- కేటీఆర్, హరీశ్.. కళ్లల్లో నిప్పులు పోస్కుంటున్నరు: సీతక్క
- ఇందిరమ్మ చీరలపై బీఆర్ఎస్ లీడర్ల దుష్ప్రచారం
- సిరిసిల్ల నేతన్నలను అవమానిస్తున్నరు
- వాళ్లకు మహిళలే బుద్ధి చెప్తారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ చీరలపై బీఆర్ఎస్ లీడర్లు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘‘మహిళా సంఘాల సభ్యులు ఎంపిక చేసుకున్న డిజైన్లలోనే చీరలు ఇస్తున్నాం. కానీ కలర్ బాగాలేదని, డిజైన్ బాగాలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆడబిడ్డలకు మంచి జరుగుతుంటే కేటీఆర్, హరీశ్‌రావు ఓర్వట్లేదు. చీరలు అందుకుని ఆడబిడ్డలు సంబురపడ్తుంటే.. వాళ్లిద్దరూ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు” అని మండిపడ్డారు. ఇందిరమ్మ చీరలపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ సీతక్క బుధవారం వీడియో రిలీజ్ చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ లాగా తాము సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తీసుకొచ్చి పంపిణీ చేయడం లేదని అందులో పేర్కొన్నారు.
సిరిసిల్ల నేతన్నలు స్వయంగా నేసిన చీరలనే ఆడబిడ్డలకు పంపిణీ చేస్తున్నాం. కావాలంటే కేటీఆర్, హరీశ్, కవిత స్వయంగా సిరిసిల్లకు వెళ్లి నేతన్నలను అడిగి తెలుసుకోవచ్చు. కొందరు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కావాలని చీరలు బాగా లేవంటూ విమర్శలు చేస్తున్నారు. సిరిసిల్ల నేతన్నలను అవమానించేలా మాట్లాడుతున్నారు” అని మండిపడ్డారు. చీరలను మహిళా సంఘాల సభ్యులకే ఇస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని, కానీ సభ్యత్వం లేని వారిని సైతం సంఘాల్లోకి ఆహ్వానిస్తూ సారె పెడుతున్నామని పేర్కొన్నారు.
వాళ్లది ఫ్యూడల్ మెంటాలిటీ..
మహిళల కోసం తాము ఏం చేసినా బీఆర్ఎస్ నేతలు ఓర్వడం లేదని సీతక్క ఫైర్అయ్యారు. ‘‘మహిళల కోసం ఫ్రీ బస్సు పెడితే.. బస్సుల్లో ఆడబిడ్డలు బ్రేక్ డ్యాన్స్‌లు చేస్తున్నారని, కొట్టుకుంటున్నారని దుష్ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా తమ బుద్ధి మార్చుకుంటే మంచిది” అని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
ఏడాది కింద 65 లక్షల చీరలకు ఆర్డర్ ఇచ్చాం. అందరికీ ఇచ్చేందుకని ఇప్పుడు మరో 35 లక్షల చీరలకు ఆర్డర్ ఇచ్చాం. అబద్ధాలకు కేరాఫ్ హరీశ్‌రావు. గతంలో 60 ఏండ్లు పైబడిన వారిని మహిళా సంఘాల నుంచి తొలగించే నిబంధన ఉండేది. కానీ ఆ నిబంధనను మేం ఎత్తివేశాం. కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేర్చాలని.. వాళ్లకు సారె పెట్టి సంఘాల్లోకి ఆహ్వానిస్తున్నాం. అందులో తప్పేముంది? బీఆర్ఎస్ లీడర్లది ఫ్యూడల్ మెంటాలిటీ. ఆడవాళ్లకు మంచి జరుగుతుంటే తట్టుకోలేరు. మహిళలను అపహాస్యం చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లకు వాళ్లే తగిన బుద్ధి చెప్తారు” అని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన చీరలను మహిళలు చేన్లలో కట్టారని చెప్పారు. దుర్మార్గపు, నీచ రాజకీయాలు చేయడం బీఆర్ఎస్‌కే చెల్లుతుందని మండిపడ్డారు.
