మిజోరంలో డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు

మిజోరంలో డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు

ఐజ్వాల్​: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. అధికారపార్టీ ఎంఎన్​ఎఫ్​, జెడ్​పీఎం, కాంగ్రెస్​మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. నిజానికి మిజోరం​లోనూ తెలంగాణ, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​ చత్తీస్​గఢ్​లతోపాటే కౌంటింగ్​ జరగాల్సి ఉంది.  ఆదివారం చర్చ్​లకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సోమవారం ఓట్లను లెక్కించాలంటూ పార్టీలు, ఎన్జీఓలు, స్టూడెంట్ యూనిట్లు చేసిన రిక్వెస్టుకు ఎలక్షన్​కమిషన్​ అంగీకరించింది. ఉదయం ఎనిమిదింటికి 13 సెంటర్లలో లెక్కింపు మొదలవుతుందని రాష్ట్ర అడిషనల్​ చీఫ్​ ఎలక్టోరల్​ ఆఫీసర్​ లయన్ ​జెలా చెప్పారు. 40 నియోజకవర్గాల కోసం ఒక్కో కౌంటింగ్​ హాల్​ను ఏర్పాటు చేశామని అన్నారు.

మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తామని, తరువాత ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్​ ఉంటుందని వివరించారు. కొన్ని సీట్లలో తక్కువ మంది ఓటర్లు ఉన్నందున రెండు రౌండ్లలోనే ఓటింగ్​ పూర్తవుతుందని అన్నారు. కౌంటింగ్​ కోసం నాలుగు వేల మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ గత నెల ఏడో తేదీన జరిగింది. మొత్తం 174 మంది పోటీపడగా, వీరిలో 18 మంది మహిళా క్యాండిడేట్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 8.57 లక్షలు. ఎంఎన్​ఎఫ్​, జెడ్​పీఎం, కాంగ్రెస్​ అన్ని స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 13 స్థానాలకు పరిమితమయింది.