క్రికెట్‌ సెన్స్‌ లేని వారు సెలెక్టర్లు.. బుద్ధిన్నోళ్లు అతన్ని కెప్టెన్ చేస్తారా?

క్రికెట్‌ సెన్స్‌ లేని వారు సెలెక్టర్లు..  బుద్ధిన్నోళ్లు అతన్ని కెప్టెన్ చేస్తారా?

ప్రాంచైజీ క్రికెట్‌లో చెలరేగి ఆడే భారత క్రికెటర్లు, ఐసీసీ టోర్నీలకు వచ్చేసరికి బిక్కుమొహం వేస్తున్నారు. ధోని సారథ్యంలో 2013లో ఐసీసీ ట్రోఫీ(ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన భారత జట్టు.. ఆనాటి నుంచి ఇప్పటివరకూ పదేళ్లు గడిచినా మరో ట్రోఫీ అందుకోలేదు. పోనీ అవకాశాలు రావట్లేదా? అంటే కాదు. వచ్చిన అవకాశాలను  రెండు చేతులా వడిసి పట్టుకోవడం లేదు. . అందుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్.. ప్రత్యక్ష ఉదాహరణ. డబ్ల్యూటీసీ రూపంలో టైటిల్ గెలిచే అవకాశం ఉన్నా.. పేలవ ఆటతీరుతో ఆ అవకాశాన్ని పోగొట్టారు. 

ఎందుకలా జరుగుతోంది?  దేశంలో నాణ్యమైన ఆటగాళ్లు లేరా? అంటే కాదు. రాణించే ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడమే ఓటములకు కారణం. అందుకే జట్టును ఎంపిక చేసే సెలెక్టర్లపై మాజీ క్రికెటర్, ఒకప్పటి బీసీసీఐ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ విమర్శలు గుప్పించారు. బీసీసీఐ ఎంపిక కమిటీ తీరును తప్పుబట్టిన వెంగ్‌సర్కార్.. సెలక్షన్‌ కమిటీలో కొందరికి వారు చేస్తున్న పని ఏంటో కూడా తెలియదని విమర్శించారు. అందుకు శిఖర్‌ ధావన్‌ కెప్టెన్సీని  ఒక ఉదాహరణగా చూపారు. 

"సెలెక్టర్లలో కొందరికి వారు చేస్తున్న పనిపై లోతైన పరిజ్ఞానం లేదు. దూరదృష్టి అంతకన్నా లేదు. ఇలా చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరం. ఉదాహరణకు 2021లో మనం ఒకేసారి ఎక్కువ సిరీస్‌లు ఆడాల్సి వచ్చింది. రెగ్యులర్ కెప్టెన్ ఇంగ్లండ్‌కు పయనమైతే.. శ్రీలంక సిరీస్‌కు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌ను చేశారు. ఇది ముమ్మాటికీ తప్పు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే భవిష్యత్తు తరాలకు మరో కొత్త కెప్టెన్‌ని  తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఎవరో ఒకరితో ఆడించాలన్నా తాపత్రయం తప్ప దూరదృష్టి లేదు." 

"ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు తమదని మాట్లాడుకోవడానికే బీసీసీఐ. బెంచ్‌ బలం ఎక్కడుంది? ఐపీఎల్‌ నిర్వహిస్తూ.. మీడియా హక్కుల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తే సరిపోతుందా? విజయమంటే అది ఒక్కటే కాదు.." అని వెంగ్‌సర్కార్‌ విమర్శించారు. డబ్ల్యూటీసీ ఓటమీ నేపథ్యంలో రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయి. అటు వయసు కూడా పెరుగుతుండటంతో అతడిని తప్పించాలన్నా డిమాండ్ కూడా జోరందకుంది. పోనీ అలా చేయాలన్నా.. మరో బలమైన నాయకుడు జట్టులో కనిపించడం లేదు. జస్ప్రీత్ బుమ్రా అని ఒకరు, శ్రేయాస్ అయ్యర్ అని మరొకరు ఎవరికీ నచ్చింది వారు చెప్తున్నారు. భారత జట్టు తదుపరి నాయకుడు ఎవరో కాలమే నిర్ణయించాలి.