
ఎన్నికలపై జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
ప్రతిపక్ష కూటమికి చైర్ పర్సన్ గా చేస్తే.. 2024 పోల్స్‌కు కేసీఆర్ ఫైనాన్స్ చేస్తానన్నడని కామెంట్
న్యూఢిల్లీ : 2024 పార్లమెంట్ ఎన్నికలపై సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలు ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీకి, అన్ని ప్రతిపక్ష పార్టీలకు మధ్య జరుగుతాయా? అనేది చూడాల్సి ఉందని కామెంట్ చేశారు. దీనికి తన పాయింట్ ఆఫ్ వ్యూలో 10 అంశాలు సమాధానం చెబుతాయన్నారు. ఐడియాలజీ, ఈగో, దర్యాప్తు సంస్థల దాడుల భయం, ప్రధాని అభ్యర్థి ఎవరు? ప్రతిపక్షాలను లీడ్ చేసేది ఎవరు? న్యూట్రల్‌గా ఉన్న పార్టీలు ఎటు వైపు వెళ్తాయి? అనే అంశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈమేరకు ట్విట్టర్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
‘‘రీజనల్ పార్టీలు, కాంగ్రెస్ కలిసి పని చేస్తాయా? కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నిర్వహించిన డిన్నర్ మీటింగ్‌లో టీఎంసీ, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అయితే బెంగాల్‌లో టీఎంసీకి, తెలంగాణలో బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కాంగ్రెస్ తమతో పోటీ పడుతున్నదని రీజనల్ పార్టీలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలతో సర్దుపోవడమే కాంగ్రెస్‌కు అతిపెద్ద పరీక్ష” అని రాజ్‌దీప్ సర్దేశాయ్ చెప్పారు.
ప్రతి ఒక్కరూ జాతీయ నేతలా ఫీలవుతున్నరు
‘‘ప్రతీ ప్రతిపక్ష పార్టీ నేత తనను తాను జాతీయ నాయకుడిగా ఊహించుకుంటున్నరు.. కేసీఆర్‌నే తీసుకుంటే ఆయన తన పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకున్నరు.. బీఆర్ఎస్ ప్రచారం కోసం ఇటీవల చాలాసార్లు మహారాష్ట్రకు కూడా వెళ్లొచ్చిన్రు. ప్రతిపక్ష పార్టీల కూటమికి తనను చైర్ పర్సన్‌గా చేస్తే .. మొత్తం 2024 ఎన్నికల ప్రచారానికి ఫైనాన్స్ చేస్తానని కొందరు బీఆర్ఎస్ నాయకులతో సీఎం కేసీఆర్ చెప్పారు” అని రాజ్‌దీప్ కామెంట్ చేశారు. ‘‘ తమతో సమానమైన కేసీఆర్ లాంటి నాయకుడికి పగ్గాలు ఇచ్చి పక్కకు జరిగేందుకు ఇతర ప్రతిపక్ష పార్టీ లీడర్లు రెడీ అయితరా ? అంటే.. అది సాధ్యం కాని ముచ్చటే. అహంభావం వల్ల వాళ్లు కలవలేకపోవచ్చు” అని పేర్కొన్నారు.