సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లపై కాంగ్రెస్​ గురి

సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లపై కాంగ్రెస్​ గురి
  • వరుస చేరికలతో పుంజుకున్న అధికార పార్టీ
  • ఆరు గ్యారంటీలు గెలిపిస్తాయని శ్రేణుల ధీమా
  • మూడు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్​ నుంచి వచ్చిన నేతలే పోటీ
  • గ్రేటర్​ పరిధిలో ఆసక్తికరంగా పార్లమెంట్ ​ఫైట్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలోని మూడు ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది.అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా మంచి ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ, హైదరాబాద్​సిటీతోపాటు శివారు నియోజకవర్గాల్లో ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో లోకసభ ఎన్నికలను కాంగ్రెస్​ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

జీహెచ్ఎంసీతోపాటు,శివారు ప్రాంతాల పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలు ఉన్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాలను ఎలాగైనా గెలుచు కోవాల ని కాంగ్రెస్​ ప్లాన్​ చేస్తోంది. నాలుగు ఎంపీ స్థానాల పరిధిలో మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం మూడు చోట్ల మాత్రమే గెలిచింది. 

అది కూడా శివారులోని పరిగి, తాండూరు, వికారాబాద్ లో మాత్రమే గెలిచింది. బీఆర్ఎస్ 17 స్థానాల్లో విజయం సాధించగా, ప్రస్తుతం కంటోన్మెంట్​అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఓల్డ్​సిటీలోని ఏడు చోట్ల ఎంఐఎం, ఒక్కచోట బీజేపీ గెలిచాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రేటర్ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి.

 ఇతర పార్టీల నేతలు భారీగా తరలివచ్చి కాంగ్రెస్​పార్టీలో చేరారు. దీంతో అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్​బలం పుంజుకుంది. పైగా ప్రస్తుతం సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు నేతలు బీఆర్ఎస్​నుంచి వచ్చినవాళ్లే. అభ్యర్థుల సొంత వర్గం కాంగ్రెస్​పార్టీకి అదనపు బలం అవుతుందని నేతలు, శ్రేణులు భావిస్తున్నారు.

అసెంబ్లీ ఫలితాలు నిరాశపరిచినా.. 

గ్రేటర్​పరిధిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్​పార్టీని నిరాశపరిచినప్పటికీ, లోక్​సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్​పై ఫోకస్​పెట్టారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేస్తూనే.. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్​ బలం పెంచేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించారు. 

ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించగలిగారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ కు టచ్​లో ఉన్నట్లు సమాచారం. కొందరు నేరుగా కలిసినప్పటికీ పార్టీ మారుతున్నట్లు చెప్పలేదు. వారంతా పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 12 మంది కాంగ్రెస్​లోకి వస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ వెంటనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పి, కాంగ్రెస్​గూటికి చేరారు.

 తర్వాత చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి, ఆయన భార్య పట్నం సునీతారెడ్డి పార్టీ మారారు. సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా వీరిలోని ముగ్గురిని లోక్​సభ ఎన్నికల బరిలో దించారు. సిటీలో మాస్ లీడర్​గా పేరున్న దానం నాగేందర్​ను సికింద్రాబాద్ నుంచి పోటీకి నిలిపారు. దానం గతంలో గ్రేటర్ కాంగ్రెస్​ అధ్యక్షునిగా పనిచేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిటీలోని వ్యాపార వర్గాలతోపాటు బస్తీ జనాల్లో ఆయన పాపులర్. అందుకే సిట్టింగ్​ఎంపీ కిషన్​రెడ్డికి గట్టి పోటీ ఇవ్వాలని సీఎం రేవంత్​దానం నాగేందర్​ను ఎంచుకున్నారు. 

చేవెళ్ల ఆశించినప్పటికీ..

సునీతామహేందర్​రెడ్డి తొలుత చేవెళ్ల కాంగ్రెస్​ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ.. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్​లోకి రావడంతో సీఎం రేవంత్ ఆమెను తన నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ఎన్నికల బరిలో నిలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీచేసి ఓడిపోయిన రేవంత్​ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచారు. తర్వాత ఆయన దశ తిరిగిపోయింది. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి సీఎం కుర్చీ దక్కించుకునే దాకా వెళ్లింది. 

దీంతో ఆయన పట్టుబట్టి సునీతారెడ్డిని తన నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పారు. గెలిపించుకునే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్​నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేష్ ఇటీవల కాంగ్రెలో చేరారు. ఆయనకే బైఎలక్షన్​లో కాంగ్రెస్​టికెట్​ఇచ్చారు. ఇది కూడా తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.

రంజిత్​రెడ్డిపై రేవంత్ ​నమ్మకం 

చేవెళ్లలో సిట్టింగ్​ఎంపీరంజిత్​రెడ్డి సునాయాసంగా విజయం సాధిస్తారని సీఎం రేవంత్​నమ్ముతున్నారు. గ్రేటర్​పరిధిలో కాంగ్రెస్​గెలిచిన మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు చేవెళ్ల కిందికే వస్తాయి. మిగిలిన నాలుగు స్థానాల్లోనూ బీఆర్ఎస్ నుంచి పరోక్షంగా కాంగ్రెస్​కు మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రంజిత్​రెడ్డి గెలుపు కష్టం కాదని కాంగ్రెస్​అంచనా వేస్తోంది. ఒక్క హైదరాబాద్​సీటు మినహా మూడు ఎంపీ సీట్లను తమ ఖాతాలో పడుతాయని ధీమా వ్యక్తం చేస్తోంది.