ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తాం : సీతక్క

ప్రతి ఇంటికి సంక్షేమ  పథకాలు అందజేస్తాం : సీతక్క
  • ప్రజాపాలన సభలను ప్రారంభించిన మంత్రి సీతక్క  
  • భారీగా తరలివచ్చిన ప్రజలు.. దరఖాస్తుల వెల్లువ

జైనథ్, వెలుగు:  ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిందని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.  గురువారం  జైనథ్ మండలం జామిని గ్రామంలో  ప్రజాపాలన గ్రామసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు.  నేటి నుంచి జనవరి 6 వ తేదీ వరకు ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.   

100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.  అనంతరం దరఖాస్తు స్వీకరణకు ఏర్పాటు చేసిన కౌంటర్‌‌లను రిబ్బన్ కట్‌ చేసి ప్రారంభించి దరఖాస్తులను స్వీకరించారు.  అంతకుముందు గ్రామంలోని కొమురంభీం విగ్రహానికి మంత్రి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్త పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో డీఆర్డీవో  కిషన్, డీపీఓ  శ్రీనివాస్, ఎంపీడీఓ గజానంద్, జడ్పీటీసీ అరుంధతి, ఎంపీపీ గోవర్ధన్, సర్పంచ్ పెందూర్ కాంతాబాయి, ప్రజా ప్రతినిధులు,  అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.  

అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి

ఆసిఫాబాద్ , వెలుగు:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  దరఖాస్తుల స్వీకరణ కొరకు 1,335 కౌంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు . 

 ఓపికతో దరఖాస్తులు తీసుకోవాలి

నిర్మల్, వెలుగు:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించనున్నట్లు అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పేర్కొన్నారు. గురువారం ప్రజాపాలనలో భాగంగా ఆయన పలుచోట్ల వార్డు, గ్రామ సభలను సంద ర్శించి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ప్రజల నుంచి ఓపికగా దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలన్నారు. 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో గురువారం నిర్వహించిన  ప్రజాపాలన సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దరఖాస్తులు నింపడంలో కొంత గందరగోళం ఏర్పడినప్పటికీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి అప్లికేషన్లు స్వీకరించారు. అడిషనల్​ కలెక్టర్​ (రెవెన్యూ) సబావత్​ మోతీలాల్​ బెల్లంపల్లి మున్సిపాలిటీలో, మరో అడిషనల్​ కలెక్టర్​(లోకల్​ బాడీస్​) బి.రాహుల్​ జైపూర్​ మండలం నర్సింగాపూర్​లో లాంఛనంగా ప్రారంభించారు.   జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలోని 174 వార్డుల్లో వార్డు సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు. 58 గ్రామాల్లో 8,425, ఏడు మున్సిపాలిటీల్లో 23,315  అందాయి. 

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తాం

జైపూర్(భీమారం), వెలుగు: గురువారం ప్రజాపాలన గ్రామసభల నిర్వహణలో భాగంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. రాహుల్, డీఆర్డీవో  శేషాద్రి, మండల జడ్పీటీసీ భుక్యా తిరుమలతో కలిసి భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. భీమారం మండలంలోని నర్సింగాపూర్, ఆరేపల్లి, బూరుగుపల్లి , పోలంపల్లి నుంచి 287, జైపూర్ మండలంలోని ఇందారం, రామరావుపేట, గంగిపల్లి, పెగడపల్లి గ్రామాల నుంచి 1076  దరఖాస్తులను  స్వీకరించినట్లు పేర్కొన్నారు.  కార్య క్రమంలో తహసీల్దార్లు విశ్వంబర్, రమేశ్, డీటీ కృష్ణ, కమల్‌ సింగ్‌, ఎంపీడీవోలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

నాలుగుసార్లు దరఖాస్తు పెట్టినా పింఛన్​ రాలే...  

నా భర్త చనిపోయి అయిదేండ్లు అయితంది. ముసలిదాన్ని తిండికి తిప్పలు పడుతున్నా. పింఛన్​ కోసం గత ప్రభుత్వంలో నాలుగుసార్లు దరఖాస్తు చేసుకున్నా. ఇగ వస్తది, అగ వస్తది అనుడే కానీ రాలేదు. ఆఫీసుల సుట్టూ తిరిగి అల్సిపోయినా. ఇప్పుడయినా ఆఫీసర్లు, లీడర్లు నాకు పింఛన్​ ఇప్పించి ఆదుకోండ్రి.  
– కూన మైసమ్మ, పెగడపల్లి,  జైపూర్ మండలం