
- మొదటినుంచి పార్టీలోఉన్నోళ్లను పట్టించుకోరా?
- ఫిరాయించినోడికి సభ్యత్వమే లేదు.. పదేండ్లు దోచుకున్న అనుభవం ఉంది
- ఆలయ కమిటీ పదవులన్నీ బీఆర్ఎస్ వాళ్లకే ఇస్తున్నరు
- కాంగ్రెస్ సీనియర్ నేత ఆవేదన
జగిత్యాల, వెలుగు: మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనను రాజకీయంగా బలి చేశారని, ప్రస్తుతం తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు వాళ్లిద్దరే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి అడ్లూరి ఎదుటే ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంఖ్యా బలం ఉన్నప్పటికీ చేరికలను ప్రోత్సహించారని విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని పార్టీలో చేర్చుకున్నప్పుడు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ మధ్యవర్తిత్వం వహించి జీవన్ రెడ్డిని బుజ్జగించారు.
నాడు తాను అదే పట్టుదలతో ఉంటే తన వర్గానికి మంచి జరిగేదని భావిస్తున్న జీవన్‌రెడ్డి.. మంత్రులిద్దరు అడ్డుకోకపోతే ఆ రోజే కథ వేరుగా ఉండేదని, 24 గంటల్లో పదవులు వచ్చేవన్నారు. అయినా తనకు పదవులు అవసరం లేదని, ఇకపై కార్యకర్తలను కాపాడుకోవడమే తన పని అని స్పష్టం చేశారు. “పార్టీలోకి ఫిరాయించి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారా? మొదటి నుంచే ఉన్న నిజమైన కార్యకర్తలను పట్టించుకోరా?” అని ప్రశ్నించారు.
ఫిరాయించిన వారికి ఇప్పటికీ కాంగ్రెస్సభ్యత్వం లేదని, అయినా వారే నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు పదేళ్ల దోపిడీ అనుభవం ఉందన్నారు. ‘మేం కాంగ్రెస్‌లో కౌలుదారులం కాదు.. పట్టాదారులం’ అని స్పష్టం చేశారు. మమ్మల్ని హలాల్ చేస్తూ కొద్దికొద్దిగా చంపొద్దని, కావాలంటే ఒక్క జట్కాలా నరికేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ సిద్ధాంతం ఏమిటో అర్థం కావడం లేదు. ఫిరాయించిన వాళ్లు చెప్తేనే పనులు జరుగుతున్నాయి. వలసదారుల్లా దోచుకునే వాళ్లం కాదు.. నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలి’ అని కోరారు.
బీఆర్ఎస్ లీడర్లకే ఆలయ కమిటీ పదవులు
నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా కింద తాను పోరాడుతున్నానని జీవన్ రెడ్డి చెప్పారు. పార్టీలో ఉన్న నిజమైన కార్యకర్తలను పక్కన పెట్టి.. బీఆర్ఎస్ నాయకులకు బీర్పూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కమిటీల్లో పదవులు ఇస్తున్నారని విమర్శించారు.
పెంబట్ల దేవాలయం మినహా, మిగతా అన్ని కమిటీలు బీఆర్ఎస్ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయని, పొలాస పౌలస్తేశ్వర స్వామి ఆలయ కమిటీలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరులకు స్థానం కల్పించారని ఆరోపించారు. పార్టీలో తాము ఉండడం ఇష్టం లేకుంటే బయటకు పంపాలన్నారు. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వలసదారుల ముందు తలవంచనని స్పష్టం చేశారు. కాగా, జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు.