మీకేం తెలుసయ్యా..మేం చెప్పినట్టు కట్టండి!

మీకేం తెలుసయ్యా..మేం చెప్పినట్టు కట్టండి!
  • కాళేశ్వరం డిజైన్లను తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు
  • ఇంజనీర్లు, నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చి ఇష్టారీతిన నిర్మాణం
  • బ్యారేజీలను విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లలో మార్పులు  
  • సీసీ కెమెరాల్లోనూ పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు  
  • ప్రభుత్వ ఎంక్వైరీలో బయటకు వస్తున్న నిజాలు 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన ఎంక్వైరీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాళేశ్వరం డిజైన్లను గత ప్రభుత్వ పెద్దలు తరచూ మార్చారని.. తాము చెప్పినట్టు బ్యారేజీలను నిర్మించాలని అటు ఇంజనీర్లు, ఇటు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చారని విచారణలో తేలినట్టు తెలిసింది. ‘‘ఏదైనా పని అయ్యేందుకు ఏడాది పడుతుందని నిర్మాణ సంస్థ, ఇంజనీర్లు చెబితే.. ‘అలా ఎందుకు చేయడం. 

ఇలా చేస్తే 6 నెలల్లోపే పూర్తవుతుంది కదా. మీకేం తెలుసయ్యా.. మేం చెప్పినట్టు చేయండి.. ఏం కాదు” అంటూ శాస్ర్తీయంగా కట్టాల్సిన బ్యారేజీలను ఇష్టారీతిన నిర్మించేలా బలవంతం చేసినట్టు విచారణలో వెల్లడైందని సమాచారం. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణం కొనసాగుతున్న టైమ్ లో అప్పటి ప్రభుత్వ పెద్దలు తరచూ అక్కడికి వెళ్లి పనులను పర్యవేక్షించారు. ఈ క్రమంలో వెళ్లినప్పుడల్లా డిజైన్లలో మార్పులు చేశారు. అంతేగాకుండా బ్యారేజీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనులను మానిటర్ చేశారు. 

సీసీ కెమెరాల్లో పనులను పర్యవేక్షిస్తూ కూడా మార్పుచేర్పులు చెప్పారని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అప్పటి సీఎంతో పాటు సీఎంఓ అధికారులు, హైదరాబాద్​నుంచి ఇంజనీర్లు వెళ్లి బ్యారేజీల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించారు. అయితే వీళ్లు నిర్మాణ తీరు, నాణ్యత, వేగంగా పనులు అయ్యేలా చూసేందుకు వెళ్లలేదని.. వెళ్లినప్పుడల్లా ప్రభుత్వ పెద్దలు సూచించిన మార్పులను అక్కడున్నోళ్లకు చెప్పారని, బ్యారేజీల నిర్మాణాన్ని మార్చేలా చేశారని తెలిసింది. 

అనుకున్నది ఒకలా.. కట్టింది ఇంకోలా 

మేడిగడ్డను మొదట ప్లోటింగ్ స్ట్రక్షర్ (నీటిపై తేలియాడే విధంగా)గా డిజైన్ చేసి, పర్మనెంట్ స్ట్రక్చర్ గా నిర్మించడం వెనుక గత ప్రభుత్వ పెద్దల ఒత్తిడే కారణమని విచారణలో తేలింది. మేడిగడ్డ నిర్మాణ ప్రాంతంలో ప్రాథమిక సర్వే చేసిన ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ తక్కువ స్టోరేజీతో బ్యారేజీని ప్రతిపాదించగా.. అప్పటి సీఎం ఒత్తిడితో 16 టీఎంసీలు నిల్వ చేసేలా స్టోరేజీలో మార్పులు చేశారు. 

స్టోరేజీ పెంపు కారణంగా బ్యారేజీపై పడే ఒత్తిడిని కూడా అధ్యయనం చేయలేదు. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ ఎ ల్అండ్ టీ చెప్పినా, అప్పటి ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. దీనిపై తాము అప్పటి సర్కార్​కు లెటర్ కూడా రాశామని నిర్మాణ సంస్థ ప్రస్తుత ప్రభుత్వానికి చెప్పినట్టు తెలిసింది. డిజైన్ లోపంపై ఫీల్డ్ ఇంజనీర్లు పట్టింపు లేనట్టుగా వ్యవహరించడం, ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గడంతోనే వందేండ్లు నిలవాల్సిన మేడిగడ్డ.. నాలుగేండ్లకే కుంగిపోయిందని అధికారులు అంటున్నారు. డిజైన్ లో ఎక్కడెక్కడ మార్పులు జరిగాయనే దానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. దాని ఆధారంగా బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 20 మందికి పైగా ఇంజనీర్లపై చర్యలకు విజిలెన్స్ డిపార్ట్ మెంట్ సిఫార్సులు రెడీ చేసినట్టు తెలిసింది.  

మేడిగడ్డ డిజైన్లు చేసిందెవరు?  

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఎక్స్ పర్ట్ టీమ్, విజిలెన్స్ డిపార్ట్ మెంట్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను విచారించారు. ఎన్డీఎస్ఏ విచారణ సమయంలో బ్యారేజీ నిర్మాణం, డిజైన్లపై ఇరిగేషన్ ఇంజనీర్లు ఒకలా చెప్తే.. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధుల వాదన ఇంకోలా ఉంది. 

మేడిగడ్డ డిజైన్లను తాము ఫైనల్ చేయలేదని ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ పరిధిలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఇంజనీర్లు చెప్పారు. ఎల్ అండ్ టీ నే డిజైన్ చేసుకుందని, తమను ఒత్తిడి చేయడంతోనే వాటికి ఆమోదం తెలిపామని సీడీవో ఇంజనీర్లు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎల్ అండ్ టీ ప్రతినిధులు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లతోనే తాము బ్యారేజీ నిర్మించామని, డిజైన్లకు తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. 

డిజైన్ల మార్పులపై తాము హెచ్చరించినా ఇంజనీర్లు పట్టించుకోలేదని చెప్పారు. ఫీల్డ్ ఇంజనీర్లు చెప్పిన దానికి విరుద్ధంగా ఎల్ అండ్ టీ ప్రతినిధులు స్టేట్ మెంట్ ఇవ్వడంతో అసలు ఏం జరిగిందో తేల్చడంపై విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టారు. డిజైన్ల మార్పులకు గత ప్రభుత్వ పెద్దల ఒత్తిడే కారణమని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.