అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు నర్సింగ్‌‌ రావు ఆత్మహత్య

అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు నర్సింగ్‌‌ రావు ఆత్మహత్య
  • అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు నర్సింగ్‌‌ రావు ఆత్మహత్య
  • పలువురు ప్రముఖుల సంతాపం
  • ఆయన మరణం పత్రికా లోకానికి తీరని లోటు: హర్యానా గవర్నర్‌‌‌‌ దత్తాత్రేయ

ముషీరాబాద్, వెలుగు: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగ్ రావు (63) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కవాడిగూడలో నివాసం ఉంటున్న నర్సింగ్‌‌ రావు ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ, ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నారు. 4 రోజుల క్రితం ఆరోగ్య సమస్యలు తీవ్రం కావడంతో హాస్పిటల్‌‌లో చేరిన ఆయన.. ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికొచ్చాక కూడా అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబడటంతో సోమవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఫ్యాన్‌‌కు చీరతో ఉరేసుకున్నారు. 

గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆయనను స్థానిక హాస్పిటల్‌‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. అనంతరం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి మృతదేహాన్ని పోస్ట్‌‌ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తర్వాత బన్సీలాల్‌‌పేట్‌‌ శ్మశాన వాటికలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. 

నర్సింగ్‌‌ రావు మృతికి రాజకీయ నేతలు అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, మందకృష్ణ మాదిగ, ముఠాగోపాల్, పూసరాజు, జర్నలిస్టు సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. హైదరాబాద్‌‌లో సుదీర్ఘకాలం జర్నలిస్టుగా సేవలందించిన నర్సింగ్ రావు మరణం పత్రిక రంగానికి తీరని లోటని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.