అర్హు లందరికీ ఇందిరమ్మ ఇండ్లు : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

అర్హు లందరికీ ఇందిరమ్మ ఇండ్లు : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ప్రభుత్వం నిరుపేదలకు సంక్షేమ పథకాల అమలు ఒక్కొక్కటిగా అందిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు మండలంలో పర్యటించిన మంత్రి జగ్గన్నపేటలో రాజ్ కుమార్ నిర్మించుకున్న ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరయ్యారు. అనంతరం ములుగు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభించడంతోపాటు శానిటేషన్​ సిబ్బందికి కిట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయూ) జిల్లా మహాసభలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు నిత్యం కృషి చేస్తోందన్నారు. 

పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దే సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాలనీలను శుభ్రంచేస్తూ పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి శానిటేషన్​ సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. వేసవిలో నీటిఎద్దడి లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్​ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ సందర్భంగా యూనియన్​ సభ్యులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్​పర్సన్​ రేగ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.