డెక్కన్ మాల్లో ఇంకా అదుపులోకి రాని మంటలు

డెక్కన్ మాల్లో ఇంకా అదుపులోకి రాని మంటలు

సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ లో నిన్న  జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లలో ఇంకా మంటలు వస్తూనే ఉన్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోని తేవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో బిల్డింగ్ వైపుకు ఎవరినీ అనుమతించడం లేదు. ఇవాళ కాలిన భవనాన్ని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు. భవనంలోని గోడౌన్ కు పర్మిషన్ లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో కొంత మంది బిల్డింగ్ సెల్లార్ లో చిక్కుకున్నారు. వారిపై ఇంకా స్పష్టత రాలేదు. పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బిల్డింగ్ యజమానిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని పరిశీలించనున్నారు.

ఈ అగ్నిప్రమాదంతో సిటీ ఉలిక్కిపడింది. ఉదయం 10.50 గంటలకు షార్ట్ సర్క్యూట్​తో సెల్లార్​లో మొదలైన మంటలు 5 అంతస్తుల బిల్డింగ్ మొత్తాన్ని చుట్టేశాయి. స్థానిక ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. దాదాపు 11 గంటల పాటు ఆరు ఫైరింజిన్లతో మంటలను ఆర్పుతున్నా అర్ధరాత్రి వరకు అదుపులోకి రాలేదు. ఒక దశలో బిల్డింగ్​లోని అద్దాలు భారీ  శబ్దాలతో పగిలిపోవడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది పరుగులు తీశారు. దట్టమైన పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల జనం భయాందోళనకు గురయ్యారు. అధికారులు స్థానికులను ఇండ్లు ఖాళీ చేయించి అక్కడి నుంచి పంపించి వేశారు. ప్రమాదం జరిగిన ఏరియాకు వెహికల్స్ రాకుండా ట్రాఫిక్ పోలీసులు డైవర్షన్ చేపట్టారు. మినిస్టర్ రోడ్ ను మూసివేసి ఇతర రూట్లలో వెహికల్స్ వెళ్లే ఏర్పాట్లు చేశారు.