ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సమ్మె బాట : జయలక్ష్మి

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సమ్మె బాట : జయలక్ష్మి

ఆదిలాబాద్, వెలుగు :  అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటంతోనే సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని అంగన్వాడీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. ఆదిలాబాద్​కలెక్టరేట్ ఎదుట చేపట్టిన అంగన్వాడీల సమ్మె పోరు సభలో ఆమె చీఫ్​ గెస్ట్​గా పాల్గొని మాట్లాడారు. 18 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, నిర్లక్ష్య వైఖరిని విడనాడీ రాష్ట్ర జేఏసీ నాయకత్వంతో చర్చలు సాగించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్​చేశారు. ఐసీడీఎస్ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 18న జాయింట్ మీటింగ్ ఏర్పాటుచేసి ఇచ్చిన హామీలను విస్మరించి అంగన్వాడీలకు నమ్మక ద్రోహం చేశారని ఫైర్​అయ్యారు.

కనీస వేతనం, ఉద్యోగ భద్రత, రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ అడిగితే చావు ఖర్చులకు ఇచ్చే జీఓలను తీసుకురావడం శోచనీయమన్నారు. మంత్రి హరీశ్​ రావు అంగన్వాడీల సమ్మెను అపహాస్యం చేసేలా మాట్లాడటం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వర్​రావు, కార్యదర్శి కూరపాటి రమేశ్, అంగన్వాడీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె.సునీత, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనాల మల్లేశ్, రైతు సంఘం అధ్యక్షుడు బండి దత్తాత్రి పాల్గొన్నారు.

అంగన్వాడీలను తిట్టిన చిన్నయ్యను ఓడించాలి

బెల్లంపల్లి రూరల్ : తమ సమస్యల్ని పరిష్కరించాలని విన్నవించడానికి వెళ్లిన అంగన్వాడీలను అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ అన్నారు. నెన్నెల మండల కేంద్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకు మహిళలంటే కనీస గౌరవం లేదని, వారితో మాట్లాడే భాష అదేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అంగన్వాడీ ల సమస్యలను పరిష్కరించకుండా..

అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగుల గొట్టి , వేరే వాళ్లతో నడిపిస్తామని వేధించడం పద్ధతి కాదన్నారు. పంతానికి పోకుండా వారితో చర్చలు జరిపి, సమ్మె విరమింప చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆశా వర్కర్ల సమ్మెకు మద్దతు ప్రకటించారు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాట్యుటీ కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేశవ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గోవర్దన్, నెన్నెల మండల ఉపాధ్యక్షులు గట్టు రాజన్న, గట్టు శివ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.