అన్యాయం జరుగుతున్నదనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఒక అమాయక ప్రాంతం అని నెహ్రూ ఆనాడే చెప్పాడు. విభజన జరిగిన పక్క రాష్ట్రంతో ఎంత జాగ్రత్తగా ఉండాలో వేరే చెప్పక్కరలేదు. రెండు రాష్ట్రాలు విడిపోయాక పక్క రాష్ట్ర పార్టీలతో అంతర్గత సంబంధాలు కలిగి ఉండటం తెలంగాణ వంటి రాష్ట్రానికి అనర్థమని గడిచిన 12 ఏండ్ల కాలమే చెపుతున్నది. అందుకే ఆంధ్రా పార్టీలతో అంతర్గత బంధాలు తెలంగాణకు మంచివి కావని కేసీఆర్ హయాంలోనే తేలిపోయింది.
ఆంధ్రా నేతలతో కేసీఆర్‌కు అయినా, రేవంత్ రెడ్డికి అయినా వ్యక్తిగత సంబంధాలు ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అవి తెలంగాణ ప్రయోజనాలకు అనర్థంగా మారకుండా ఉన్నాయా, ఉంటున్నాయా అనేదే సమస్య. పక్క రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ రెండూ ప్రాంతీయ పార్టీలు. ఇంకా చెప్పాలంటే, అవి ఏపీ పాలకపార్టీలు. తెలంగాణ ఏర్పడ్డాక నీళ్లు, ఉద్యోగాల పంపకాలలో అవి పెడుతూ వస్తున్న తిరకాసులకు, అన్యాయాలకు లెక్కేలేదు. అప్పుడు కేసీఆర్‌కు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆంధ్రా నేతలతో ఉన్న బంధాలు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయడంలేదా అనేదే ఇక్కడ చర్చ.
కృష్ణా, గోదావరి నదుల నీటి వాడకం విషయంలో ఏపీ పెత్తనం 12 ఏండ్ల నుంచి నడుస్తోంది. విభజన చట్టంలోని హామీలు, పంపకాలు నేటికీ అనేకం పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉద్యోగుల పంపకం అంత సవ్యంగా ఏమీ జరగలేదు. సెక్రటేరియెట్‌లో ఇప్పటికీ ఆంధ్రా ఉద్యోగుల సంఖ్యనే ఎక్కువ అనేది వింటున్నాం. తెలంగాణ వస్తే 2 లక్షల ఉద్యోగాలు కొత్తగా వస్తాయని చెప్పిన కేసీఆర్ పదేండ్లలో ఎంతమంది ఆంధ్రా ఉద్యోగులను పంపించ గలిగారో, ఎంతమంది తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారో ఆయనకే తెలియాలె!
కేసీఆర్‌కు ఫక్తు రాజకీయం ముఖ్యమైంది తప్ప, ఉద్యోగుల పంపకంపై ఆయన దృష్టిపెట్టి పనిచేసి ఉంటే ఇవాళ సెక్రటేరియెట్‌లో తెలంగాణ ఉద్యోగులు 85 శాతం ఉండాలి కదా! లేరెందుకు? ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులలో ఇప్పటికీ తెలంగాణ వాళ్లు కనీసం సగటుగానైనా లేరంటే..ఈ రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నట్లు ? ఆంధ్రా పార్టీతో అంట కాగడం తప్ప ఈ విషయం ఎన్నడైనా పట్టిందా?
జగన్ స్నేహంతో ఏం జరిగింది ?
ఎంతసేపూ జగన్మోహన్రెడ్డితో స్నేహం తప్ప, తెలంగాణ ప్రయోజనాలు కేసీఆర్‌కు ఏనాడైనా పట్టినట్లు ఉంటే, పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 8 నుంచి 11 టీఎంసీల నీరు దోచుకుపోయేవారా? జగన్ ముఖ్యమంత్రిగా రాయలసీమ ఎత్తిపోతల పనులు జరుపుతుంటే.. ఒక పాలమూరు బిడ్డ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెస్తే ఆగింది తప్ప, కేసీఆర్ ఆపే ప్రయత్నం చేశాడా? మిత్రుడు జగన్మోహన్ రెడ్డితో ఆయనకున్న అంతర్గత అవగాహనే కారణం కాదనుకోవచ్చా?
బేసిన్లు లేవు, బేషజాలు లేవు అని కేసీఆర్ ఎవరికోసం అన్నారు? రాయలసీమను రతనాల సీమ చేస్తా అని తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఎవరి కోసం అన్నారు? చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి అయినా పూర్తి చేశారా? దానికి కేంద్రం నుంచి అనుమతులు సాధించారా? జగన్మోహన్ రెడ్డితో ప్రగతి భవన్లో సమావేశాలు జరిపారు. సాధ్యం కాని నదుల అనుసంధానంపై చర్చించామన్నారు. కానీ జరిగిందేమిటంటే,. జగన్ తెలంగాణ నీళ్లకు గండికొట్టే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాడు. జగన్ స్నేహంతో తెలంగాణకు జరిగిన మేలేమిటో కేసీఆర్ చెప్పగలరా?
కాంగ్రెస్‌ను ప్రజలు ఎందుకు గెలిపించారో మరవొద్దు
పదేండ్ల కేసీఆర్ పాలనపై తెలంగాణకు భ్రమలు తొలగిపోయి.. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకున్నారు. కేసీఆర్ తెలంగాణను మర్చిపోయి, ఆంధ్రా లాబీలకు అనుగుణమైన పాలన, కుటుంబపాలన సాగించడంతో...తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించుకున్నారనే విషయం సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకోగానీ ఆయన కూడా మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది.
చంద్రబాబు నోట అనుమతులే లేని బనకచర్లలు, నల్లమల సాగర్లు ఎందుకు వినిపిస్తున్నాయి? వ్యక్తిగతంగా చంద్రబాబు రేవంత్‌కు రాజకీయ గురువే కావచ్చు. అది వ్యక్తిగత విషయం. కానీ రేవంత్‌రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆంధ్రా నేతలతో వ్యక్తిగత సంబంధాలు ఉంటే అవి ఎవరికీ అభ్యంతరం కావు. అయితే, ఆ సంబంధాలు తెలంగాణ ప్రయోజనాలకు అనర్థంగా మారకూడదనేదే ఆయన గమనించాల్సిన విషయం.
కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే!
ఆ మధ్య సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ‘టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ను బొందపెట్టాలి’ అని రేవంత్‌రెడ్డి ఆ వ్యాఖ్య ఎందుకు చేశారో తెలియదు. కానీ. తెలంగాణలో తెలుగు దేశాన్ని బొందపెట్టినందుకే బీఆర్ఎస్ను ప్రజలు ఓడించలేదనే విషయాన్ని రేవంత్ మర్చిపోతున్నారు. బీఆర్ఎస్ను స్వయాన తెలంగాణ ప్రజలే ఓడించారు. తెలుగుదేశం ఆంధ్రా అధిపత్య పార్టీ కాబట్టే, తెలంగాణ ఉద్యమానికి ఆ పార్టీ టార్గెట్‌గా మారింది.
అందుకే ఉద్యమకాలంలో దాన్ని ఆంధ్రా పార్టీగా ఉద్యమం పరిగణనలోకి తీసుకుంది. ఆ వ్యతిరేకత ఉద్యమానికి ఎంత ఉపయోగపడిందో, రాజకీయంగా కేసీఆర్ నాయకత్వం బలపడడానికి కూడా అంతే ఉపయోగపడింది. కానీ ఆంధ్రా పార్టీ ఏదైనా తెలంగాణకు వ్యతిరేకమే అని కేసీఆర్ భావించినట్లు లేదు.
జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేశాడు. కేసీఆర్ జగన్‌తో దోస్తీ చేస్తే, తెలంగాణలో చంద్రబాబును నేనెందుకు పైకెత్తకూడదు అనుకుంటున్నాడేమో రేవంత్‌రెడ్డి! నిజానికి టీడీపీని బొందపెట్టింది కేసీఆర్ కాదు. తెలంగాణ ప్రజలే. బొందపెట్టిన టీడీపీని తెలంగాణలో తిరిగి బతికించే ప్రయత్నం ఎవరు చేసినా వృథా ప్రయాసే. అది కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే!
వ్యూహం ఏమిటో గానీ.. అది నష్టమే !
బీఆర్ఎస్ నిజానికి నైతికత లేని ప్రతిపక్షంగా బతుకుతోంది. తెలుగుదేశం పార్టీ గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్‌కు ఏం అవసరమొచ్చిందో ఆయనకే తెలియాలె! అదొక సెల్ఫ్‌గోల్! తెలంగాణ అంటే ఖమ్మం జిల్లా మాత్రమే కాదని రేవంత్‌రెడ్డి గమనించాలి! బీఆర్ఎస్ను బూచీగా చూపి తెలుగుదేశం పార్టీని పైకెత్తడం ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఏమాత్రం శోభనివ్వలేదు.
తెలంగాణలో రేవంత్ వ్యూహమేమిటో తెలియదు కానీ.. అది తన పొలిటికల్ కెరీర్‌కే నష్టం చేస్తుందని మర్చిపోకూడదు. రేవంత్‌రెడ్డి మరో పదేండ్లు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటున్నారు. కానీ, తెలుగుదేశం వంటి ఆంధ్రా పార్టీకి వంత పాడితే మరోసారి ఎలా ముఖ్యమంత్రి అవుతాననుకుంటున్నారో ఆయనకే తెలియాలె!
బీజేపీదీ అదే దారయితే..
ఇక బీజేపీ వ్యవహారం తెలంగాణ పట్ల ఎలా ఉందో ఇప్పటికైతే తెలియదు. ఎందుకంటే ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. టీడీపీ స్నేహాన్ని బీజేపీ తెలంగాణకు విస్తరిస్తుందేమోనని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే.. మరొకసారి ‘తెలంగాణ రాజకీయంగా అనాథగా మారుతోంది’ అనే అనుమానం మాత్రం బలపడుతోంది. టీడీపీ స్నేహాన్ని బీజేపీ తెలంగాణపై రుద్దే ప్రయత్నం చేస్తే.. తెలంగాణలో బలపడుతూ వస్తున్న బీజీపీకి ఖచ్చితంగా అది శరాఘాతమే అవుతుంది.
ఆంధ్రా లాబీలను పోషిస్తున్న దుస్థితి పోవాలె
వచ్చిన తెలంగాణలో 12 ఏండ్లుగా అవినీతి వార్తలు మాత్రమే వింటున్నాం. అలాంటి తెలంగాణలో ఆంధ్రాపార్టీల జోక్యం, వాటితో అంటకాగే రాజకీయాలు తెలంగాణను రాజకీయంగా అనాథగా మారుస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలె. ఆంధ్రా పార్టీలు, ఆంధ్రా లాబీలపై అధారపడే దుస్థితిని తెలంగాణ ప్రజలు ఇంక కోరుకోలేరు! ఈ విషయాన్ని కేసీఆర్, రేవంత్ రెడ్డి, బీజేపీ గమనిస్తే.. తెలంగాణలో వారి వారి రాజకీయ ఆరోగ్యానికి మంచిది!
ఇంకా ఆంధ్రా పెత్తనాలే!
పన్నెండ్లుగా తెలంగాణ ప్రభుత్వాలను ఆంధ్రా లాబీలే శాసిస్తున్నాయనే చర్చ అంతటా బలంగా వినిపిస్తోంది. అధికారులు, బడా కాంట్రాక్టర్లు, బడా కార్పొరేట్లు, బడా రియల్టర్లు ఎక్కడ చూసినా ఆంధ్రా లాబీలే దర్శనమిస్తున్నా యంటే అది ఎవరి పుణ్యమో పదేండ్లు పాలించిన కేసీఆర్, రెండేండ్లుగా పాలిస్తున్న రేవంత్‌రెడ్డి చెప్పాల్సిన విషయం! తెలంగాణ తెచ్చుకున్నది ఆంధ్రాపార్టీలతో అంటకాగడానికి కాదనే విషయాన్ని తెలంగాణలో బతుకుతున్న ప్రతి రాజకీయ పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్
