
- నేడో, రేపో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ప్రకటన
- ఈ ఏడాది జనవరిలో లొంగిపోయిన ఆయన భార్య తార
- 2011లో వేణుగోపాల్ అన్న కిషన్ జీ ఎన్కౌంటర్
- సంక్షోభ సమయంలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్
- అనారోగ్యం, పార్టీ పంథా విషయంలో విభేదాలతోనే సరెండర్
కరీంనగర్ / పెద్దపల్లి, వెలుగు:సీపీఐ(మావోయిస్టు) అగ్రనేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సరెండరయ్యారు. ఈ లొంగుబాటును పోలీసులు ధ్రువీకరించనప్పటికీ.. లొంగుబాటు నిజమేనని చత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ప్రకటించారు. మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించాలని, త్యాగాలు వృథా అవుతున్నాయని వేణుగోపాల్ ఇటీవల ప్రకటించాక.. ఆయన లొంగిపోతారంటూ వార్తలు వచ్చాయి. అంతా భావించినట్లుగానే ఆయన సరెండర్ అయ్యారు. కాగా, మల్లోజుల లొంగుబాటును మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ బుధ లేదా గురువారం ప్రకటించే అవకాశం ఉంది.
నాడు భార్య.. నేడు భర్త..
వేణుగోపాల్ భార్య, గడ్చిరోలి దళసభ్యురాలు సిడాం విమలచంద్ర అలియాస్ తారక్క 2024, డిసెంబరు 31న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలోనే 10 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు. తాజాగా వేణుగోపాల్ కూడా భార్య బాటలోనే మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయేందుకు సిద్ధం కావడం గమనార్హం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అవుతారని ఒక దశలో భావించిన కీలకనేత లొంగిపోవడం ఆ పార్టీకి కోలుకోని దెబ్బగా పోలీసులు, ఇటు పార్టీ సానుభూతిపరులు భావిస్తున్నారు.
మల్లోజుల వేణుగోపాల్‌కు ప్రస్తుతం 70 ఏండ్లు. ఇప్పటివరకు ఆయనపై 100కుపైగా కేసులు, ఆయన తలపై రూ.కోటి రివార్డు ఉన్నట్లు తెలిసింది. ‘తుపాకీగొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అనే నినాదం వెలుగులో మావోయిస్టు పార్టీ దేశంలో ఐదు దశాబ్దాలుగా సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్నది. కీలకమైన ఈ పంథానే ఇప్పుడు వేణుగోపాల్ తప్పుబడుతూ బయటికొచ్చారు.
జగిత్యాల జైత్రయాత్రతో విప్లవోద్యమంలోకి..
మల్లోజుల వేణుగోపాల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పట్టణంలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1956లో జన్మించారు. ఆయన తండ్రి మల్లోజుల వెంకటయ్య స్వాతంత్ర్య సమరయోధుడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన కొడుకులు కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ, వేణుగోపాల్ అలియాస్ సోను విప్లవోద్యమంలో కీలకపాత్ర పోషించగా, మరో కొడుకు ఆంజనేయులు కేడీసీసీ బ్యాంకులో పనిచేసి రిటైరయ్యారు.
వెంకటయ్య 1997లో మరణించగా.. తల్లి మధురమ్మ 2022లో కన్నుమూశారు. 2011లో వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో వేణుగోపాల్ అన్న మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీ మరణించారు. కోటేశ్వర్రావు, వేణుగోపాల్ జగిత్యాల జైత్రయాత్ర అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలో వేణుగోపాల్ 1982లో అరెస్టయ్యారు. 1983లో విడుదలయ్యాక దండకారణ్యానికి వెళ్లారు.
ఆ తర్వాత పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకే ఎస్ జెడ్ సీ) సెక్రటరీగా ఎదిగారు. 1995 నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2007 నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2010, జులైలో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తర్వాత ఆయన స్థానంలో వేణుగోపాల్ నియమితులయ్యారు. 2010లో గడ్చిరోలిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోతలో ఇతనే మాస్టర్ మైండ్ అని పోలీసుల రికార్డులు చెప్తున్నాయి.
ఆ తర్వాత సెంట్రల్ ఇండియా అడవుల్లో పార్టీని బలోపేతం చేయడంలో ఈయన వ్యూహలు రచించారు. ఈ క్రమంలోనే ఆయన గడ్చిరోలి జిల్లాలో పనిచేసే సమయంలో తారక్కను దళంలోనే పెండ్లి చేసుకున్నాడు. 2018లో ఆమె మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు.
ఆపరేషన్ కగార్ తో ఉక్కిరిబిక్కిరి
కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ కగార్ ప్రారంభించాక వందలాది మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో మరణించిన విషయం తెలిసిందే. దేశంలో 2026, మార్చి 31 నాటికి మావోయిస్టులే లేకుండా చేస్తామని ఇప్పటికే పలుమార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ క్రమంలోనే గతంలో పోలీస్ బలగాలు అడుగుపెట్టలేని అబుజ్ మాడ్ ఏరియాలోకి కేంద్ర భద్రతా బలగాలు చొచ్చుకెళ్లాయి.
ఇన్నాండ్లు షెల్టర్ జోన్ గా భావించిన ప్రాంతాలన్నీ బలగాల చేతుల్లోకి వెళ్తుండడం, ఆరుగురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సహా అనేక మంది రాష్ట్ర, డివిజనల్ స్థాయి నేతలు చనిపోవడంతో ఆ పార్టీ మనుగడ కష్టంగా మారింది. 2004లో పీపుల్స్ వార్ గ్రూప్, ఎంసీసీ కలిసి సీపీఐ(మావోయిస్ట్)గా ఏర్పడినప్పుడు సంస్థ కేంద్ర కమిటీలో 42 మంది సభ్యులుండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 13లోపే ఉంది.
ఈ ఏడాదిలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ ఎన్ కౌంటర్లలో అసువులుబాశారు. కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల సుజాత ఏడాది రోజుల క్రితం తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే మల్లోజుల వేణుగోపాల్ లాంటి కరుడుగట్టిన మావోయిస్టులు సైతం ఆయుధాలు వదిలి లొంగుబాటపట్టారు.
ఇటీవల ఆయన ఆగస్టు 15న ‘టెంపరరీ ఆర్మ్డ్స్ట్రగుల్అబాండెన్’విడుదల చేసిన 22 పేజీల లేఖ సెప్టెంబరు 17న వెలుగుచూడటం పార్టీలో కలకలం రేపింది. పార్టీలో తీవ్రచర్చకు దారితీయడంతో ఆయుధాలు సరెండర్ చేయాలని పార్టీ ఆదేశించింది. అంతేగాక వేణుగోపాల్ ను విప్లవ ద్రోహిగా మావోయిస్టు పార్టీ ప్రకటించింది.
బాబాయ్ బయటికి రావడం సంతోషం
మల్లోజుల వేణుగోపాల్ సరెండర్ పై ఆయన అన్న కొడుకు మల్లోజుల దిలీప్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మా బాబాయ్ తిరిగి జనజీవన స్రవంతిలోకి తిరిగి రావడం సంతోషకరం. మా బాబాయ్ పిల్లలు, కుటుంబ ప్రేమను దూరం చేసుకుని చాలా ఏండ్లుగా నిస్వార్థంగా నమ్మిన సిద్ధాంతాలు, ఆశయాల కోసం పని చేశారు. మా నానమ్మ మధురమ్మ ఏండ్ల తరబడి కొడుకు కోసం వేచి చూసి చివరకు 2022లో చనిపోయింది’అంటూ దిలీప్ ఎమోషనల్ అయ్యారు.