నాదెండ్ల భాస్కర్ రావు జీవితంలో చేసిన రాజకీయ రణాలు.. జీవిత చరమాంకంలో రాజకీయ విశ్లేషకులతో పంచుకున్న తన అనుభవాలు నేటితరం నేతలకు ఎన్నో గుణపాఠాలుగా పనికి వస్తాయి. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నాదెండ్ల .. తన పేరులాగ కొద్దికాలం మాత్రమే ఉదయించి, రాజకీయ సాయంత్రాల తీరానికి వేగంగా చేరుకున్నారు. అద్భుత రాజకీయ చతురత.. అపారమైన తెలివితేటలున్నా.. కేవలం నెల రోజుల సీఎంగానే చరిత్రలో నిలిచిపోయారు.
1978 ఎన్నికలలో ఇందిరా కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకని స్థితి. అప్పుడే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి దృష్టిలో నాదెండ్ల భాస్కర్ రావు పడ్డారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఆయనకు టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికలలో ఆయన గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే.. ఆ వెంటనే మంత్రి కూడా అయిపోయారు.
చెన్నారెడ్డి కూడా నాదెండ్లకు చాలా ప్రాధాన్యత ఇచ్చారని చెబుతారు. సంజయ్ గాంధీతో నాదెండ్ల సాన్నిహిత్యంపై పలు పుకార్లు సైతం షికార్లు చేశాయి. దీంతో నాదెండ్ల ఏదో చేస్తున్నాడన్న అనుమానం చెన్నారెడ్డిలో మొదలైంది.
దీంతో చెన్నారెడ్డి నాదెండ్ల శాఖను తగ్గించారు. అది నాదెండ్లకు తీవ్ర ఆగ్రహం కల్గించిందని చెబుతుంటారు. అనంతరం ఆయన అసమ్మతి వర్గంతో చేతులు కలిపారు. చెన్నారెడ్డిని రాజీనామా చేయవలసిందిగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. తనను ఎంపిక చేస్తారని ఆశించిన నాదెండ్లకు మొండిచేయి ఎదురైంది.
అంజయ్యను సీఎంను చేయడంతో నాదెండ్ల సహించలేకపోయారని అప్పటి రాజకీయ నేతలు చెబుతుంటారు. ఇలా రెండేళ్లకు పైగా ప్రభుత్వంలో చక్రం తిప్పిన నాదెండ్ల 1981 వచ్చేసరికి జీరోగా మిగిలిపోయారు.
నెల రోజులు సీఎంగా..
నాదెండ్లది మౌనం సహించి వూరుకునే తత్వం కాదు. రాజకీయాలలో ఆయన కదలికలు పాదరసం మాదిరి ఉంటాయి. అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆయనకు ఎన్టీఆర్ తారసపడ్డారు. తెలుగుదేశం ఆవిర్భావంలో ఆయన తనవంతు పాత్ర పోషించారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన ఆర్థికమంత్రి అయ్యారు. కానీ ఆయనకు ఎన్టీఆర్ అంటే పెద్దగా గౌరవం లేదు. అవకాశం కోసం ఆయన ఎదురుచూశారు. గుండె ఆపరేషన్‌కు ఎన్టీఆర్ అమెరికా వెళ్లగానే నాదెండ్ల అసమ్మతి శిబిరం ఏర్పాటు చేశారు. చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కానీ అవసరమైన సంఖ్యలో శాసనసభ్యుల మద్దతు సంపాదించలేకపోయారు. ఈలోపు అమెరికా నుంచి ఎన్టీఆర్ తిరిగి వచ్చారు.. ప్రజల్లోకి వెళ్లిపోయారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కమ్యూనిస్టులు, బీజేపీ, ఇతర ప్రతిపక్ష శక్తులన్నీ ఎన్టీఆర్‌కు అండగా నిలిచాయి. ప్రజలు సైతం ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచారు. నాదెండ్ల ముఖ్యమంత్రి పదవీ కాలం నెల రోజుల్లోనే ముగిసిపోయింది.
మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఎంపీగా..
1985 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రిగా ఓడిపోయిన నాదెండ్ల, 1989లో తన సొంత నియోజకవర్గం తెనాలి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1994లో ఓటమిపాలయ్యారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచారు. 1999 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన నాదెండ్ల బీజేపీ నేత దత్తాత్రేయ చేతిలో ఓటమిపాలయ్యారు. దాంతో ఆయన ఎన్నికల రాజకీయ ప్రస్థానం ముగిసింది. తర్వాత బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యారు.
ప్రస్తుతం నాదెండ్ల మనోహర్, ఏపీ ప్రభుత్వంలో క్రియాశీలకమైన మంత్రిగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీ.ఎం పవన్ కల్యాణ్‌కు కుడిభుజంగా ఉన్నారు. అయితే, నిజంగా నాదెండ్ల భాస్కర్ రావు నమ్మకంగా చెన్నారెడ్డి వెంట లేదా ఎన్టీఆర్ పక్కన నిలబడి ఉంటే, మరెంతో కాలం క్రియాశీల రాజకీయాలలో వైభవంగా ఉండేవారేమో అని విశ్లేషకులు చెబుతుంటారు. బుధవారం నాదేండ్ల కన్నుమూశారు. రాజకీయాల్లో తెలివితేటల కంటే ఓర్పు చాలా అవసరమని..అదే ఆయన జీవితం నుంచి నేటి తరం నాయకులు నేర్చుకోవాల్సిన అనివార్యత ఉందన్న విషయాన్ని గుర్తెరగాలి.
- సాగర్ వనపర్తి, పొలిటికల్ ఎనలిస్ట్-
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.comరచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.

