కులాల వారీగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రహస్య భేటీలు

కులాల వారీగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రహస్య భేటీలు
  • హోరెత్తుతున్న హుజూరాబాద్
  • ఓ వైపు ప్రలోభపెడ్తూ .. మరోవైపు  బ్లాక్ మెయిల్ చేస్తున్న లీడర్లు 
  • దివ్యాంగుల కార్పొరేషన్  చైర్మన్ బెదిరింపుల వీడియో లీక్​
  • బీజేపీ తరఫున మండలానికో స్టార్ క్యాంపెయినర్ 
  • ఇంటికో ఓటు నినాదంతో కాంగ్రెస్ నేతల ప్రచారం 

హుజూరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: హుజూరాబాద్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ ప్రచారం పీక్స్ కు చేరింది. ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ఒక్కో అభ్యర్థి రోజుకు ఎనిమిది నుంచి పది ఊళ్లు తిరుగుతూ సెంటర్లలో మీటింగ్ లు పెడుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు బూత్ లెవల్ లో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అన్ని మండల కేంద్రాలు ప్రతి రోజు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ బహిరంగ సభలతో హోరెత్తుతున్నాయి. స్టార్ క్యాంపెయినర్ల ప్రసంగాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. మరో వైపు కొందరు నేతలు బహిరంగ సమావేశాలకు దూరంగా ఉంటూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఏరియాల వారీగా, కులాల వారీగా మీటింగ్స్ పెడుతూ సైలెంట్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆఫ్ ది రికార్డుగా అనేక విషయాలు మాట్లాడుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఉదయం ఎన్నికల ప్రచారంలో ఒక నేత తన ఎదుటి పార్టీపై విమర్శ చేస్తే సాయంత్రానికి దానికి మరో నేత కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్టింగులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రత్యర్థులపై బురద చల్లేందుకు, ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా అబద్ధాలే అస్త్రాలుగా మార్ఫింగ్ వీడియోలు, లెటర్లను వైరల్ చేస్తున్నారు. 

టీఆర్​ఎస్​ బుజ్జగిస్తూనే.. బెదిరింపులు
హుజూరాబాద్ నియోజకవర్గంలో వివిధ మండలాలు, మున్సిపాల్టీలు, గ్రామాల ఇన్ చార్జీలుగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు బహిరంగ సమావేశాలు పెట్టకుండా కులాలు, సెక్షన్ల వారీగా ఇంటర్నల్ మీటింగ్స్ పెడుతూ రాచమర్యాదలు చేస్తున్నారు.  ఓటేయాలని బుజ్జగిస్తూనే.. ఓటేయకపోతే పెన్షన్లు, దళితబంధు రావంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇల్లంతకుంట మండలం అంతడుపుల గ్రామంలో దివ్యాంగులు, వృద్ధులతో నిర్వహించిన సమావేశంలో ‘టీఆర్ఎస్​కు ఓటేయకుంటే పెన్షన్లు కట్ చేస్తం’ అని దివ్యాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. 

బీజేపీ తరఫున మండలానికో స్టార్ క్యాంపెయినర్.. 
హుజూరాబాద్ ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తరఫున మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వివేక్ వెంకటస్వామి, బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ మూడు నెలలుగా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈటల నిర్వహించిన ప్రజా దీవెన యాత్రలోనూ కీలక పాత్ర పోషించారు. వీరితోపాటు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత  స్టార్ క్యాంపెయినర్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కమిటీ సభ్యురాలు విజయశాంతి, దుబ్బాక ఎమ్మెల్యే  రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు  ఊరూరా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 20 నుంచి బండి సంజయ్, 22 నుంచి కిషన్ రెడ్డి నియోజకర్గంలోనే ఉంటూ క్యాంపెయిన్​లో పాల్గొంటున్నారు. ఒక్కో నేత రోజుకో మండలం తిరుగుతూ గ్రామాలన్నీ కవర్ చేస్తున్నారు. 

ఇంటికో ఓటు నినాదంతో కాంగ్రెస్ నేతల ప్రచారం 
కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బల్మూరి వెంకట్ కాస్త ఆలస్యంగా ప్రచారం ప్రారంభించినప్పటికీ.. కొంత మేరకు ప్రజల్లోకి వెళ్లగలిగారు. తక్కువ సమయంలో ఎక్కువ గ్రామాల్లో తిరిగేలా రూట్ మ్యాప్ తయారు చేసుకున్నారు.  హుజూరాబాద్ మినహా మిగతా నాలుగు మండల కేంద్రాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ప్రచార సభలు నిర్వహించారు. చివరి రోజు బుధవారం హుజూరాబాద్​లో ప్రచార సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటికో ఓటు నినాదంతో ఆ పార్టీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే.. కొత్తగా నిరుద్యోగ యువతను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్​రెడ్డి ప్రచారం, ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

క్యాండిడేట్స్​కు నిద్ర ఉండట్లే.. 
పోలింగ్ తేదీ దగ్గర పడడంతో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు తీరిక లేకుండా ప్రచారంలో ఉంటున్నారు. అర్ధరాత్రి 1, 2 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో గ్రౌండ్ రిపోర్టుపై చర్చిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకే లేచి మరుసటి రోజు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. దీంతో వారికి సరిపోను నిద్ర కూడా ఉండట్లేదు.

సీఎం రానట్లే.. ?  
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన పార్టీ ప్లీనరీలోనే.. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల గురించి మాట్లాడడం, ఇక్కడి నుంచే హుజూరాబాద్ ప్రజలు వింటున్నారని పేర్కొనడాన్ని బట్టి చూస్తే సీఎం హుజూరాబాద్​కు రాకపోవచ్చని తెలుస్తోంది. తొలుత 26 లేదా 27న పెంచికలపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించినప్పటికీ.. ఈసీ అనుమతి రాకపోవడం, రోడ్ షోలకు వచ్చే ఉద్దేశం సీఎంకు లేకపోవడంతో ఆయన ప్రచారానికి రాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. సీఎం ప్రచారానికి రారని తెలుస్తుండడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది.