20 మంది ఆఫీసర్లపై..బదిలీ వేటు

20 మంది ఆఫీసర్లపై..బదిలీ వేటు
  • నలుగురు కలెక్టర్లు, ముగ్గురు సీపీలు,  10 మంది ఎస్పీలను ట్రాన్స్​ఫర్​ చేసిన ఈసీ
  • లిస్ట్​లో రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజ్ గిరి,  నిర్మల్​, యాదాద్రి భువనగిరి కలెక్టర్లు
  • హైదరాబాద్​, వరంగల్​, నిజామాబాద్​ సీపీలు సీవీ ఆనంద్​, రంగనాథ్​, సత్యనారాయణ కూడా..
  • రవాణా శాఖ సెక్రటరీ, ఎక్సైజ్ కమిషనర్​, వాణిజ్య పన్నుల శాఖ డైరెక్టరూ బదిలీ
  • పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే మరిన్ని కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు
  • ఆ ఆఫీసర్లకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పనులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం

హైదరాబాద్, వెలుగు : కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నలుగురు కలెక్టర్లు, ముగ్గురు సీనియర్​ ఐఏఎస్​లు, ముగ్గురు పోలీస్​ కమిషనర్లతో పాటు  మరో 10 మంది ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఇందులో రంగారెడ్డి, మేడ్చల్‌‌, యాదాద్రి, నిర్మల్‌‌ జిల్లాల కలెక్టర్లు.. హైదరాబాద్​, వరంగల్​, నిజామాబాద్​ సీపీలు..  రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్‌‌ శాఖ డైరెక్టర్‌‌, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌‌ ఉన్నారు. వీరందరినీ బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం సాయంత్రం ఈసీ ఆదేశించింది.  అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ అధికారులకు ఎన్నికల సంబంధిత పనిని అప్పగించరాదని స్పష్టం చేసింది. బదిలీ అయిన అధికారులు ‌‌వెంటనే దిగువన ఉన్న అధికారికి బాధ్యతలను అప్పగించాలని కూడా ఈసీ ఆదేశించింది. అధికారుల పనితీరు, వారిపై వచ్చిన కంప్లయింట్స్​ ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

ఎలక్షన్ టైంలో పటిష్టంగా పనిచేయాల్సిన ఎక్సైజ్‌‌, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశాల్లో పేర్కొంది. బదిలీ అయినవారి స్థానంలో గురువారం సాయంత్రం 5 గంటల కల్లా ఎవరిని నియమించాలనే దానిపై ప్యానల్‌‌ పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. ఇకనైనా రాష్ట్రంలోని అధికారులు పద్ధతి మార్చుకోవాలని, నిష్పక్షపాతంగా పనిచేయాలని, లేకపోతే మరిన్ని కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది.  

ఆ నలుగురు కలెక్టర్లు వీరే..

గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్​గా పనిచేసిన అమోయ్​ కుమార్​ ను రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్​ బదిలీల్లో భాగంగా జనవరి 31న మేడ్చల్ మల్కాజ్​గిరికి పంపింది. అదే జిల్లాలో పనిచేస్తున్న హరీశ్​ ను రంగారెడ్డికి బదిలీ చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరిపైనా ఈసీ బదిలీ వేటు పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్​గా ఉన్న పమేల సత్పతిని ఆగమేఘాల మీద ట్రాన్స్​ఫర్​ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడికి వినయ్​ కృష్ణారెడ్డిని కలెక్టర్​గా పంపింది. నిర్మల్​ జిల్లా కలెక్టర్​గా వరుణ్​రెడ్డిని నియమించింది. వినయ్​ కృష్ణారెడ్డి, వరుణ్​రెడ్డిపై ఇప్పుడు ఈసీ బదిలీ వేటు వేసింది. 

ఆ ముగ్గురు సీపీలు వీళ్లే ..

కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు పోలీసు కమిషనర్లను ట్రాన్స్​ఫర్​ చేసింది. అందులో హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్​, వరంగల్​ సీపీ రంగనాథ్​, నిజమాబాద్​ సీపీ సత్యనారాయణ ఉన్నారు. వీరు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని వచ్చిన కంప్లయింట్స్​పై ఈసీ చర్యలు తీసుకున్నది. 

అధికారులపై ఈసీకి ఫిర్యాదుల వెల్లువ

ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ (సీఈసీ) రాజీవ్​ కుమార్​తో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం టీమ్​ రాష్ట్రంలో పర్యటించింది. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యేకంగా సమావేశమైంది. బీఆర్​ఎస్ పార్టీ మినహా కాంగ్రెస్, బీజేపీ మిగతా అన్ని పొలిటికల్​ పార్టీలు రాష్ట్ర అధికార యంత్రాంగంపై కంప్లయింట్స్​ ఇచ్చాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఆఫీసర్లు పనిచేస్తున్నారని..

డబ్బు, మద్యం పంపిణీని గత ఉప ఎన్నికల్లో నివారించలేకపోయారని ఫిర్యా దు చేశాయి. సీఎస్​, డీజీపీ​పైనా కంప్లయింట్స్​ ఇచ్చా యి. ఈసీ టూర్​లోనే సీఎస్, డీజీపీతో పాటు కలెక్టర్లను, పోలీసు కమిషనర్లను, ఎస్పీలను సీఈసీ రాజీవ్​కుమార్​  హెచ్చరించారు. కఠిన చర్యలు ఉంటాయని.. ఎవరిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పొలిటికల్​ పార్టీల లీడర్లతో పాటు కొందరు ఈ–మెయిల్స్​ ద్వారా అధికారులపై ఈసీకి ఫిర్యాదులు పంపారు.

కావాలనుకున్నోళ్లకు అనుకున్న చోట పోస్టింగ్​లు

మూడేండ్లు ఆపైన ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఈ ఏడాది జూన్​లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. దీంతో రాష్ట్ర సర్కార్​ కొంతమంది ఐఏఎస్​లు, ఐపీఎస్​లతో పాటు ఆఫీసర్లను బదిలీ చేసింది. ఈ  బదిలీల్లో అధికార పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారికి అనుకున్న చోట్ల పోస్టింగ్​లు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు పైరవీలు చేసుకుని మరీ తమవారికి పోస్టింగ్​లు ఇప్పించుకున్నారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇదే అంశాన్ని ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి.

ఇలాంటి అధికారులు కక్షపూరితంగా తమ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధికార పక్షానికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారుల వల్ల  ఎన్నికలు సజావుగా సరిగే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదులను  పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించింది. ఇదే క్రమంలో తాజాగా 20 మందిపై బదిలీ వేటు వేసింది.