- పెద్దపల్లి కాంగ్రెస్ సీనియర్ నేతల ప్రశ్న
- ప్రొటోకాల్ పాటించని కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
- చీఫ్ సెక్రటరీకి లీడర్ల ఫిర్యాదు
- వివక్ష చూపడం దారుణమని ఫైర్
పెద్దపల్లి/గోదావరిఖని/సుల్తానాబాద్/చెన్నూరు/నస్పూర్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ప్రొటోకాల్ ఇవ్వొద్దని చెప్పిందెవరో అధికారులు వెల్లడించాలని పెద్దపల్లి కాంగ్రెస్ సీనియర్ నేత సయ్యద్ సజ్జాద్ డిమాండ్ చేశారు. అధికారులే వివక్ష చూపుతున్నారా? లేదా ఎవరైనా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారా? తేలాలన్నారు. పెద్దపల్లిలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రొటోకాల్ విషయంలో అధికారులు వివక్షచూపడం దారుణం. పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష రెండేండ్లుగా ఎంపీ పట్ల వివక్ష చూపుతున్నారు.
ఈ నెల 24న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీని ఆహ్వానించకుండా అవమానపరిచారు. మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో ఎంపీకి ప్రొటోకాల్ ఉండదా? కాళేశ్వరం పుష్కరాల సందర్భంగా ఎంపీ ఫొటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం గురించి నిరుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు’’అని ఆయన అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు బండారి సునీల్, గంగుల సంతోష్, పెరుక నవీన్, తాజొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా, ఎంపీ వంశీకృష్ణ పట్ల ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్న పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున్ చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. గతంలోనూ ప్రొటోకాల్ పాటించలేదని ఉన్నతాధికారుల వార్నింగ్‌తో ఎంపీకి కలెక్టర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారన్నారు. వంశీ కృష్ణను అవమానించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుల్తానాబాద్ పట్టణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఆరెపల్లి రాహుల్ డిమాండ్ చేశారు.
ఎంపీ వంశీకృష్ణ విషయంలో ప్రొటోకాల్ పాటించని అధికారులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ లీడర్ కామ విజయ్ ఆధ్వర్యంలో గోదావరిఖని మున్సిపల్ తీన్రస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేరును చేర్చకుండా అవమానించిన అధికారులు, నేతలపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా చెన్నూర్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
గడ్డం వంశీ కృష్ణను అవమానించిన ఆఫీసర్లు వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. పాలకుర్తి, అంతర్గాంలో చీరల పంపిణీ ఆహ్వానపత్రంలో ఎంపీ పేరును కావాలనే తొలగించారన్నారు.
