
- ఆయన పీసీసీ చీఫ్ అయినంక పార్టీ థర్డ్ ప్లేస్‌కు పడిపోయింది
- దిగ్విజయ్‌కు సీనియర్ నేతల ఫిర్యాదులు
- మమ్మల్ని బయటికి పంపాలనుకుంటున్నడు
- ద్రోహులు, కోవర్టులని తప్పుడు ప్రచారం చేయిస్తుండు
- ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నడు
- ఇంతకుముందు ఇలాంటి పరిస్థితి లేదని వెల్లడి
- లోపల మీటింగ్ జరుగుతుండగానే బయట నేతల మధ్య లొల్లి
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఏఐసీసీ అబ్జర్వర్ దిగ్విజయ్‌సింగ్‌కు పార్టీ సీనియర్ నేతలు ఫిర్యాదులు చేశారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నోళ్లను రేవంత్ పట్టించుకోవడం లేదని, ఆయన పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి పార్టీకి ఓట్లు తగ్గాయని, మూడో ప్లేస్‌కు పార్టీ పరిస్థితి దిగజారిందని వివరించారు. రాష్ట్రంలో పార్టీని నడుపుడు రేవంత్ వల్ల కాదని చెప్పినట్లు సమాచారం. ‘‘బయటి నుంచి వచ్చిన వాళ్లకు పదవులిస్తే కాదనెటోళ్లం కాదు.. కానీ పార్టీలో ఏండ్లకేండ్లుగా ఉన్నోళ్లను కాదని, ఎవరితోనూ మాట్లాడకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపైనే మా అభ్యంతరమంతా. పార్టీలో తాతల తరాల నుంచి పని చేస్తున్నోళ్లున్నరు. వాళ్లకు న్యాయం జరగాలన్నదే మా డిమాండ్” అని దిగ్విజయ్‌కు సీనియర్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
‘‘మమ్మల్నందరినీ పంపించి ఆయన పార్టీ నడపాలనుకుంటుండు. కానీ అది ఆయనతోని కాదు. పార్టీని గెలిపించి సీఎం అయితే ఆయనకే మంచిది. మాకూ మంచిది. కానీ పరిస్థితి చూస్తే మాకు ఆ నమ్మకం కలగడం లేదు’’ అని చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య పంచాయితీ పరిష్కరించేందుకు ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. గురువారం ఉదయమే గాంధీ భవన్‌కు చేరుకున్న ఆయన వరుసగా ఒక్కొక్కరి వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకున్నారు. దాదాపు 50 మందికి పైగా లీడర్లతో భేటీ అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు జానారెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, రేణుకా చౌదరి, అంజన్‌కుమార్ యాదవ్, శ్రీధర్ బాబు, మహేశ్వర్ రెడ్డి తదితరులు ఒక్కొక్కరుగా వచ్చి దిగ్విజయ్ సింగ్‌ను కలిసి వెళ్లారు. బయటకు వచ్చాక వీళ్లు మీడియాతో మాట్లాడుతూ.. తాము అన్ని విషయాలు చెప్పామని, ఎన్నికల వేళ గొడవలు వద్దని, పార్టీని బలోపేతం చేయాలని దిగ్విజయ్ సూచించారని నేతలంతా ఇంచుమించుగా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే సీనియర్ నేతలంతా దిగ్విజయ్ ముందు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నట్లు తెలిసింది.
ఇంత ఏకపక్షమా?
పీసీసీ చీఫ్‌గా రేవంత్ వచ్చిన తర్వాత పార్టీ ప్రతిష్ట ఏ స్థాయికి దిగజారిందో లెక్కలతో పాటు దిగ్విజయ్‌సింగ్‌కు కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పినట్లు సమాచారం. అంతేకాదు తమకు వ్యతిరేకంగా వచ్చిన సోషల్ మీడియా పోస్టులను కూడా చూపించినట్లు సమాచారం. ‘‘మేము దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ కష్టనష్టాలు భరిస్తున్నం. అధికారం లేకపోయినా అవమానాలు, అరెస్టులు భరించి కార్యకర్తలను కాపాడుకుంటున్నం. అలాంటి మమ్మల్ని పార్టీ ద్రోహులు, కోవర్టులని తప్పుడు ప్రచారం చేస్తే ఇంకా ఎట్లా సహిస్తం” అని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రేవంత్ వచ్చాక పార్టీ పరిస్థితి మెరుగుపడిందా అంటే అది కూడా లేదని, హుజూరాబాద్‌లో 35 శాతం ఉన్న ఓటింగ్ ఆయన వచ్చాక 1.5 శాతానికి, మునుగోడులో 49 నుంచి 10 శాతానికి పడిపోయిందని లెక్కలు చూపెట్టినట్లు సమాచారం. టీఆర్ఎస్కు దీటుగా రెండో ప్లేస్‌లో ఉన్న పార్టీ మూడో స్థానానికి పడిపోయిందని వివరించినట్లు తెలిసింది. ఎన్నికల తర్వాత రివ్యూలు కూడా ఉండవని, పార్టీ పరిస్థితిపై సమీక్షలు కూడా చేయరని, ఇంత ఏకపక్ష ధోరణి ఎప్పుడూ చూడలేదని, గతంలో ఏమున్నా పార్టీలో సీనియర్లు కలిసి చర్చించుకునే వారని చెప్పినట్లు సమాచారం.
క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా ప్రచారం చేస్తే ఎట్లా?
పార్టీని సమన్వయం చేసుకుంటూ రేవంత్ నడుచుకుంటే ఇప్పటికీ కలిసి పని చేసేందుకు తమకు అభ్యంతరం లేదని దిగ్విజయ్‌తో సీనియర్లు అన్నారు. పీసీసీ చీఫ్‌గా ఆయన ఎంపిక పట్ల తమకెన్ని అభ్యంతరాలున్నా అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తూ వచ్చామని వివరించారు. ‘‘పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లు ద్రోహులట. పది పార్టీలు మారినోళ్లు మంచోళ్లట. కొంత కాలానికి మా రాజకీయ జీవితం ముగుస్తుంది కూడా. అట్లాంటి దశలో మా క్యారెక్టర్ దెబ్బ తీసేలా ప్రచారం సాగిస్తే ఎట్లా?” అని దిగ్విజయ్ ముందు ఒక ముఖ్య నేత గట్టిగానే చెప్పినట్లు తెలిసింది. ‘‘సొంత పార్టీ చీఫే మాకు వ్యతిరేకంగా శత్రువులను తయారుచేస్తే సహించేది ఎట్లా?” అని ఆ నేత అడిగినట్లు సమాచారం. మరో సీనియర్ నేత.. తాము పీసీసీ చీఫ్‌ని భరించడం కష్టమని, మార్చే ఆలోచన చేస్తే మంచిదని అన్నట్లు తెలిసింది. లేదంటే హైపవర్ కమిటీలు వేసి సమిష్టి నిర్ణయాలు తీసుకునేలా చూడాలని కోరినట్లు సమాచారం. నేతలు మాట్లాడుతున్న సమయంలో దిగ్విజయ్ సింగ్ కొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలను ఆరా తీశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్ ప్రభావం, ఇతర రాజకీయ పార్టీల పొజీషన్‌పై కూడా ఆయన వివరాలు తెలుసుకున్నారు. నేతలు చెప్పిన అన్ని విషయాలను దిగ్విజయ్ విని పాయింట్లు రాసుకున్నారు. శుక్రవారం కూడా దిగ్విజయ్ అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.
మీటింగ్ జరుగుతుండగనే బయట లొల్లి
కాంగ్రెస్ నేతల మధ్య పంచాయితీని పరిష్కరించేందుకు నేతలతో గాంధీభవన్‌లో దిగ్విజయ్ సింగ్ ఓ వైపు చర్చలు జరుపుతుండగానే.. మరోవైపు బయట కొందరు నేతలు ఘర్షణకు దిగారు. కాంగ్రెస్ ఓయూ విద్యార్థి నేతలు చనగాని దయాకర్, విజయ్ కుమార్, లోకేశ్‌యాదవ్ తదితరులు మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్‌ను నిలదీశారు. ఇరువర్గాలు ఒకరినొకరు తిట్టుకున్నారు. సీనియర్లను కోవర్టులని ఎట్ల అంటారని అనిల్‌పై ఓయూ విద్యార్థి నేతలు మండిపడ్డారు. ‘‘సేవ్ కాంగ్రెస్.. సీనియర్ కాంగ్రెస్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేశారు. దిగ్విజయ్‌తో భేటీ తర్వాత భట్టి విక్రమార్క వెళ్లిపోగానే ఈ ఘర్షణ జరిగింది. కాసేపటి తర్వాత బయటికి వచ్చిన మల్లు రవి.. ఇరు వర్గాల వారికి నచ్చజెప్పడంతో శాంతించారు.
దిగ్విజయ్ ముందే బలరాం నాయక్ ఫైర్
గురువారం సాయంత్రం దిగ్విజయ్ గాంధీ భవన్ ఆవరణలో ఈవెనింగ్ వాక్ చేస్తుండగా.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు ఆయనను కలిసేందుకు వచ్చారు. పీసీసీ పదవుల్లో బీసీలకు అవకాశం ఇవ్వలేదని వారు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. క్యాన్సర్‌తో పాటు వయోభారంతో బాధపడుతున్న భరత్ చంద్రారెడ్డికే మళ్లీ ఎట్లా డీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను కాదని దిగ్విజయ్ సింగ్‌కు ఎలా ఫిర్యాదు చేస్తారని నేతలపై కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఫైర్ అయ్యారు. అక్కడే ఉన్న నేతలు అడ్డుకొని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.