- బీజేపీ హయాంలో బొగ్గు కుంభకోణం
- లో గ్రేడ్ కోల్ సప్లై చేస్తూ హై క్వాలిటీ డబ్బులు వసూలు
- అదానీకి వేల కోట్లు దోచిపెడ్తున్న మోదీ
- టెంపోలు పంపి ఈడీ, సీబీఐ నోరు మూయిస్తున్నరని ఫైర్
న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో భారీ బొగ్గు కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఫ్రెండ్ అదానీకి బొగ్గు రూపంలో వేల కోట్లు దోచిపెడ్తున్నారని ఆరోపించారు. తక్కువ క్వాలిటీ బొగ్గును సప్లై చేస్తూ.. అత్యంత ఖరీదైన క్లీనర్ ఫ్యూయెల్‌గా చెప్తూ వేల కోట్ల రూపాయలు అదానీ దండుకుంటున్నారని ఆరోపించారు. తమిళనాడు పీఎస్‌యూతో జరిపిన లావాదేవీలతో ఈ కోల్ స్కామ్ బయటికి వచ్చిందన్నారు. దీనికి సంబంధించిన కొన్ని కథనాలు మీడియాలో కూడా వచ్చాయన్నారు.
ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ బొగ్గు స్కామ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ‘‘అదానీ కంపెనీ... తక్కువ క్వాలిటీ బొగ్గును సప్లై చేస్తూ సాధారణం కంటే మూడింతలు ఎక్కువ డబ్బులను దోచుకుంటున్నది. ఇలా చేయడంతో కరెంట్ ఉత్పత్తి చేసే కాస్ట్ పెరుగుతున్నది. చివరికి కరెంట్ బిల్లులు పెంచడంతో పేద ప్రజల జేబులకు చిల్లులు పడ్తున్నాయి. ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) రిపోర్టు.. కోల్ స్కామ్ గురించే చెప్తున్నది.
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, అదానీ కంపెనీ మధ్య జరిపిన ట్రాన్సాక్షన్లతో ఈ బొగ్గు స్కామ్ బయటికి వచ్చింది. లో గ్రేడ్ బొగ్గు సప్లై చేస్తూ.. ఖరీదైన క్లీనర్ ఫ్యూయెల్ పంపిస్తున్నామంటూ వేల కోట్ల రూపాయలు అదానీ దోచుకుంటున్నరు’’అని రాహుల్ ఆరోపించారు. ఓపెన్ గా జరుగుతున్న కోల్ స్కామ్‌పై ఎలాంటి దర్యాప్తు జరపకుండా ఉండేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులకు ప్రధాని మోదీ ఎన్ని టెంపోలు పంపించారని రాహుల్ ప్రశ్నించారు. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఈ స్కామ్‌పై లోతుగా విచారణ జరిపిస్తామన్నారు.
అగ్నివీర్ స్కీమ్ చెత్తబుట్టలోకే..
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ స్కీమ్‌ను చెత్తబుట్టలో పడేస్తామని రాహుల్ అన్నారు. మిలటరీ అధికారులకు కూడా ఈ స్కీమ్ నచ్చడం లేదని తెలిపారు. జవాన్లను కూలీల మాదిరి చూస్తున్నారని ప్రధాని మోదీపై మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హర్యానాలోని మహేంద్రఘడ్, భివానీ లోక్‌సభ సెగ్మెంట్లలో నిర్వహించిన ప్రచారంలో రాహుల్ పాల్గొని మాట్లాడారు.
రైతుల రుణమాఫీ కోసం కమిషన్ తెస్తం..
కేంద్రంలో అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తామని, ఇందుకోసం ‘కర్జా మాఫీ’ కమిషన్ తీసుకొస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ఈమేరకు హర్యానాలోని మహేంద్రగఢ్‌లో రాహుల్ మాట్లాడుతూ.. జూన్ 4న కేంద్రంలో అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీ చేస్తాం. దీనికోసం ‘కర్జా మాఫీ’ (ఖర్చుల మాఫీ) కమిషన్ తీసుకొస్తామని చెప్పారు. యూపీఏ హయాంలో రైతుల రుణాలు మాఫీ చేయగా.. మోదీ మాత్రం కేవలం 22 మంది ధనికులు తీసుకున్న అప్పులు మాత్రమే మాఫీ చేస్తున్నాడని విమర్శించారు. ఇది ముమ్మాటికీ దేశ ప్రజలను అవమానించడమేనని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
