
కాళ్లు, చేతులు పాడైతున్నయ్
కరోనాతో గడ్డకడుతున్న నెత్తురు
ఆగుతున్న రక్త ప్రసరణ
గంటల్లోనే పాడవుతున్న అవయవాలు
వందలో ఇద్దరికే ఇలా అవుతోందంటున్న డాక్టర్లు
ఇప్పటివరకు 60 మందికి కాళ్లు, చేతులు తొలగింపు
హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారి వల్ల వందలాది మంది కాళ్లు, చేతులు, కంటి చూపు కోల్పోతున్నారు. వైరస్ ఎటాక్ వల్ల ఏర్పడే బ్లడ్ క్లాట్స్, బ్లాక్ ఫంగస్ వంటి ఇన్‌ఫెక్షన్లతో అవయవాలు పాడైపోతున్నయి. మన రాష్ట్రంలో సెకండ్ వేవ్‌లో దాదాపు 60 మంది కరోనా బాధితులు తమ కాళ్లు, చేతులు కోల్పోయారు. ఇందులో ఎక్కువ మంది ఒక కాలో, ఒక చేయో కోల్పోగా, కొంత మందికి రెండు కాళ్లు పోయాయి. దీనంతటికీ కరోనాతో ఏర్పడుతున్న బ్లడ్ క్లాట్స్ కారణమని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, బ్లడ్ క్లాట్స్ అయిన ప్రతి ఒక్కరిలో అవయవాలు తీసేయాల్సిన పరిస్థితి ఉండట్లేదని, సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే నయమవుతుందని అంటున్నారు. కరోనా వచ్చిన ప్రతి వందలో ఇద్దరికి బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతున్నట్టు లాన్సెట్ అధ్యయనంలో తేలింది. ఇందులో ఎక్కువశాతం మందికి సిరల్లో రక్తం గడ్డ కడుతుండగా, కొంత మందికి ధమనుల్లో రక్తం గడ్డ కడుతోంది. సిరల్లో బ్లడ్ క్లాట్స్ కంటే, ధమనుల్లో ఏర్పడే క్లాట్స్ చాలా ప్రమాదకరం. ఇవి కాళ్లు, లేదా చేతుల్లో ఏర్పడుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. కొంత మందికి కడుపులోని పేగుల్లో కూడా ఏర్పడుతున్నాయి. క్లాట్ ఏర్పడిన భాగంలో రక్త సరఫరా ఆగిపోయి, కొన్ని గంటల వ్యవధిలో ఆ భాగం చచ్చుబడిపోతోంది. మజిల్ పెయిన్, కాళ్లు లేదా చేతి వేళ్లు కదిలించలేకపోవడం, నల్లగా మారడం వంటి సింప్టమ్స్‌తో ప్రారంభమై ఆ భాగం మొత్తం పాడైపోతోంది. ఈ సింప్టమ్స్ స్టార్ట్ అయిన 6 నుంచి 8 గంటల్లోగా ఆపరేషన్ చేసి ఆ క్లాట్స్ తొలగించాల్సి ఉంటుంది. ఇంకా ఆలస్యమైతే కాళ్లు, చేతులు తీసేయాల్సి వస్తుంది. అలాగే ఉంటే, ఒకట్రెండు రోజుల్లోనే శరీరమంతా విషతుల్యమైపోయి లంగ్స్, హార్ట్ పనిచేయకుండా ఆగిపోతాయి. దీంతో మనిషి ప్రాణం పోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
రెండు రకాలు
ధమనులు గుండె నుంచి అవయవాలకు రక్తాన్ని తీసుకెళ్తే, సిరలు అవయవాల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్తాయి. సిరల్లో క్లాట్స్ ఏర్పడిన పది శాతం మందిలో ప్రాణం పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సిరల్లో ఏర్పడిన క్లాట్స్ గుండె నాళాల్లోకి వెళ్తే, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ ఊపిరితిత్తుల్లోని నాళాల్లోకి వెళ్తే శ్వాస ఇబ్బందులు ఏర్పడి, ఆక్సిజన్ లెవల్స్ పడిపోతాయి. ఈ రెండు కేసుల్లో మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమే ఎక్కువ. ఒక 10 శాతం కేసుల్లోనే ఈ సమస్యలు వస్తుండగా, 90 శాతం కేసుల్లో నార్మల్ ట్రీట్‌మెంట్‌తో కోలుకుంటున్నారు. ధమనులు మన శరీరంలో చాలా లోతుగా ఉంటాయి. గుండె నుంచి పంప్ అయ్యే మంచి రక్తాన్ని ఇవి శరీరంలో ప్రతి పార్ట్‌కూ తీసుకుపోతయి. శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ కూడా ఈ రక్తంలోనే ఉంటుంది. క్లాట్స్ ఏర్పడిన భాగంలో రక్త ప్రసరణ ఆగిపోయి, అక్కడి కణాలు పాడవుతున్నయి. ఇది ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తోంది. ఆలస్యం చేస్తే ఈ ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నయి. ఈ క్రమంలోనే జనాలు కాళ్లు, చేతులు కోల్పోతున్నారు. కొంత మందికి కడుపులోని పేగులకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో క్లాట్స్ ఏర్పడుతున్నయి. దీంతో పేగులు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
రెండు కాళ్లు పోయినయ్
ఏప్రిల్ 30న కరోనా వచ్చింది. మెడిసిన్ వాడిన. రెండు వారాలకు నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత రెండ్రోజులకు కాళ్ల నొప్పులు స్టార్ట్ అయినయి. హాస్పిటల్‌కు వెళ్తే మందులు రాసిచ్చారు. ఇంటికొచ్చే లోపలే ఒక కాలు లేవకుండా అయింది. తెల్లారేసరికి మరో కాలు పడిపోయింది. డాక్టర్‌కు చూపిస్తే కేర్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అప్పటికే కాళ్లు పాడవడంతో ఆపరేషన్ చేసి రెండు కాళ్లు తీసేశారు. అప్పు చేసి ఆపరేషన్‌కు డబ్బులు కట్టినం. - పడకంటి రాంచందర్, ప్రైవేట్ లెక్చరర్, హన్మకొండ
బ్లడ్ థిన్నర్స్ వాడాలె
సెకండ్ వేవ్‌లో మా దగ్గరికి 30 కేసులు వచ్చినయి. ఆరుగురికి కాళ్లు, నలుగురికి చేతులు తీసేయాల్సి వచ్చింది. దీనంతటికీ ఆర్టెరీస్‌లో ఏర్పడుతున్న బ్లడ్ క్లాట్సే కారణం. డయాబెటీస్, ఒబెసిటీ, ఆర్టెరీస్ డిసీజ్ బాధితుల్లో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటోంది. కరోనా మైల్డ్, మోడరేట్‌గా వచ్చినవాళ్లలోనూ బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతున్నయి. కొవిడ్ తర్వాత 6 వారాల వరకు డాక్టర్ల సలహా మేరకు బ్లడ్ థిన్నర్స్ ఉపయోగించడం మంచిది.
- డాక్టర్ పీసీ గుప్తా, హెచ్‌వోడీ, వస్క్యులర్ సర్జరీ డిపార్ట్‌మెంట్, కేర్ హాస్పిటల్స్
రెండ్రోజులకే బ్రెయిన్ స్ట్రోక్
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన జేరుపోతుల భాగ్య అంగన్వాడీ టీచర్. మే 3న కరోనా బారిన పడింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకోగా, మే 28న ఆమెకు నెగెటివ్ వచ్చింది. కాగా మే 30న బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆమె చనిపోయింది.
కండ్లను తినేస్తున్న ఫంగస్
నెల రోజులుగా దేశంలో వేలాది మంది బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. ఇది తొలుత సైనస్‌పై, ఆ తర్వాత కండ్లపై దాడి చేస్తోంది. కంటి వరకూ పాకితే కండ్లను తొలగించడమే తప్ప మరో మార్గం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కోఠి ఈఎన్టీ హాస్పిటల్‌లో గడిచిన 15 రోజుల్లో ముగ్గురికి ఒక్కో కన్ను తొలగించారు. గాంధీలో ఇద్దరికి కన్ను తీసేశారు. ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కలిపి దాదాపు 20 మంది బ్లాక్ ఫంగస్ కారణంగా కన్ను కోల్పోయారు.
రెండ్రోజులకే బ్రెయిన్ స్ట్రోక్
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన జేరుపోతుల భాగ్య అంగన్వాడీ టీచర్. మే 3న కరోనా బారిన పడింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకోగా, మే 28న ఆమెకు నెగెటివ్ వచ్చింది. కాగా మే 30న బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆమె చనిపోయింది.