
నేపాల్‌లో జరుగుతున్న హింసాత్మక నిరసనలు చూసిన తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ బుధవారం భారత రాజ్యాంగం ఎంత గొప్పదో ప్రశంసించారు. మన రాజ్యాంగం పట్ల మనం గర్వపడుతున్నాం... మన పక్క దేశంలో ఎం జరుగుతుందో చూడండి... నేపాల్‌లో ఎం జరిగిందో మనం చూస్తున్నాం అంటూ, సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఈ విధంగా అన్నారు. జస్టిస్ విక్రమ్ నాథ్ కూడా సీజేఐ మాటలను సమర్థించారు, బంగ్లాదేశ్‌లో కూడా ఇలాంటి ఉద్రిక్తతలు జరుగుతున్నాయని అన్నారు.
నేపాల్‌లో నిరసనలు: ప్రస్తుతం నేపాల్ జెన్-జెడ్(Gen-Z) ఆధ్వర్యంలో తీవ్ర హింసతో అతలాకుతలమవుతోంది. సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం వల్ల మొదట్లో నిరసనలు చెలరేగాయి, కానీ తరువాత అది కాస్త అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారింది. నిరసనకారులు కోపంతో వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు, ఆఫీసులు తగలబెట్టారు. దింతో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల ఇళ్ళులు కూడా ధ్వంసం అయ్యాయి.
దేశవ్యాప్తంగా అల్లకల్లోలం: నిరసనకారులను శాంతింపజేయడానికి పదే పదే కోరిన పట్టించుకోకపోవడంతో మంగళవారం సైన్యం నేపాల్ దేశాన్ని ఆధీనంలోకి తీసుకుంది. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి, సైన్యం దేశవ్యాప్తంగా కఠినమైన ఆంక్షలు విధిస్తూ, ప్రజలు గుంపులుగా తిరగడం, సమావేశాలు ఏర్పాటు చేయడం పై పరిమితులు విధించింది. పరిస్థితి మరింత అదుపుతప్పి దిగజారుతుండటంతో భద్రతా దళాలు ఈ విధంగా చర్యలు చేపట్టాయి.
Gen-Z నిరసనల ప్లాన్: నేపాల్‌లో జనరేషన్-జెడ్ నిరసనకారుల సమావేశం త్వరలో జరగనుంది. ఈ సమావేశంలో వారి ఉద్యమంలో తదుపరి ప్లాన్ ఏంటని నిర్ణయించడం, కొనసాగుతున్న సంక్షోభం నుండి ఎలా బయట పడాలో భవిష్యత్తు వ్యూహాలను రూపొందించనుంది.
గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ హింసాత్మక నిరసనల మధ్య 18 జిల్లాల్లోని జైళ్ల నుండి 6,000 మందికి పైగా ఖైదీలు తప్పించుకున్నారు. కొంతమంది ఖైదీలు గేట్లను పగలగొట్టి బయటకు వెళ్లగా, మరికొందరు జైలు గోడలను పగలగొట్టి పారిపోయారు.