
సీనియర్ కన్నడ యాక్టర్, KGF మూవీ విలన్ దినేష్ మంగళూరు (55) కన్నుమూశారు. ఇవాళ ఆగస్ట్ 25న ఉదయం కర్ణాటకలోని కుందాపురలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నటుడు దినేష్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.
యష్ KGFమూవీలో బాంబే డాన్ ‘శెట్టి’ పాత్రలో దినేష్ నటించి తనదైన విలనిజాన్ని పండించాడు. కేవలం నటుడిగానే కాకుండా దినేష్ పలు చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాడు. అందులో వీర మాటకారి, చంద్రముఖి ప్రాణసఖి, రాక్షస వంటి చిత్రాలకు పనిచేసి గుర్తింపు పొందారు. దినేష్ అకాల మృతికి కన్నడ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సినీ సెలబ్రెటీలు, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ద్వారా విచారం వ్యక్తం చేస్తున్నారు.
దినేష్ సినీ ప్రస్థానం:
మంగళూరుకు చెందిన దినేష్, నాటక రంగంలో బలమైన నేపథ్యంతో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. అతను మొదట్లో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పటికీ - నం. 73, శాంతినివాస వంటి చిత్రాలకు సెట్‌లను నిర్వహించడంతో, చివరికి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కె.ఎం. చైతన్య నటించిన 'ఆ దినగలు' చిత్రంలో సీతారాం శెట్టి పాత్రలో నటించి మెప్పించాడు. ఇందులో తన నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు.
ఆ తర్వాత దినేష్ వరుస చిత్రాల్లో నటించే అవకాశం అందిపుచ్చుకున్నారు. ముఖ్యంగా బ్లాక్‌బస్టర్ KGF లో బొంబాయి డాన్ పాత్రతో పవర్ ఫుల్ విలనిజంతో మరింత గుర్తింపు పొందాడు దినేష్. ఆ తర్వాత రికీ, హరికథ అల్లా గిరికథ, మరియు ఉలిదవరు కందంతే వంటి చిత్రాలలో కూడా నటించాడు.