 5.9 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. కానీ, ఇండియా గ్రోత్ రేట్​ 7.2 శాతంగా నమోదయింది. ఇది చైనా కంటే ఎక్కువ. ఎకానమీ స్ట్రాంగ్‌‌గా ఉండడం, వర్క్ ఫోర్స్ అందుబాటులో ఉండడం, అతిపెద్ద మార్కెట్ కావడం ఇండియాకు ప్లస్‌‌ పాయింట్స్‌‌గా ఉన్నాయి.

 ఎగుమతుల్లో ఊపు..

దేశ ఎగుమతులు ఊపందుకున్నాయి. గ్లోబల్‌‌ ట్రేడ్‌‌లో సమూల మార్పులొస్తున్నాయి. వివిధ దేశాలు గ్లోబల్ మార్కెట్‌‌లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. వియత్నాం, ఇండోనేషియా, కంబోడియా వంటి దేశాలు కూడా చైనా నుంచి బయటకొచ్చే కంపెనీలకు గాలం వేస్తున్నాయి. గ్లోబల్‌‌ ట్రేడ్‌‌లో ఇండియా మార్కెట్ షేర్ ముందు నుంచీ తక్కువగానే ఉంది. 2015 లో గ్లోబల్‌‌ మర్చండైజ్‌‌ (గూడ్స్‌‌) ట్రేడ్‌‌లో ఇండియా వాటా కేవలం 0.75 శాతంగా ఉంది. కిందటేడాది ఈ నెంబర్ 1.8 శాతానికి పెరిగింది. గూడ్స్‌‌ ట్రేడ్‌‌లో ఇండియా వాటా తక్కువే అయినప్పటికీ మరింత పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్‌‌గా జరుగుతున్న ఆటోమొబైల్స్‌‌, స్పేర్‌‌‌‌ పార్టుల ట్రేడ్‌‌లో ఇండియా ఎగుమతుల వాటా1.32 శాతానికి పెరిగింది. 2015 లో ఈ నెంబర్ 1.11 శాతంగా ఉంది. అలానే స్టీల్‌‌ ఎగుమతుల వాటా 2.66 శాతం నుంచి 3.55 శాతానికి, అల్యూమినియం ఎగుమతుల వాటా1.69 శాతం నుంచి 1.98 శాతానికి పెరిగింది. గ్లోబల్‌‌ ట్రేడ్‌‌లో ఇండియా వాటా ఇంకా తక్కువే అయినప్పటికీ, మన ప్రాతినిధ్యం నిలకడగా పెరుగుతోంది. గ్లోబల్‌‌ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ డేటా ప్రకారం, గ్లోబల్‌‌ ట్రేడ్‌‌లో ఇండియా నుంచి ఎలక్ట్రానిక్స్‌‌, టెలికం, మొబైల్ ఫోన్స్‌‌, ఎలక్ట్రికల్ ఎక్విప్‌‌మెంట్‌‌, మెషినరీల ఎగుమతుల వాటా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్ల కోసం దిగుమతులపై ఆధారపడే ఇండియా ఇప్పుడు స్మార్ట్‌‌ఫోన్ల ఎగుమతి దేశంగా మారింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌‌ (పీఎల్‌‌ఐ) తో ఈ సెక్టార్‌‌‌‌లో సమూల మార్పులొచ్చాయని ఎనలిస్టులు చెబుతున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశ మొత్తం ఎగుమతులు 770.18 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 13.84 శాతం గ్రోత్‌‌కు సమానం. మర్చండైజ్ (గూడ్స్‌‌) ఎక్స్‌‌పోర్ట్స్ 2021–22తో పోలిస్తే 2022–23లో 6 శాతం పెరిగి 447.46 బిలియన్ డాలర్లకు చేరుకోగా, సర్వీస్‌‌ సెక్టార్ ఎగుమతులు 26.79 శాతం వృద్ధి సాధించి 322.72 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 

పెరుగుతున్న యాపిల్‌‌ తయారీ.. 

యాపిల్‌‌, శామ్‌‌సంగ్ వంటి పెద్ద కంపెనీలు చైనాకు ఆల్టర్నేటివ్‌‌గా ఇండియాలో విస్తరిస్తున్నాయి. శామ్‌‌సంగ్ తన నోయిడా ప్లాంట్‌‌ను డెవలప్​ చేస్తోంది. గెలాక్సీ ఎస్‌‌23 స్మార్ట్‌‌ఫోన్లనూ ఇక్కడే తయారు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫోన్లను వియత్నాం నుంచి దిగుమతి చేసుకునేది. యాపిల్ అయితే తన లేటెస్ట్ మోడల్స్‌‌ను కూడా ఇండియాలో తయారు చేస్తోంది. కరోనా టైమ్‌‌లో చైనా విధానాల వల్ల యాపిల్ ఎక్కువగా నష్టపోయింది. దీంతో కంపెనీ తన మాన్యుఫాక్చరింగ్ బేస్‌‌ను కొంత ఇండియాకు మార్చింది. ఫాక్స్‌‌కాన్‌‌, విస్ట్రన్‌‌, పెగట్రాన్‌‌ వంటి యాపిల్ ఫోన్లను తయారు చేసే కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఇండియాలో భారీగా విస్తరిస్తున్నాయి. యాపిల్‌‌కు ఇండియాలో మొత్తం 14 సప్లయర్లు ఉండడం విశేషం. ఈ ఏడాది జనవరి నాటికి కంపెనీ తయారు చేస్తున్న ఐఫోన్లలో 5 శాతం ఇండియాలోనే తయారవుతున్నాయి. ఈ నెంబర్‌‌‌‌ను 25 శాతానికి, 2027 నాటికి 50 శాతానికి పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఐఫోన్‌‌ 14 స్టాండర్డ్ మోడల్స్‌‌, పాత మోడల్స్‌‌ తయారవుతున్నాయి. ఐఫోన్‌‌ 15 సిరీస్‌‌ను ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి తయారు చేసే అవకాశం ఉంది. యాపిల్ ఎయిర్‌‌‌‌పాడ్స్, మాక్‌‌బుక్స్‌‌ తయారీని చైనా నుంచి వియత్నాంకు యాపిల్ షిఫ్ట్ చేస్తోంది. 

కొరియన్, అమెరికన్ కంపెనీల చూపు..

ఇండియాలో తమ ప్రొడక్షన్ పెంచుతామని ఎల్‌‌జీ ఇప్పటికే ప్రకటించింది. ఇండియా కోసం ఇండియాలో తయారైన ప్రొడక్ట్‌‌లను అమ్ముతామని వెల్లడించింది. ఇందుకోసం 24 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని, కొత్త ప్లాంట్ పెడతామని ఈ ఏడాది ఫిబ్రవరిలో చెప్పింది. గ్రేటర్ నోయిడాలోని తమ ప్లాంట్‌‌లో సైడ్‌‌ బై సైడ్ ప్రీమియం ఫ్రిజ్‌‌లను తయారు చేస్తామంది. కేవలం ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కాకుండా స్టీల్ కంపెనీ పోస్కో కూడా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇండియాలో ప్లాంట్ పెట్టాలనుకున్నప్పటికీ 2017లో తన ప్లాన్‌‌ను పక్కన పెట్టేసిన పోస్కో, తాజాగా అదానీ గ్రూప్‌‌తో కలిసి బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని పేర్కొంది. మహారాష్ట్రలోని జనరల్ మోటార్ ప్లాంట్‌‌ను కొనుగోలు చేస్తామని హ్యుండయ్‌‌ మోటార్ ఇప్పటికే ప్రకటించింది.  కొత్తగా లాంచ్ చేయనున్న ఆరు ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్‌‌ను ఈ ప్లాంట్‌‌లో తయారు చేస్తామని పేర్కొంది. ఎయిర్‌‌‌‌ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న యూఎస్ కంపెనీ బోయింగ్‌‌, ఫ్రాన్స్ కంపెనీ ఎయిర్‌‌‌‌బస్‌‌లు ఇండియాలో భారీగా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. నోకియా, యాపిల్‌‌, గూగుల్‌‌, ఒరాకిల్‌‌, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు కూడా ఇండియాలో మరింతగా విస్తరించాలని ప్లాన్స్ వేస్తున్నాయి.

 పీఎల్‌‌ఐ మ్యాజిక్‌‌..

 దేశంలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌ను పెంచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌‌ (పీఎల్‌‌ఐ) మంత్రంలా పనిచేస్తోంది. కరోనా తర్వాత ఈ స్కీమ్‌‌ కింద అప్లయ్ చేసుకున్న కంపెనీలు పెరుగుతున్నాయి. చైనా ప్లస్ స్ట్రాటజీకి పీఎల్‌‌ఐ తోడవ్వడంతో టాప్ ఎంఎన్‌‌సీలు ఇండియాకు వస్తున్నాయి. కరోనా సంక్షోభం తర్వాత మాన్యుఫాక్చరింగ్ కంపెనీలకు ఆసరాగా జపాన్ లాంటి దేశమే 221 మిలియన్ డాలర్ల రాయితీలు ప్రకటిస్తే, ఇండియా పీఎల్‌‌ఐ కింద 24 బిలియన్ డాలర్లు (రూ.1.97 లక్షల కోట్లు) విలువైన రాయితీలను ఆఫర్ చేసింది. ప్రస్తుతానికి 14 సెక్టార్లలో పీఎల్‌‌ఐ స్కీమ్ అమల్లో ఉండగా, రానున్న ఐదేళ్లలో అదనంగా రూ.30 లక్షల కోట్ల విలువైన ప్రొడక్షన్ జరుగుతుందని,60 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయని అంచనా. గతంలో మాదిరి కాకుండా పీఎల్‌‌ఐ కింద కేవలం ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన కంపెనీలకే ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. ఈ స్కీమ్ కింద కంపెనీలు చేసే క్యాపెక్స్ పెరుగుతుందని, ఫలితంగా 50 లక్షల డైరెక్ట్ ఉద్యోగాలు, 15 లక్షల ఇన్‌‌డైరెక్ట్ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని కేంద్రం భావిస్తోంది. దేశ ఇంధన వాడకంలో మార్పులొచ్చి, ఇంపోర్ట్స్ తగ్గి మాన్యుఫాక్చరింగ్ హబ్‌‌గా మారడంలో పీఎల్‌‌ఐ స్కీమ్‌‌ కీలకంగా ఉంటుందని గోల్డ్‌‌మ్యాన్ శాక్స్​ స్ట్రాటజిస్ట్ సునిల్ కౌల్ అంచనావేశారు. వచ్చే ఐదు నుంచి ఆరేళ్లలో 58 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీలు ముందుకొచ్చాయని అన్నారు. బీఎస్‌‌ఈ 500 లోని 21 శాతం కంపెనీలు ఒక ఏడాదిలో చేసే క్యాపెక్స్‌‌కు ఇది సమానమని వివరించారు. పీఎల్‌‌ఐకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 717 అప్లికేషన్లకు డిపార్ట్‌‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఆమోదించింది. ఈ కంపెనీలు 14 సెక్టార్లలో రూ.2.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయని అంచనా. ఇప్పటికే 12 సెక్టార్లలో రూ.47,500 కోట్ల ఇన్వెస్ట్‌‌మెంట్స్ వచ్చాయని డీపీఐఐటీ చెప్తోంది. నాలుగు లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయని వెల్లడించింది. అంతేకాకుండా అదనంగా రూ.3.9 లక్షల కోట్ల విలువైన ప్రొడక్షన్ జరుగుతోందని వివరించింది. 

చైనాకు వెలుపల ఈ కంపెనీలు.. 

‘మేము కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడినప్పుడు, చాలా మంది తమకు చైనాలో ఫ్యాక్టరీలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీలను క్లోజ్ చేయడానికి రెడీగా లేమని వారు చెప్పారు. కానీ, కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటే ఇండియా, ఇండోనేషియా, వియత్నాంలలో పెడతామని పేర్కొన్నారు. ఇండియాతో పోలిస్తే వియత్నాం లేదా ఇండోనేషియాలో ఫ్యాక్టరీ పెట్టడం 30 శాతం చౌక అయినప్పటికీ, ఇండియాలో అతిపెద్ద డొమెస్టిక్ మార్కెట్ ఉంది. దీన్ని ఈ రెండు దేశాలు  కూడా ఆఫర్ చేయలేవు’ అని గోల్డ్‌‌మ్యాన్ శాక్స్​ సునిల్ కౌల్ పేర్కొన్నారు. ఫాక్స్‌‌కాన్‌‌, డిక్సాన్ టెక్నాలజీస్‌‌, శామ్‌‌సంగ్‌‌ వంటి 10 మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు ఇప్పటికే పీఎల్‌‌ఐ కింద తమ పనులు ప్రారంభించాయి. యాపిల్ ఐఫోన్లను తయారు చేస్తున్న పెగట్రాన్‌‌, విస్ట్రాన్‌‌లు కూడా ఇండియాలో తమ ప్లాంట్‌‌లు పెట్టాయి. ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్‌‌లో పీఎల్‌‌ఐ పెద్ద సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. 2021–22 లో ఇండియాలో ఏకంగా రూ.2.75 లక్షల కోట్ల విలువైన ఫోన్లు తయారయ్యాయి. ఐదేళ్ల క్రితం ఈ నెంబర్ కేవలం రూ.90 వేల కోట్లు మాత్రమే. ఈ మొత్తం ప్రొడక్షన్‌‌లో 16 శాతం ఎక్స్‌‌పోర్ట్స్ ఉండడం విశేషం. 2016–17 లో ఇండియాలో తయారైన ఫోన్లలో కేవలం ఒక శాతం మాత్రమే ఎగుమతి అయ్యాయి. 2022–23 లో మొబైల్‌‌ ఫోన్ల ఎగుమతులు రూ.73 వేల కోట్లను దాటేశాయి. పీఎల్‌‌ఐ కింద ఇస్తున్న రాయితీలు మొబైల్ ఫోన్స్‌‌, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌‌, టెలికాం ఎక్విప్‌‌మెంట్‌‌, ఐటీ హార్డ్‌‌వేర్‌‌‌‌ సెక్టార్లలో ఆకర్షణీయంగా ఉన్నాయని ఎనలిస్టులు చెప్తున్నారు. ఈ సెక్టార్లలోని ప్రొడక్ట్‌‌ల కోసం ఇండియా ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతోంది. మరోవైపు ఇన్వెస్ట్‌‌మెంట్స్ ఎక్కువగా అవసరం ఉండే అడ్వాన్స్డ్‌‌ కెమికల్ సెల్‌‌ (ఏసీసీ) బ్యాటరీస్‌‌, స్పెషాలిటీ స్టీల్ వంటి సెక్టార్లలో కూడా ప్రభుత్వం పీఎల్‌‌ఐ కింద రాయితీలు ఆఫర్ చేస్తోంది. మెడికల్‌‌ డివైజ్‌‌లు, ఫార్మా ఇంగ్రెడియెంట్ల సెక్టార్​లో ఇచ్చే రాయితీల కోసం కూడా కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఎంఎన్‌‌సీ కంపెనీ జీఈ విప్రోతో కలిసి  బెంగళూరులో తమ 14 వ మెడికల్ డివైజ్‌‌ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. విప్రో జీఈ హెల్త్‌‌కేర్ ఈ ప్లాంట్ కోసం రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ సీటీ మెషిన్లు, అల్ట్రాసౌండ్‌‌ స్కానర్లు, ఈసీజీ మెషిన్లు, వెంటిలేటర్లను తయారు చేస్తున్నారు. ఇంకా జీఈకి ఇదే అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ కావడం విశేషం. ఫ్రిజ్‌‌లు, ఏసీలు వంటి వైట్ గూడ్స్ తయారీ కంపెనీలు కూడా పీఎల్ఐ కింద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కానీ, ఈ కంపెనీలు ఇప్పటికే ఇండియాలో ఉన్నాయి. సోలార్‌‌‌‌ అండ్‌‌ బ్యాటరీ సెగ్మెంట్‌‌లో పీఎల్‌‌ఐ కింద ఇన్వెస్ట్ చేసేందుకు రిలయన్స్‌‌, ఎల్‌‌ అండ్‌‌ టీ, ఓలా, రాజేష్ ఎక్స్‌‌పోర్ట్స్‌‌ వంటివి ముందుకొచ్చాయి. సెమీ కండక్టర్లు, ఈవీ, హైడ్రోజన్‌‌ వెహికల్స్‌‌, ఏసీసీ బ్యాటరీస్‌‌ సెగ్మెంట్‌‌లలో పెద్దగా ఫారిన్ ఇన్వెస్ట్‌‌మెంట్లు రావడం లేదు. 

రికార్డ్ లెవెల్‌‌లో ఎఫ్‌‌డీఐలు..

దేశంలోకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌మెంట్లు (ఎఫ్‌‌డీఐ) రికార్డ్ లెవెల్‌‌లో వస్తున్నాయి. 2021–22 లో ఏకంగా 84.8 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్‌‌మెంట్లు రాగా, 2022–23 లో ఈ నెంబర్ 71 బిలియన్ డాలర్లకు తగ్గింది. గ్లోబల్‌‌గా ఎకానమీ పరిస్థితులు బాగోలేకపోయినప్పటికీ ఇండియాలోకి పెద్ద మొత్తంలో విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు రావడం విశేషం. 2020–21 లో 82 బిలియన్ డాలర్లను, 2019–20 లో 74.4 బిలియన్ డాలర్లను ఇండియా ఆకర్షించింది. 

ఇండియాలో అడ్డంకులు..

చైనా నుంచి వచ్చే కంపెనీలను ఆకర్షించడం ఇండియాకు అంత ఈజీ కాదు. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్ పెద్దగా లేకపోవడం, క్లిష్టమైన రెగ్యులేటరీ వ్యవస్థ, అనుమతులు ఇవ్వడంలో జాప్యం వంటి సమస్యలు ఇండియాను వెంటాడుతున్నాయి. చైనాలో ఫ్యాక్టరీని ఎక్కడైనా పెట్టడానికి వీలుంటుందని, అక్కడి టెక్నాలజీ అంత డెవలప్ అయ్యిందని కంపెనీలు చెప్తున్నాయి. కానీ, ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టాలంటే అనేక ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం, దేశంలో అర్బన్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను డెవలప్ చేయడానికి రానున్న15 ఏండ్లలో 840 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలి. మరోవైపు వరల్డ్ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ 2020 లో ఇండియా స్థానం ఎక్కడో ఉంది. బిజినెస్‌‌ను ఈజీగా స్టార్ట్ చేయడంలో 136 వ ప్లేస్‌‌లో, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌‌లో 154, కాంట్రాక్ట్‌‌లను అమలు చేయడంలో 163 వ ప్లేస్‌‌లో ఉంది. ఇంకా, దేశంలో యువత ఉన్నప్పటికీ, వీరికి స్కిల్స్‌‌ లేకపోవడం ఇబ్బంది పెట్టే అంశం. యువత స్కిల్‌‌ లెవెల్స్‌‌ను పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే ఇన్నోవేషన్స్ లేకపోవడం, ప్రొడక్ట్ క్వాలిటీ తక్కువగా ఉండటం, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని వాడడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం వంటివి కూడా అడ్డంకులేనని చెప్తున్నారు ఎనలిస్ట్​లు.

::: పల్ల నరసింహ, బిజినెస్ డెస్క్‌‌

వేదాంత ఫ్యూచర్ ప్లాన్స్

ఎలక్ట్రానిక్స్​, సెమీ కండక్టర్ల రంగంలో కూడా ఇండియా ముందడుగు వేస్తోంది. వేదాంత గ్రూప్ ఇప్పటికే ఇండియాలో  సెమీ కండక్టర్ల తయారీ యూనిట్​ని పెట్టేందుకు పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం వేదాంత కంపెనీ మైనింగ్ రంగంలో గుర్తింపు పొందింది. ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా, నమీబియా అంతటా వ్యాపారాలు చేస్తోంది. అయితే.. ఈ కంపెనీ మన దేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్​ చేస్తోంది. గత ఏడాది తైవాన్ తయారీ దిగ్గజం ఫాక్స్ కాన్‌తో కలిసి చిప్​ తయారీ కంపెనీ పెడుతున్నట్టు ప్రకటించింది. వేదాంత తర్వాత టాటా గ్రూప్ కూడా సెమీకండక్టర్ల వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే వేదాంత కంపెనీ దేశంలో సెమీకండక్టర్లు, డిస్​ప్లే గ్లాస్ తయారీ కోసం.. జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరిగిన ‘అవాన్‌స్ట్రేట్ బిజినెస్ పార్టనర్స్ సమ్మిట్ 2022’లో దాదాపు 30 జపాన్ టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎలక్ట్రానిక్స్  రంగంలో అనేక ఉత్పత్తులను మన దేశంలోనే తయారు చేసి.. అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయాలనే లక్ష్యంతో వేదాంత గ్రూప్ పనిచేస్తోంది.

ఆ కల నేరవేరుతుంది

ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్​– 2023 కార్యక్రమంలో వేదాంత కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఆటోమొబైల్స్ నుండి ఎలక్ట్రానిక్స్ వరకు పరిశ్రమలకు అంతర్భాగమైన సెమీకండక్టర్ చిప్‌లను అభివృద్ధి చేయడానికి మనదేశం ఒక పటిష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. చిప్ తయారీ ప్రపంచంలో మన ఇమేజ్‌ను మారుస్తుంది. గుజరాత్‌లో ఉన్న మా కంపెనీ చిప్‌లను తయారు చేయడానికి రెడీగా ఉంది. అయితే, దానికి అవసరమైన అనుమతుల కోసం కొంత సమయం పట్టవచ్చు. కానీ, ఆ కల కచ్చితంగా నెరవేరుతుంది” అన్నారు.వేదాంత - ఫాక్స్ కాన్ కలిసి ఏర్పాటు చేస్తున్న సెమీకండక్టర్ చిప్ ఫ్యాక్టరీని సుమారు1000 ఎకరాల్లో కడుతున్నారు. ఇందుకోసం రెండు కంపెనీలు దాదాపు రూ.1.54 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. 2027 నాటికి ఈ ప్లాంట్​లో చిప్​ల ప్రొడక్షన్ మొదలవుతుందని అంచనా. 

కరోనా ఎఫెక్ట్​ 

కంపెనీలు చైనా నుంచి ఇండియాకు రావడానికి కరోనా కూడా ఒక కారణమనే చెప్పాలి. కరోనా టైంలో చైనాలో ప్రొడక్టివిటీ ఆగిపోయింది. మిగతా దేశాలతో పోలిస్తే.. చైనాలో ఎక్కువ రోజులు ఆంక్షలు విధించారు. ప్రజలు పనుల్లోకి వెళ్లాలంటే భయపడ్డారు. దాంతో కంపెనీలు చాలా నష్టాలను చూడాల్సి వచ్చింది. భవిష్యత్తులో కూడా మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎదురైనా నష్టాలు రాకుండా ఉండేందుకు ప్లాన్లు రెడీ చేసుకున్నాయి. అందులో భాగంగానే కరోనా ఎఫెక్ట్​ తక్కువగా ఉన్న దేశాలకు తమ కంపెనీలను షిఫ్ట్​ చేశాయి. మరికొన్ని కంపెనీలు చైనాలో ప్రొడక్షన్​ తగ్గించి, వేరే దేశాల్లో కూడా ప్రొడక్షన్​ యూనిట్లను ఏర్పాటు చేశాయి. చైనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న ఇండియాకు కూడా పెద్ద మొత్తంలో కంపెనీలు వస్తాయని అందరూ ఎక్ప్​పెక్ట్​ చేశారు. అందుకే కంపెనీలను ఆకర్షించేందుకు భారత్ అనేక ప్రయత్నాలు చేసింది.  కానీ.. అప్పట్లో చాలా కంపెనీలు వియత్నాం వెళ్లాయి. ఎందుకంటే.. కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడడంలో వియత్నాం ఒక మోడల్​ దేశంగా నిలిచింది. అక్కడ చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి. కరోనాను అరికట్టడంతో పాటు అక్కడి గవర్నమెంట్​ పాలసీలు కూడా కంపెనీలు పెట్టేందుకు అనుగుణంగా ఉండడంతో కంపెనీలు వియత్నాం వైపే మొగ్గు చూపాయి. కానీ.. ఇండియా మార్కెట్​తో పోలిస్తే.. వియత్నాం మార్కెట్​ చాలా చిన్నది. మన జనాభాతో పోలిస్తే.. వియత్నాం జనాభా చాలా తక్కువ. అందుకే ఇప్పుడు కంపెనీలు మళ్లీ ఇండియా వైపు చూస్తున్నాయి. 

రాబోయే పదేండ్లలో..

గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఎదగాలనే ఇండియా కలను సాకారం చేయడానికి రీజినల్ ఇండస్ట్రియల్ గ్రోత్ ముఖ్యం కావచ్చు. ఇంకా మనదేశం రాబోయే పదేండ్లలో జర్మనీ, జపాన్‌లను దాటి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందనేది అంచనా. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ రిపోర్ట్​ ప్రకారం 2035 నాటికి పది ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సిస్టమ్​గా మారనుంది. 

స్కిల్స్ తక్కువే

ఇండియాలో  చైనా కంటే ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. మన దగ్గర ప్రపంచ దిగ్గజ కంపెనీలకు సీఈవోలను అందించిన ఐఐటీల్లాంటి ఇనిస్టిట్యూట్​లు ఉన్నాయి. కానీ.. అవి మన జనాభాలో చాలా తక్కువ శాతం మందికే విద్యను అందించగలుగుతున్నాయి. మన దగ్గర చాలామందికి సరైన స్కిల్స్​ లేవు. ఇండియాలో వయోజన అక్షరాస్యత రేటు 74.4 శాతం. చైనాలో 96.8 శాతం. మన దేశంలో సగటున ఒక స్టూడెంట్​కి​ 12.2 సంవత్సరాలు స్కూల్​ ఎడ్యుకేషన్​ ఉంటుంది.  చైనాలో పిల్లలు14 సంవత్సరాల పాటు స్కూల్‌‌‌‌లో చదువుకుంటారు. పైగా చైనా గవర్నమెంట్​ ప్రజల్లో స్కిల్స్​ పెంచేందుకు ముందునుంచి చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. మన దగ్గర భాషల వైవిధ్యం ఎక్కువ. ప్రస్తుతం మన దగ్గర 120 ప్రాంతీయ భాషలు మాట్లాడుతున్నారు. హిందీని 57 శాతం జనాభా మాత్రమే ఉపయోగిస్తున్నారు. అదే చైనాలో 300 భాషలు ఉన్నా... చైనా జనాభాలో ఎక్కువమంది చైనీస్ చదవగలరు. రాయగలరు. దీనివల్ల వాళ్లు దేశంలో ఎక్కడైనా పనిచేయగలరు. మనదేశంలో చదువుకునే దశలోనే ఎంట్రప్రెన్యూర్​షిప్​ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఉందంటున్నారు ఎక్స్​పర్ట్స్. ఇట్లా తయారైన యువత సొంతంగా ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడం, పెట్టుబడి అవకాశాలు కల్పించాల్సి ఉంది.