బురదలో కూర్చోబెట్టి.. పిర్రలపై తెగ కొట్టాడు.. జూనియర్లపై సీనియర్ పైశాచికత్వం

బురదలో కూర్చోబెట్టి.. పిర్రలపై తెగ కొట్టాడు.. జూనియర్లపై సీనియర్ పైశాచికత్వం

మహారాష్ట్రలోని థానేలోని విద్యా ప్రసారక్ మండల్ కళాశాలలో ఎన్ సీసీ కోసం శిక్షణ పొందుతున్న కొంతమంది విద్యార్థులపై సీనియర్లు  క్రూరత్వం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్వస్థలమైన థానేలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ  సీనియర్ ఎన్ సీసీ శిక్షకుడు ఆరుగురు విద్యార్థులను బురదలో పడుకోబెట్టాడు. అనంతరం బురదలో పడుకున్న విద్యార్థుల వెనక భాగంలో కర్రలతో క్రూరంగా దాడి చేశాడు. 

భయాందోళనకు గురైన విద్యార్థులు ఏడుస్తూ, వారిని వేడుకుంటున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్మీ, నేవీతో భవిష్యత్ అవకాశాల కోసం వారిని సిద్ధం చేయడానికి జోషి-బెడేకర్ క్యాంపస్‌లో మూడు కళాశాలల విద్యార్థులకు సంయుక్తంగా ఎన్‌సీసీ శిక్షణ ఇస్తున్నారని  స్థానికులు చెబుతున్నారు. ప్రిన్సిపల్ సుచిత్రా నాయక్ ఘటనపై స్పందిస్తూ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.