రూ.కోటి  30 లక్షల విలువైన 560 కిలోల గంజాయి సీజ్

రూ.కోటి  30 లక్షల విలువైన 560 కిలోల గంజాయి సీజ్
  • ఒడిశా నుంచి సిటీ మీదుగా మహారాష్ట్రకి డీసీఎంలో తరలించే యత్నం
  • హిమాయత్​సాగర్ టోల్​గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు
  • ముగ్గురు అరెస్ట్.. రూ.కోటి  30 లక్షల విలువైన 560 కిలోల సరుకు సీజ్

శంషాబాద్, వెలుగు: ఆలుగడ్డల మధ్యలో గంజాయి ప్యాకెట్లను పెట్టి డీసీఎంలో తరలిస్తున్న గ్యాంగ్​కి చెందిన ముగ్గురిని శంషాబాద్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం..  మహారాష్ట్రకి చెందిన నౌషద్, సలీం(38), షేక్ రెహన్(25), షేక్ వాసీం(38), ఒడిశాకు చెందిన సంతోష్ ఐదుగురు గ్యాంగ్​గా ఏర్పడి గంజాయి సప్లయ్ చేసేవారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు సిటీ మీదుగా గంజాయిని తరలించేవారు. శుక్రవారం డీసీఎంలో ఆలుగడ్డల మధ్యలో 560 కిలోల గంజాయి ప్యాకెట్లను పెట్టి ఒడిశా నుంచి ఈ గ్యాంగ్ మహారాష్ట్రకు బయలుదేరింది. శనివారం ఓఆర్ఆర్ మీదుగా హిమాయత్ సాగర్ టోల్ గేట్ వద్దకు చేరుకోగానే శంషాబాద్ జోన్ పోలీసులు డీసీఎంను ఆపి తనిఖీలు చేశారు. ఆలుగడ్డల లోడ్ మధ్యలో గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్​ను అరెస్ట్ చేశారు. డీసీఎంకి ముందు వెళ్తున్న ఓ కారును సైతం అనుమానంతో పోలీసులు అడ్డుకుని అందులో ఉన్న ఇద్దరు సప్లయర్స్ ను సైతం  అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. కోటి 30 లక్షలు ఉంటుందని, ప్రధాన నిందితులు నౌషద్, సంతోశ్ పరారీలో ఉన్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. కేసును ఛేదించిన శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి,  రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, శంషాబాద్ జోన్ ఎస్ వోటీ ఇన్ స్పెక్టర్ వెంకట్ రెడ్డిని అభినందించారు. 

బ్రౌన్ షుగర్ సప్లయ్.. నలుగురు అరెస్ట్
నేరెడ్​మెట్: బ్రౌన్ షుగర్  అమ్ముతున్న వ్యక్తితో పాటు ముగ్గురు కస్టమర్లను మల్కాజిగిరి ఎస్ వోటీ, నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నేరెడ్​మెట్​లోని డీసీపీ ఆఫీసులో మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి వివరాలు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్​కి చెందిన ఎండీ అక్తర్ ఉజ్మాన్(26) కొంతకాలం కిందట సిటీకి వచ్చి గచ్చిబౌలిలో ఉంటూ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ హెల్పర్​గా పనిచేస్తున్నాడు. డ్రగ్స్ సప్లయ్​ కోసం వెస్ట్ బెంగాల్ కి చెందిన షాజహాన్, ఒప్పు అనే ఇద్దరిని కలిశాడు. అక్కడి నుంచి సిటీకి డ్రగ్స్ సప్లయ్ చేయడం మొదలుపెట్టాడు. జార్ఖండ్ కి చెందిన షేక్ దనిశ్(22), మెహబూబ్ ఖాన్(23), ఎండీ నజీర్(24) సిటీలో ఉంటూ బిల్డింగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు ఉజ్మాన్ దగ్గర బ్రౌన్ షుగర్ కొనేవారు.  అప్పుడప్పుడు గచ్చిబౌలిలో ఉండే మెహతాబ్ ఆలం దగ్గర కూడా వీళ్లు డ్రగ్స్ కొనేవారు. శుక్రవారం రాత్రి దనిశ్, మెహబూబ్, నజీర్ మల్లాపూర్ చౌరస్తా వద్ద అక్తర్ ఉజ్మాన్ వద్ద బ్రౌన్ షుగర్​ను కొంటుండగా.. మల్కాజిగిరి ఎస్ వోటీ, నాచారం పోలీసులు వారిని పట్టుకున్నారు. ఉజ్మాన్​తో పాటు కస్టమర్లు దనిశ్, మెహబూబ్ ఖాన్, నజీర్​ను అదుపులోకి తీసుకున్నారు. రూ. లక్ష విలువైన 16 గ్రాముల బ్రౌన్ షుగర్, రూ.1900 క్యాష్  సీజ్ చేశారు. నిందితులను రిమాండ్​కి తరలించినట్లు డీసీపీ తెలిపారు.