చేరికకు ముందే అసమ్మతి సెగ .. కాంగ్రెస్​లోకి జూపల్లి రాకను వ్యతిరేకిస్తున్న సీనియర్లు

చేరికకు ముందే అసమ్మతి సెగ .. కాంగ్రెస్​లోకి జూపల్లి రాకను వ్యతిరేకిస్తున్న సీనియర్లు

నాగర్ కర్నూల్, వెలుగు:  కాంగ్రెస్​లో చేరక ముందే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అసమ్మతి సెగ మొదలైంది. కొల్లాపూర్​తోపాటు నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల నియోజకవర్గాల్లో తాను చెప్పిన వాళ్లకు  టికెట్లు ఇవ్వాలని షరతు పెట్టారన్న వార్తలు పాలమూరు కాంగ్రెస్​లో కలకలం రేపుతున్నాయి. కొల్లాపూర్, నాగర్ కర్నూల్, వనపర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ టికెట్లపై ఆశలు పెట్టుకున్న సీనియర్ లీడర్లు సీఆర్ జగదీశ్వర్​రావు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి తదితరులు ఒక్కసారిగా అలర్ట్​ అయ్యారు. వీరంతా కొద్దిరోజులుగా జూపల్లికి వ్యతిరేకంగా పావులు కదుపుతూ, తాడోపేడో తేల్చుకుంటామని సవాల్​విసురుతున్నారు. ఇలాంటి టైంలో ప్రియాంక సభ రద్దు కావడంతో జూపల్లి వర్గీయులు ఒక్కసారిగా నారాజ్​ 
అయ్యారు. 

దమ్ముంటే గెలిచి చూపించాలంటూ సవాళ్లు

కొల్లాపూర్ కాంగ్రెస్​ టికెట్​పై ఆశలు పెట్టుకున్న సీఆర్​జగదీశ్వర్ రావు జూపల్లి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూడేండ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని, చెల్లాచెదురైన క్యాడర్​ను ఏకతాటిపైకి తెచ్చానని, తీరా ఇప్పుడు ఇతర పార్టీ నుంచి వచ్చిన  జూపల్లికి టికెట్​ఇస్తే తన పరిస్థితి ఏంటని బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఒకవేళ తనను కాదని జూపల్లికి టికెట్ ఇస్తే రూ.50 కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే ఓడిస్తానని ఇటీవల సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొల్లాపూర్​లోనే గెలవలేని జూపల్లి  ఏ లెక్కన నాలుగు అసెంబ్లీ సీట్లు అడుగుతాడని మాజీ మంత్రి నాగం జనార్దన్​ రెడ్డి బహిరంగంగా ఫైర్​అయ్యారు. రెండు రోజుల కింద ప్రియాంక సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూపల్లికి దమ్ముంటే ముందు కొల్లాపూర్​లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. దీంతో పీసీసీ వైస్​ప్రెసిడెంట్​డా.మల్లు రవి ఇరకాటంలో పడ్డారు.

 తాము టికెట్లపై హామీ ఇవ్వలేదని, సర్వే ఆధారంగానే టికెట్లు ఉంటాయని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్​రెడ్డికి సపోర్ట్​చేసి, తన ఓటమికి కారణమైన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి కొడుకు రాజేశ్​రెడ్డికి జూపల్లి టికెట్​ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని నాగం ఆగ్రహంతో ఉన్నారు. వనపర్తిలోనూ తనకు వ్యతిరేకంగా జూపల్లి గ్రూపులను రెచ్చగొడుతున్నారని సీనియర్​ నేత, పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి ఫైర్​అవుతున్నారు. బీఆర్ఎస్​లో మంత్రిగా కొనసాగిన కాలంలో కాంగ్రెస్​క్యాడర్​ను ఎన్నో ఇబ్బందులు పెట్టాడని, అలాంటి వ్యక్తి నుంచి పార్టీని అష్టకష్టాలు పడి బతికించుకుంటే తీరా ఇప్పుడు వచ్చి తమ సీట్లకే ఎసరు పెడుతున్నాడని వాపోతున్నారు. జూపల్లిని చేర్చుకుంటే కాంగ్రెస్​కు అన్నివిధాలా నష్టమే తప్ప లాభం లేదని ఈ ముగ్గురు సీనియర్లు హైకమాండ్​కు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

చివరి నిమిషంలో సభ రద్దు

ఈ నెల 20న కొల్లాపూర్​లో భారీ బహిరంగ సభ పెట్టి,  ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరాలని జూపల్లి భావించినా చివరి నిమిషంలో రద్దు కావడంతో ఆయన వర్గీయులు కొంత నారాజ్ అయ్యారు. దీనికి తోడు సీనియర్లు జూపల్లి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తుండడం, చేరికకు ముందే అసమ్మతి తీవ్రం కావడంతో అసలు జూపల్లి కాంగ్రెస్​లో చేరుతారా? లేదా? అనే స్థాయిలో జనం చర్చించుకుంటున్నారు. జూపల్లి అనుచరులు మాత్రం తమ సారు కాంగ్రెస్​లో చేరడం ఖాయమని, కాంగ్రెస్​లో సీనియర్ల కామెంట్లను పట్టించుకోవాల్సిన పనిలేదని చెబుతున్నారు. ఆశావహుల్లో ఆందోళన సహజమేనని, కాకపోతే ఈ అలజడి వెనకాల అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ​