రూ.5వేల కోట్లతో 119 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు

రూ.5వేల కోట్లతో 119 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు
  • రూ.5వేల కోట్లతో119 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు
  • రైల్వే శాఖ సహాయ మంత్రి రన్విత్ సింగ్​

సికింద్రాబాద్, వెలుగు: రైల్వే స్టేషన్​లను అధునాతన సదుపాయాలతో రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నామని రైల్వే శాఖ సహాయ మంత్రి రన్విత్ సింగ్ తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 119 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. అందులో భాగంగానే సికింద్రాబాద్​రైల్వే స్టేషన్​ను ఆధునీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశల వారీగా పెంచుతూ ప్రయాణికుల ఇబ్బందులను తగ్గిస్తామని వివరించారు. సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్​కుమార్​జైన్​తో కలిసి  మంత్రి శనివారం పరిశీలించారు. 

అనంతరం ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, 2026 కల్లా వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు 27శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను హరిత శక్తి స్టేషన్ గా దిద్దుతామని, నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్తు, మురుగునీటి శుద్ధి కర్మాగారాల కోసం సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వచ్చే 50 ఏండ్ల పాటు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయాలని యోచిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్​లో ఇప్పటికే ఉన్న మూడు  రైల్వే టెర్మినళ్లు ఉండగా.. చర్లపల్లిలో మరో టెర్మినల్ స్టేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ స్టేషన్ ను  త్వరలోనే ప్రారంభించనున్నట్టు మంత్రి వెల్లడించారు. అనంతరం సికింద్రాబాద్​ రైల్ నిలయంలో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, డబ్లింగ్​ లైన్ల పనితీరును సమీక్షించారు.