హలో.. ఫ్రమ్ ది మెలోడీ టీమ్

హలో.. ఫ్రమ్ ది మెలోడీ టీమ్
  •     మోదీతో ఇటలీ ప్రధాని మెలోనీ సెల్ఫీ వీడియో
  •     సోషల్ మీడియాలో వైరల్  

బారి(ఇటలీ) : ప్రధాని మోదీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చిన్న సెల్ఫీ వీడియో దిగారు. ఇద్దరూ నవ్వులు చిందిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటలీలో జరిగిన జీ7 సమిట్ సందర్భంగా మోదీతో మెలోనీ ఐదు సెకండ్ల సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోను శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. ‘హలో ఫ్రమ్ ది మెలోడీ టీమ్’ అంటూ అందులో మెలోనీ పేర్కొన్నారు. ‘హాయ్ ఫ్రెండ్స్.. ఫ్రమ్ మెలోడీ’ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చారు. మెలోడీ హాష్ ట్యాగ్​తో మెలోనీ పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. 

ఆ వీడియోను ఆయన షేర్ చేస్తూ.. ‘ఇండియా, ఇటలీ స్నేహబంధం కలకాలం వర్ధిల్లాలి’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఇంతకుముందు కూడా మోదీ, మెలోనీ సెల్ఫీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోయినేడాది డిసెంబర్ లో దుబాయ్ లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (కాప్ 28) సమావేశం సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను మెలోడీ హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో మెలోనీ పోస్టు చేశారు. దానికి ‘గుడ్ ఫ్రెండ్స్ ఎట్ కాప్ 28’ అని క్యాప్షన్ పెట్టారు. అది అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలా మెలోడీ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

తిరిగొచ్చిన మోదీ.. 

జీ7 సమిట్ లో పాల్గొన్న మోదీ.. శనివారం తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటన ఇది. జీ7 సమిట్ సందర్భంగా వివిధ దేశాల అధినేతలతో మోదీ సమావేశమయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, పోప్ ఫ్రాన్సిస్ తదితరులతో మోదీ భేటీ అయ్యారు.