సీనియర్ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం..

సీనియర్ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం..
  • 15 రోజుల వ్యవధిలో కరోనాతో భర్త, కొడుకుల మృతి
  • భర్త దశరథ్ నిన్న మృతి... ఇదే నెల 14న కుమారుడు మృతి..

హైదరాబాద్: దక్షిణాది సినిమాల్లో రెండు దశాబ్దాలుగా కీలక నటిగా ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం ఏర్పడింది. కేవలం రెండు వారాల వ్యవధిలో చేతికి అందివచ్చిన కుమారుడితోపాటు భర్తను పోగొట్టుకుంది. జూన్ 14న కరోనాతో అస్వస్థతకు గురైన కవిత కుమారుడు సంజయ్ రూప్ కోలుకోలేక మృతి చెందిన విషయం తెలిసిందే. కొడుకు ఆస్పత్రిలో కరోనాతో పోరాడలేక విలవిలలాడుతుంటే చూసిన కవిత భర్త దశరథ్ రాజ్ భరించలేక అస్వస్థతకు గురయ్యాడు. ఈయనకు కూడా కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.  కొడుకు శాశ్వతంగా దూరమైన తరుణంలో దగ్గరుండి ఓదార్చాల్సిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే ఆమె ఆవేదనతో కుమిలిపోయింది. రేపో మాపో భర్త ఇంటికి క్షేమంగా తిరిగొస్తాడని భావిస్తున్న తరుణంలో నిన్న మంగళవారం తుదిశ్వాస విడిచారు. రెండు వారాల వ్యవధిలో కుమారుడు, భర్తను పోగొట్టుకోవడంతో సీనియర్ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం ఏర్పడింది. 

సినీనటి కవిత పశ్చిమ గోదావరి జిల్లాలోని నడమర్రులో 1965 సెప్టెంబర్ 28న జన్మించింది. పుట్టిన పసికందుగా.. ఆరు నెలల వయసులోనే కవిత తల్లిదండ్రులు హైదరాబాద్ కు మకాం మార్చారు. తర్వాత ఆరేళ్లకు మద్రాస్ కు వెళ్లిపోయారు. అక్కడ వ్యాపారాలు బాగా జరుగుతాయనే నమ్మకంతో వెళ్లిన కవిత తల్లిదండ్రులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. తిండిపెట్టలేని పరిస్థితిలో ఉండడంతో మద్రాసులో తెలుగువారి కోసం ఉచితంగా చదువు చెప్పే ప్రభుత్వ స్కూలులో కవిత చదువుకుంది. చదువుకుంటున్న తరుణంలోనే 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కృష్ణయ్య అనే నిర్మాత కవిత తండ్రికి పరిచయమయ్యాడు. తండ్రి బలవంతం మీద సినిమా అడిషన్ కు హాజరై తమిళ సినిమాలో అవకాశం దక్కించుకుంది. మరో వైపు 1977లో కె.విశ్వనాథ్ అపురూప కళాఖండం ‘సిరిసిరిమువ్వ’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అలా  11 ఏళ్ల వయసులోనే సినీరంగంలో కెరీర్ ప్రారంభించింది. ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో కవిత హీరోయిన్ జయప్రదకు చెల్లిగా నటించింది. 
చిన్నతనంలోనే మద్రాసులో ఉండి చదువుకోవడం వల్ల చలాకీ రూపంతో అవకాశాలు దక్కించుకున్న కవిత తమిళ, తెలుగు సినిమాలతోపాటు కన్నడ, మళయాళం సినిమాల్లో కూడా 130కిపైగా సినిమాల్లో నటించింది. 
కవిత నటించిన సినిమాలు
పొట్టేలు పున్నమ్మ, ప్రసిడెంట్ పేరమ్మ, కదిలి వచ్చిన కనకదుర్గ, సోగ్గాడు, శభాష్ గోపి, అల్లుడు పట్టిన భరతం, బొమ్మల కొలువు, రక్త సంబంధం,గోల నాగమ్మ, చండీ చాముండీ, పల్లెటూరి పిడుగు,ప్రళయగర్జన, బందిపోటు రుద్రమ్మ, మాయగాడు, ప్రేమ దీపాలు, హై క్లాస్ అత్త లోక్లాస్ అల్లుడు, నిన్నే పెళ్లాడుతా, హోటీ, అదిరిందయ్యా చంద్రం, సీతారాముడు, గల్లీ కుర్రోళ్లు తదితర సినిమాల్లో నటించింది. కెరీర్ ఉజ్వలంగా ఉన్న సమయంలోనే అంటే 1984లో సింగపూర్ కు చెందిన వ్యాపారవేత్త దశరథ్ రాజ్ తో పెళ్లి జరిగింది. ముగ్గురు కమార్తెలు, ఒక కొడుకు సంతానం. పెళ్లి తర్వాత పూర్తిగా కుటుంబానికే పరిమితమై సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. అడపా దడపా క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూనే ఉంది. 
 1999లో చంద్రబాబు సీఎం అయ్యాక తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లో చేరినా ఎలాంటి పదవులు ఆశించకుండా పనిచేసింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆమెకు సముచితమైన గౌరవం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసింది. 
హైదరాబాద్ లో స్థిరపడ్డ కవిత తన చేతనైన రీతిలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ‘‘హెల్పింగ్ హ్యాండ్స్’’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి పేద పిల్లలను చదివించి.. ఉద్యోగాలొచ్చి స్థిరపడే వరకు సాయం చేసింది. అలాగే పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు జరిపించి తన వంతు సాయం చేసినా వీటి గురించి పెద్దగా ప్రచారం చేసుకోలేదు.