
- జొకోవిచ్, షెల్టన్, ఫ్రిట్జ్ సాఫీగా.. సబలెంక, పెగులా, పౌలిని కూడా..
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లో తొలి రోజే సంచలనం నమోదైంది. 2021 చాంపియన్, రష్యా స్టార్ ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్‌కు తొలి రౌండ్‌లోనే షాక్ తగిలింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన మెన్స్ సింగిల్స్‌లో అన్‌సీడెడ్ బెంజిమిన్ బోంజి (ఫ్రాన్స్) 6–3, 7–5, 6–7 (5/7), 0–6, 6–4తో 13వ సీడ్ మెద్వెదెవ్‌పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మేజర్ టోర్నీలో బోంజి చేతిలో మెద్వెదెవ్ ఓడటం ఇది వరుసగా రెండోసారి. 3 గంటలా 45 నిమిషాల మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కోల్పోయిన రష్యన్ ప్లేయర్ తర్వాత పుంజుకున్నాడు. మధ్యలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో మెద్వెదెవ్ ఆగ్రహానికి గురికావడం అతని ఆటను దెబ్బతీసింది. మూడో సెట్‌లో 5–4 ఆధిక్యంలో ఉన్నప్పుడు ఓ ఫొటో గ్రాఫర్ తన స్థానం నుంచి కదలడంతో ఏకాగ్రత కోల్పోయాడు. దీనిపై చైర్ అంపైర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు.
మ్యాచ్ మొత్తంలో 21 ఏస్‌లు కొట్టిన మెద్వెదెవ్ 10 డబుల్ ఫాల్ట్స్ చేశాడు. 19 బ్రేక్ పాయింట్లలో ఆరింటిని కాచుకున్నాడు. 7 ఏస్‌లు, 4 డబుల్ ఫాల్ట్స్ చేసిన బోంజి 16 బ్రేక్ పాయింట్లలో ఆరింటిని సద్వినియోగం చేసుకున్నాడు. ఇద్దరూ చెరో 64 అనవసర తప్పిదాలు చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోపం పట్టలేక తన రాకెట్‌ను విరగొట్టాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో షెల్టన్ (అమెరికా) 6–3, 6–2, 6–4తో ఇగ్నాసియో బుసు (పెరు)పై, జొకోవిచ్ (సెర్బియా) 6–1, 7–6 (7/3), 6–2తో తియెన్ (అమెరికా)పై, టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 7–5, 6–2, 6–3తో నవా (అమెరికా)పై, జాకుబ్ మెన్సిక్ (చెక్) 7–6 (7/5), 6–3, 6–4తో నికోలస్ జెరీ (చిలీ)పై, లెచెకా (చెక్) 3-–6, 6-–4, 7–-6 (7/5), 6–-1తో బోర్నా కొరిక్ (క్రొయేషియా)పై గెలిచి ముందడుగు వేశారు.
సబలెంకా సాఫీగా..
విమెన్స్ సింగిల్స్‌లో టాప్‌సీడ్ అరీనా సబలెంక (బెలారస్) 7–5, 6–1తో రెబెకా మసరోవా (స్విట్జర్లాండ్)పై, జెసికా పెగులా (అమెరికా) 6–0, 6–4తో మేయర్ షరీఫ్ (ఈజిప్ట్)పై, పౌలిని (ఇటలీ) 6–2, 7–6 (7/4)తో ఐవా (ఆస్ట్రేలియా)పై, అలెగ్జాండర్ ఎలా (ఫిలిప్పీన్స్) 6–3, 2–6, 7–6 (11/13)తో కార్లా టౌసన్ (డెన్మార్క్)పై, ఎమ్మా నవారో (అమెరికా) 7–6 (11/9), 6–3తో వాంగ్ (చైనా)పై, ఫెర్నాండేజ్ (కెనడా) 6–2, 6–1తో మారినో (కెనడా)పై, మెక్‌నల్లీ (అమెరికా) 6–2, 6–2తో టిచ్‌మన్ (స్విట్జర్లాండ్)పై గెలవగా, పెట్రా క్విటోవా (చెక్) 1–6, 0–6తో డయానా పెరీ (ఫ్రాన్స్) చేతిలో కంగుతిన్నది.