తిరుమల వెంకన్న లడ్డూ కవర్‌‌లో వృక్ష ప్రసాదం

తిరుమల వెంకన్న లడ్డూ కవర్‌‌లో వృక్ష ప్రసాదం

పవిత్రమైన తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెద్ద పీట వేస్తోంది. కొండపై ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించిన టీటీడీ.. పర్యావరణ హితంగా ఉండే కవర్లను అందుబాటులోకి తెచ్చింది. తిరుమల శ్రీవారి ప్రసాదంతో పాటు వృక్ష ప్రసాదాన్ని కూడా అందిస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకెళ్లేందుకు గతంలో ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో ఉండేవి. అయితే కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించిన టీటీడీ.. ప్రస్తుతం వాటి స్థానంలో క్లాస్ బ్యాగ్స్, సీడ్ ఎంబెడెడ్ కవర్లను తీసుకొచ్చింది. గ్రీన్‌ మంత్ర అనే సంస్థతో కలిసి అందుబాటులోకి తెచ్చిన సరికొత్త పర్యావరణ హిత కవర్లు భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది కూడా. ఈ కవర్లను మట్టిలో కలిసిపోయేలా తయారు చేసినట్టు గ్రీన్ మంత్ర సంస్థ చెబుతోంది.

కవర్‌‌ను మట్టి కుండీలో పెట్టి నీళ్లు పోస్తే మొక్కలు

‘‘పర్యావరణాన్ని కాపాడుకుందాం.. స్వామివారి కృపకు పాత్రులవుదాం” అన్న క్యాప్షన్‌తో ఈ వృక్ష ప్రసాదం కవర్లను గ్రీన్ మంత్ర సంస్థ తయారు చేస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూలను తీసుకెళ్లిన భక్తులు ఈ సీడ్ ఎంబెడెడ్ కవర్లను మట్టి కుండీలో పెట్టి నీళ్లు పోస్తే తులసి మొక్కలు వస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కవర్ల తయారీకి చెట్ల బెరడు, కంద మూలాలనే ముడి పదార్థాలుగా వాడినట్లు తెలిపారు. అయితే ఈ కవర్లను మట్టిలో పెట్టేంత వరకు డీకంపోజ్ కావని చెప్పారు. భక్తులను పర్యావరణాన్ని కాపాడే యజ్ఞంలో భాగస్వాములను చేయడంతో పాటు మన సంస్కృతిలో ఎంతో విశిష్టత కలిగిన తులసి మొక్కలను ప్రతి ఇంట్లో ఉండేలా చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని గ్రీన్‌ మంత్ర సంస్థ అధికారులు చెప్పారు.