
ఆగ్రాలో జరుగుతున్న మత మార్పిడి కేసు దర్యాప్తులో పాకిస్తాన్‌కు చెందిన కొందరి హస్తం ఉందని పోలీసులు శనివారం తెలిపారు. వీరు యువతను ట్రాప్ చేయడానికి ఆన్‌లైన్ యాప్స్, గేమింగ్ యాప్‌లను ఉపయోగించినట్లు బయటపెట్టారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేయగా, వీళ్లంతా కూడా యువకులను, ముఖ్యంగా బాలికలను టార్గెట్ చేసుకుని లుడో వంటి ఆన్‌లైన్ గేమ్‌ల ద్వారా కనెక్ట్ అయ్యేందుకు ఉపయోగించుకున్నారని పోలీస్ అధికారులు తెలిపారు.
ఆగ్రా పోలీస్ కమిషనర్ దీపక్ కుమార్ ప్రకారం, ఈ అనుమానితులు ఇస్లామిక్ బోధనలను చేయడం, ఎప్పటికప్పుడు మాటల ద్వారా హిందూ మతం గురించి అనుమానాలు, సందేహాలను పుట్టిస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారని చెప్పారు. ఆగ్రా నుండి 33, 18 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు తప్పిపోయినట్లు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మొత్తం వెలుగులోకి వచ్చింది. వీరిలో ఒకరు AK-47 పట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పోలీసులు దీనిపై మరింతగా ఆరా తీయగా ఆరు రాష్ట్రాల నుండి 10 మందిని అరెస్టు చేశారు, దర్యాప్తు చేస్తున్న సమయంలో మరో నలుగురిని కూడా అరెస్టు చేశారు. కొంతమంది అమ్మాయిలు ఈ నెట్‌వర్క్‌లో ఉన్న కాశ్మీరీ మహిళల మాటలు విని హిందూ మతాన్ని తప్పుబడుతూ ఇస్లాం మతాన్ని గొప్పదని ప్రచారం చేశారు.
ఆగ్రా పోలీసు కమిషనర్ దీపక్ కుమార్ మాట్లాడుతూ మేము 14 మందిని అరెస్టు చేసి విచారించాము, అలాగే రక్షించిన అమ్మాయిలతో మాట్లాడాము. విచారణలో ఈ అమ్మాయిలు పాకిస్తాన్ వ్యక్తులతో మాట్లాడడం, వారితో ఇస్లాం గురించి చర్చించినట్లు తేలింది. కాశ్మీర్‌లోని కొంతమంది అమ్మాయిలను మతం మార్చుకోవడానికి వీరు ప్రభావితం చేసి సంప్రదింపులు జరిపారు." అని అన్నారు.
1990లో ఇస్లాం మతంలోకి మారిన ఢిల్లీ వాసి అబ్దుల్ రెహమాన్ సహా గోవాకు చెందిన ఆయేషా ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారని పోలీసులు గుర్తించారు. ఈ నెట్‌వర్క్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా వంటి చాల రాష్ట్రాల అమ్మాయిలను టార్గెట్ చేసిందని, రక్షించిన అమ్మాయిలను వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారని, అక్కడ వారికి ఇస్లాం మతం, సిద్దాంతాల బోధనలు ఇచ్చారని తెలుస్తోంది.
కమిషనర్ కుమార్ చెప్పిన మరికొన్ని వివరాల ప్రకారం, ఈ ఆపరేషన్‌లో డార్క్ వెబ్ ఇంకా సిగ్నల్ వంటి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల గురించి తెలిసిన వారు పాల్గొన్నారు. అలాగే వారి గుర్తింపు తెలియకుండా ఉండటానికే వీటిని ఉపయోగించారు. పాకిస్తాన్‌కు చెందిన తన్వీర్ అహ్మద్, సాహిల్ అదీమ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ మత మార్పిడి ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉందని మరిన్ని ఆధారాల కోసం గాలిస్తున్నమని తెలిపారు.