చిన్న, సన్నకారు రైతులకు రైతుబంధు అందింది

చిన్న, సన్నకారు రైతులకు రైతుబంధు అందింది

ములుగు, వెలుగు: కేసీఆర్‌‌‌‌‌‌‌‌, కేటీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌‌‌‌‌రావు లాంటి బడా భూస్వాములకు తప్ప చిన్న, సన్నకారు రైతులకు రైతుబంధు డబ్బులు అందాయని మంత్రి సీతక్క చెప్పారు. చిన్న సమస్యను సైతం భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని విమర్శించారు. ములుగు మండలం ఇంచర్లలో బుధవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ రాగానే కరువు వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనపై ఎన్ని కుట్రలు చేసినా విజయం సాధించామని, ఈ సారి కూడా కార్యకర్తలు అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అంటేనే మాటకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. 

పదేళ్లలో బీజేపీ సర్కార్‌‌‌‌‌‌‌‌ చేసిందేమీ లేదని, అభివృద్ధి  ఏదని అడిగితే రాముడిని, అక్షింతలను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతీ ఏటా తప్పనిసరిగా భర్తీ చేస్తామని ఉద్యోగాలు ఎటు పోయాయని ప్రశ్నించారు. ఓడిపోతామన్న భయంతోనే కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సీఎంలను జైల్లో పెడుతోందని ఆరోపించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలకులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌లు చేస్తూ నీచ సంస్కృతికి తెర లేపారని విమర్శించారు. సమావేశంలో కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌‌‌‌‌‌‌‌, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.