- గ్యాస్ కొరతతో పనిచేయని డ్రయర్స్
- పంట కోతకాలం ముగిసినా కొనుగోళ్లకు ముందుకురాని కంపెనీలు
- వర్షం హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన
- భూపాలపల్లి జిల్లాలో 15వేల ఎకరాల్లో సీడ్ మక్క సాగు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మక్కజొన్న సీడ్ (ఆడ, మగ) సాగు చేపట్టిన రైతులకు పచ్చిమాసియా యుద్ధంతో తిప్పలు తప్పడం లేదు. పంట సాగుకు ముందు లాభాల ఆశ చూపిన కంపెనీలు కోతకాలం ముగిసినా కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నాయి. కంకులను ఆరబెట్టే డ్రయర్స్ మిషన్స్ కు గ్యాస్ కొరత కారణంగా కంపెనీలు పంటలను సకాలంలో ఎగుమతి చేయలేకపోవడం రైతులకు శాపంగా మారింది.
కోసిన పంటను పందులు, కోతుల నుంచి కాపాడేందుకు పంట పొలాల వద్దే కాపలా ఉంటున్నారు. మరోపక్క వాతావరణంశాఖ వానలున్నాయని చేస్తున్న హెచ్చరికలు, వడగండ్ల వానలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెరిగిన సాగు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది అధిక వర్షాలతో యాసంగి పంటగా రైతులు మొక్క జొన్న సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 31వేల ఎకరాల్లో మక్కజొన్న సాగు చేయగా, ఇందులో 15వేల ఎకరాల్లో 6వేల మంది రైతులు సీడ్ మక్క సాగు చేపట్టారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు కంపెనీలే కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఈ ఏడాది సీడ్ మక్కల సాగు వైపు మొగ్గు చూపారు.
జిల్లాలో ప్రధానంగా చాందని, పంచగంగ, అడ్వాంటా, సింజెంటా, శివమ్, బేయర్, ప్రోలైన్ కంపెనీలు రూ.3,200 నుంచి రూ.4000 క్వింటాల్ చెప్పున కొనుగోలు చేసేందుకు రైతులతో ఒప్పందం చేసుకుని సాగు చేపట్టారు. 120 రోజుల పంటకాలం ముగియగానే బెండుతో కొనుగోలు చేసేందుకు కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఇప్పుడు పంట కాలం పూర్తై కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నా కంపెనీలు అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు చెబుతున్నారు.
గ్యాస్ కొరతతో కంపెనీల వెనకడుగు..
పశ్చిమాసియా యుద్ధంతో ఏర్పడిన గ్యాస్ కొరత మక్క రైతులను వెంటాడుతోంది. సీడ్ మక్కలను కంపెనీలు నాణ్యతతో గ్రేడింగ్ చేసి తేమ శాతం 11శాతం కంటే తక్కువ ఉండేలా చేసి నిల్వ చేయనున్నట్లుగా కంపెనీ ఏజెంట్లు చెబుతున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన కంకులను డ్రయర్స్ (ఆరబెట్టే మిషన్) తో తేమలేకుండా చేస్తారు.
గ్యాస్ కొరతతో ఆయా మిషన్లు పనిచేయక పోవడంతో కొనుగోళ్లకు ఇబ్బందిగా మారింది. దీంతో కంపెనీలు రైతుల నుంచి వచ్చే సరుకులను దిగుమతి చేసుకోలేక పోతున్నాయి. లోడింగ్ పాయింట్ల వద్ద లారీలు రోజుల తరబడి వేచిఉండాల్సి రావడంతో రవాణా భారం అధికమవుతుందని కంపెనీలు కొర్రీలు పెట్టడం రైతులకు ఇబ్బందిగా మారింది.
ఆందోళనలో రైతులు..
కంకులను ఆరబేట్టేందుకు నానా తంటాలు పడుతున్న కంపెనీలు రైతుల చేతికి వచ్చిన మక్క పంటను కొనేందుకు ఆలస్యం చేస్తుండటంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. జిల్లాలోని చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లిలో 40 ఎకరాల్లో చాందని కంపెనీకి చెందిన మక్క సీడ్ సాగు చేపట్టిన రైతులు పంట కాలం పూర్తైనా కంకులను ఎగుమతి చేసుకునేందుకు కంపెనీ ఏజెంట్లు దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు.
దీంతో రైతులకు కంపెనీ ఏజెంట్లకు మధ్య కొనుగోళ్ల పంచాయితీ నడిచింది. విసుగు చెందిన రైతులు వారం కింద చిట్యాల పీఎస్లో ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల కింద కొనుగోళ్లు ప్రారంభించారు. ఇదే కంపెనీ కింద రేగొండ మండల కేంద్రంలో సాగు చేపట్టిన రైతులు పంట కోసి పదిరోజులవుతున్నా రేపు మాపు అంటుండడంతో, రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులనే జొన్నలుగా మార్చి ఆరబెట్టి ఇవ్వాలని వేడుకుంటుండగా, కొన్ని కంపెనీలు బీడు భూముల్లో కల్లాలు చేసి కంకులను ఎండబెడుతున్నారు. చేతికొచ్చిన పంటను కొనుగోలు చేయడంలో కంపెనీలు ఆలస్యం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పొలాల్లో ఆరబెడుతున్నా నల్లబడి పోతున్నాయని కంకుల్లో నాణ్యత దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందులు, కోతుల భారీ నుంచి పంటను కాపాడేందుకు చేన్ల వద్దనే కాపలా ఉండాల్సి వస్తుందని, దీనికి తోడు వడగండ్ల వానల హెచ్చరికలతో రోజూ పంటను కుప్పనూర్పాల్సి వస్తోందని రైతులు
పేర్కొంటున్నారు.
