- విత్తనాలు, ఎరువుల సరఫరా బాధ్యతలు డీలర్లకు అప్పగింత
- ఈ నెల 30 వరకు వారం పాటు మేళా నిర్వహణ
- మేళాలో వరితో పాటు పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలు
- నానో యూరియా, నానో డీఏపీ అమ్మకాలకు ప్రత్యేక ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు : వానాకాలం సీజన్ ను దృష్టిలో పెట్టుకొని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం నుంచి రైతు వేదికల్లో విత్తన మేళా (సీడ్ మేళా) కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఇయ్యాల్టి నుంచి 30వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించే ఈ మేళాలో రైతులకు అవసరమైన వివిధ రకాల విత్తనాలు, ఎరువులను ఒకేచోట అందుబాటులో తీసుకురానున్నారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రైతులు డైరెక్ట్ గా రైతు వేదికలకే వెళ్లి తమకు అవసరమైన విత్తనాలను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. విత్తనాల సరఫరా, పంపిణీ బాధ్యతలను గుర్తింపు పొందిన డీలర్లు, సంస్థలకు అప్పగించినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
2,601 రైతు వేదికల్లో నిర్వహణ
రాష్ట్ర వ్యాప్తంగా 2,601కి పైగా ఉన్న రైతు వేదికల్లో ఈ విత్తన మేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేళాలో ప్రధానంగా రైతులు ఎక్కువగా సాగు చేసే, ప్రభుత్వం బోనస్ఇచ్చే ఏడు వరి రకాలైన బీపీటీ- 5204, ఆర్‌ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరాం, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-7715 విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు.
వీటితో పాటు పప్పుధాన్యాలైన కందులు, పెసర్లు, శనగ, మినుములు తదితర పప్పుధాన్యాల విత్తనాలను సిద్ధం చేశారు. సోయాతో పాటు అదేవిధంగా వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమలు వంటి నూనెగింజల పంటల విత్తనాలను సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. టమాటా, వంకాయ, గోరుచిక్కుడు, చిక్కుడు తదితర కూరగాయల విత్తనాలు కూడా ఈ మేళాలోవిక్రయించనున్నారు.
విత్తనాలతో పాటు వారి వివరాలు...
మేళాలో వరి రకానికి సంబంధించిన విత్తనాలు ఇవ్వడంతో పాటు వాటి పంట కాలం ఎన్ని నెలలు ఉంటుందన్న వివరాలను సైతం అందించనున్నారు. వరి రకాల దిగుబడి సామర్థ్యం, పంట రకానికి ఉండే రోగనిరోధక లక్షణాలు, సాగుకు అనుకూలమైన ప్రాంతాలు వంటి పూర్తి వివరాలను రైతులకు తెలియజేయనున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ రకం విత్తనం అనువైనదనే విషయాన్ని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించనున్నారు.
నానో యూరియా, నానో డీఏపీ అమ్మకం
వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ఖర్చును నియంత్రించే దిశగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా నానో యూరియా, నానో డీఏపీ ఉత్పత్తులను కూడా విత్తన మేళాలో అందుబాటులో తీసుకువస్తున్నారు. అదేవిధంగా పురుగుమందులు, సూక్ష్మపోషకాలు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లు కూడా రైతులకు ఒకే చోట లభించేలా ఏర్పాట్లు చేశారు.
రైతులు తమ ప్రాంతానికి అనువైన విత్తన రకాలను ఎంచుకుని సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద తగిన నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. వానాకాం సాగుకు ముందు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సమాచారం ఒకే చోట అందించాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
