నేరడిగొండ కేజీబీవీలో రెండోసారి ఫుడ్​ పాయిజన్

నేరడిగొండ కేజీబీవీలో రెండోసారి ఫుడ్​ పాయిజన్
  • రిమ్స్​కు మరో 31 మంది తరలింపు  
  • ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు
  • ఎస్ఓ, వంట సిబ్బందిని
  • సస్పెండ్ ​​చేసిన డీఈఓ

నేరడిగొండ, వెలుగు : ఆదిలాబాద్ ​జిల్లా నేరడిగొండలోని కేజీబీవీ స్కూల్​లో వరుసగా ఫుడ్ ​పాయిజన్​ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం మధ్యాహ్నం లంచ్​ చేసిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురికాగా 11 మందిని రిమ్స్​కు తరలించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి భోజనం  చేసిన 25 మంది కూడా వాంతులు, విరేచనాలతో బాధపడగా వీరిని కూడా రిమ్స్​కే తరలించారు. సోమవారం ఉదయం టిఫిన్ ​చేశాక మరో ఆరుగురి పరిస్థితి బాగా లేకపోవడంతో రిమ్స్​లో అడ్మిట్ ​చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ లీడర్లు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. డీఈఓ ప్రణీత పాఠశాలకు చేరుకుని ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఈఓ, ఎస్ఓ సమక్షంలో సిబ్బంది వంట చేయగా బియ్యం, పప్పులో పురుగులు కనిపించాయి. దీంతో మరోసారి స్టూడెంట్లు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగగా, సెక్టోరియల్ ​ఆఫీసర్ ​జయశ్రీని, ఐదుగురు వంట మనుషులను సస్పెండ్​ చేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. ఇచ్చోడ సీఐ అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు.  హాస్టల్ కి అధికారులు మూడు రోజులు సెలవు ప్రకటించారు.  

సుల్తాన్​పూర్​ జేఎన్టీయూలో..

సంగారెడ్డి :  సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్ క్యాంటీన్ మెస్ లో సోమవారం రాత్రి భోజనం చేసిన పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తిన్న కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా నాణ్యతలేని భోజనం పెడుతున్నారంటూ ప్రిన్సిపాల్ , కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్ ను తొలగించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.