దేశవ్యాప్తంగా CAA అమలు.. ఉత్తరాది రాష్ట్రాలలో భద్రతా బలగాలు అప్రమత్తం

దేశవ్యాప్తంగా CAA అమలు.. ఉత్తరాది రాష్ట్రాలలో భద్రతా బలగాలు అప్రమత్తం

లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను (CCA)  అమల్లోకి తీసుకొచ్చింది. బిల్లు ఆమోదం పొందిన నాలుగేళ్ల తర్వాత చట్టరూపం దాల్చింది. సీసీఏ చట్టాన్ని అమలుపరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం(మార్చి 11) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం అమల్లోకి రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉత్తరాది రాష్ట్రాలలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. 

ఈశాన్య ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలియజేశారు. రేపటి నుంచి విస్తృతంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా తెలుకుంటున్నట్లు వెల్లడించారు. "సున్నిత ప్రాంతాలలో పౌరుల భద్రత కోసం పారామిలటరీ బలగాలతో పాటు ఈశాన్య జిల్లా పోలీసు సిబ్బంది ఇంటెన్సివ్ పెట్రోలింగ్ తనిఖీలు చేశారు. ప్రతి ఒక్కరూ భద్రతా సూచనలను పాటించాలని పోలీసులు ప్రజలను అభ్యర్థించారు." 

ఉత్తరప్రదేశ్‌లో భారీ భద్రత 

సీఏఏ అమలు ప్రకటన అనంతరం ఉత్తరప్రదేశ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ప్రశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజలను రెచ్చగొట్టే కంటెంట్‌ను నియంత్రించడానికి సోషల్ మీడియాను పర్యవేక్షించాలని డిజిపి ప్రధాన కార్యాలయాన్ని కోరింది.

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు సంబంధిత ప్రాంతాల్లో కాలినడకన గస్తీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు సీసీటీవీ, డ్రోన్‌ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు.