మున్సిపోల్స్​లో టీఆర్​ఎస్ రెబల్స్​కు సీనియర్స్ సపోర్టు

మున్సిపోల్స్​లో టీఆర్​ఎస్ రెబల్స్​కు సీనియర్స్ సపోర్టు
  • కేటీఆర్​ నచ్చచెప్పినా వినని నేతలు
  • బెట్టుమీదున్న మాజీ మంత్రులు జూపల్లి, పట్నం
  • అనుచరుల గెలుపు కోసం ప్రయత్నాలు
  • సబిత టీంను కలవరపెడుతున్న తీగల టీం
  • చౌటుప్పల్​లో వేముల,  ఎల్లారెడ్డిలో రవీందర్ రెడ్డి సెగలు
  • ఇల్లెందులో కోరం కనకయ్య వర్సెస్​ హరిప్రియా నాయక్
  • పార్టీ క్యాండిడేట్ల కోసం ఎమ్మెల్యేలు,
  • రెబల్స్ కోసం సీనియర్ల ప్రచారం

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు రెబల్స్ కంటే సీనియర్లే కొరకరాని కొయ్యగా మారారు. బుజ్జగిస్తే దారిలోకి వచ్చేందుకు రెబల్స్ సిద్ధంగా ఉన్నా.. వారిని సీనియర్ నేతలు అడ్డుకుంటున్నారు. రెబల్స్ తరఫున కొందరు సీనియర్లు నేరుగా ప్రచారం చేస్తుంటే, మరికొందరు రహస్యంగా సపోర్టు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. తాండూరు, మహేశ్వరం, నకిరేకల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కూడా రెబల్స్​కు సీనియర్ నేతలు, వారి అనుచరులు అండగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రెబల్స్ ను గెలిపించుకోవాలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. ఇలా ఒకే పార్టీలో రెండు వర్గాల పోటా పోటీ దూకుడు కేడర్​ను ఆందోళనకు గురిచేస్తోంది.

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​కు మరో నాలుగు రోజుల గడువే ఉన్నా  టీఆర్​ఎస్​లో పంచాయితీ తెగడం లేదు. టికెట్ల విషయంలో కోపంతో ఉన్న సీనియర్లు మెట్టుదిగడం లేదు. కేటీఆర్​ నచ్చచెప్పినా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే తమ అనుచరులను రెబల్స్​గా బరిలోకి దింపిన సీనియర్లు.. వారి గెలుపు కోసం పార్టీ క్యాండిడేట్లకు దీటుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇది టీఆర్​ఎస్​కు సవాల్​గా మారింది.

వంద మంది వెనుక జూపల్లి!

మున్సిపోల్స్ షెడ్యూలు వచ్చినప్పట్నించి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై కొల్లాపూర్​ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెబల్స్ వెనుక జూపల్లి ఉన్నారంటూ ఆధారాలతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్​ జూపల్లిని తెలంగాణ భవన్ కు పిలిచి మాట్లాడారు. అప్పుడు రెబల్స్ తో  తనకు సంబంధం లేదని జూపల్లి స్పష్టం చేశారు. కానీ నామినేషన్ విత్ డ్రా ప్రక్రియ పూర్తయ్యాక జూపల్లి స్వయంగా రంగంలోకి దిగి, రెబల్​ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ, వారికి ఓటెయ్యాలని  అడుగుతున్నారు. మహబూబ్​నగర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో సుమారు 100 మంది రెబల్ అభ్యర్థులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున జూపల్లి బరిలోకి దింపారని ప్రచారంలో ఉంది. కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీలను మాత్రం ఆయన చాలెంజ్ గా తీసుకున్నారు. ఆ రెండు మున్సిపాలిటీల్లో తన సత్తా చాటేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

తనను బుజ్జగించేందుకు ప్రగతిభవన్ నుంచి రంగంలోకి దిగిన ఓ ప్రతినిధికి జూపల్లి ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. తాను 30ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తన సత్తా ఏమిటో మున్సిపోల్స్​ రిజల్ట్స్​లో  చూపిస్తానని అన్నట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ నుంచి కొందరు నేతలు రెబల్స్ ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంటే వాటిని జూపల్లి అడ్డుకున్నట్లు తెలిసింది.

తాండూరులో తెగని పంచాయితీ

తాండూరు మున్సిపాలిటీలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య కేటీఆర్ కుదర్చిన రాజీ ఫలించలేదు. పైకి మాత్రం పార్టీ క్యాండిడేట్ల కోసం పనిచేస్తున్నానని మాజీ మంత్రి చెప్తున్నా.. అంతర్గతంగా మాత్రం రెబల్స్ కు సపోర్టు ఇస్తున్నట్లు  అనుమానాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. తాండూరు నియోజకవర్గంలో కీలకమైన మున్సిపాలిటీలో తన పట్టుకోసం మహేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెబల్స్ కు కావాల్సినంత ఆర్థిక సాయం చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయంపై ప్రగతిభవన్ ఆరా తీసినట్టు తెలిసింది.

సబితకు వ్యతిరేకంగా తీగల టీం

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మున్సిపల్ పోరులో ఎక్కడ కూడా ప్రత్యక్షంగా కనిపించడం లేదు. కానీ ఆయన అనుచరులు మాత్రం మహేశ్వరం నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో బరిలోకి దిగారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి పలుమార్లు కేటీఆర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో కేటీఆర్ స్వయంగా తీగలకు ఫోన్ చేసి రెబల్స్ విషయాన్ని ఆరా తీస్తే.. తనకు రెబల్స్ ఎవరో తెలియదని సమాధానం ఇచ్చినట్టు సమాచారం.

కాంగ్రెస్ నేతలతో వీరేశం, రవీందర్ రెడ్డి!

నకిరేకల్​ నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వేములు వీరేశం కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి కి  సపోర్టు చేస్తున్నారనే అనుమానం స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గంలో ఉంది. 7 వార్డుల్లో టీఆర్​ఎస్​ క్యాండిడేట్లను ఓడించి, కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపించేందుకు రెబల్స్ ను వేముల బరిలోకి దింపినట్లు కేటీఆర్ కు లింగయ్య ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వేములను బుజ్జగించే బాధ్యతను మంత్రి జగదీశ్​రెడ్డికి కేటీఆర్ అప్పగించినట్లు సమాచారం. మంత్రి మాటలకు సరే అని చెప్పిన వేముల.. రహస్యంగా మాత్రం రెబల్స్ కు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా కాంగ్రెస్  క్యాండిడేట్ల విజయం కోసం కృషి చేస్తున్నట్లు కేటీఆర్​కు స్థానిక ఎమ్మెల్యే జాజల సురేందర్ ఫిర్యాదు చేశారు.

ఇల్లెందులో పైచేయి కోసం పట్టు

ఇల్లెందు మున్సిపాలిటీలో పైచేయి కోసం టీఆర్ఎస్ తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. మున్సిపల్ మాజీ చైర్​పర్సన్​  మడత రమకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె భర్త మడత వెంకట్ గౌడ్, ఆయన అనుచరులు 24 వార్డుల్లో రెబల్స్ గా బరిలోకి దిగారు. వీరికి మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య సపోర్టు ఇస్తున్నట్లు అనుమానాలు స్థానిక ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ వర్గంలో ఉన్నాయి. దీనిపై కేటీఆర్ కు ఫిర్యాదు కూడా చేశారు.

కేటీఆర్  వ్యూహం ఏంది?

రెబల్స్ ను, వారికి సపోర్టు చేస్తున్న సీనియర్లను కట్టడి చేయడంలో పార్టీ  వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రెబల్స్ కు సపోర్టు చేస్తున్న సీనియర్లతో  నేరుగా ఆయన మాట్లాడారు. మరోసారి ఫోన్ లో బుజ్జగించారు. అయినా సీనియర్లు వెనక్కి తగ్గడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు వచ్చి ఫిర్యాదు చేసిన ఆ క్షణానికి సీరియస్ గా వ్యవహరిస్తున్న కేటీఆర్ అటుతర్వాత మౌనంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. మీడియా చిట్​చాట్​లో కూడా ఆయన రెబల్స్​పై వేటు తప్పదని చెబుతున్నప్పటికీ.. మున్సిపోల్స్​ రిజల్ట్స్​ వచ్చేదాకా వేచిచూడాలన్న ధోరణిలో ఉన్నట్లు  తెలుస్తోంది.  రెబల్స్​లో గెలిచేవాళ్లు కూడా ఉండొచ్చని, వాళ్లు గెలిస్తే తిరిగి టీఆర్​ఎస్​లోకే వస్తారన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు పార్టీ  వర్గాలు అంటున్నాయి.  ‘తొందరపడి రెబల్స్ పై వేటు వేయొద్దు. గెలిచేదెవరో.. ఓడిదేవరో ఇప్పుడే ఎట్ల తెలుస్తది. రెబల్స్ గెలిచాక మన పార్టీలోకి వస్తరు. అప్పటి వరకు ఓపికతో ఉండాలి’ అని కేటీఆర్​ తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం.