సెన్సెక్స్ 199 పాయింట్లు డౌన్​

 సెన్సెక్స్ 199 పాయింట్లు డౌన్​
  •      65 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 

ముంబై :  ఐటీ,  చమురు షేర్లలో ప్రాఫిట్​ బుకింగ్, గ్లోబల్​ ట్రెండ్స్​ బలహీనంగా ఉండటంతో బెంచ్‌‌మార్క్ సెన్సెక్స్ 199 పాయింట్లు తగ్గింది. దీంతో స్టాక్ మార్కెట్లు మంగళవారం ఐదు రోజుల ర్యాలీని ముగించాయి.  30 షేర్ల బీఎస్‌‌ఈ సెన్సెక్స్ 199.17 పాయింట్లు  తగ్గి 73,128.77 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌‌లోని 20 షేర్లు క్షీణించగా, 10 పురోగమించాయి. ఇంట్రా-డేలో ఇది ఆల్-టైమ్  గరిష్ట స్థాయి 73,427.59ని తాకింది. ప్రాఫిట్​ బుకింగ్​ వల్ల లాభాలను నిలుపుకోవడంలో విఫలమైంది.  367.65 పాయింట్లు తగ్గి 72,960.29 కనిష్ట స్థాయికి దిగజారింది. 

నిఫ్టీ 65.15 పాయింట్లు తగ్గి 22,032.30 వద్ద ముగిసే ముందు దాని ఆల్-టైమ్ ఇంట్రా-డే గరిష్ట స్థాయి 22,124.15 ను తాకింది. నిఫ్టీలో 33 షేర్లు నష్టాల్లో ముగియగా 17 లాభపడ్డాయి.  అయితే మంగళవారం సెన్సెక్స్ కంపెనీలలో హెచ్‌‌సీఎల్ టెక్ అత్యధికంగా 2.05 శాతం పడిపోయింది. విప్రో 1.93 శాతం, ఎన్‌‌టీపీసీ 1.84 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.43 శాతం, ఇన్ఫోసిస్ 1.27 శాతం, టెక్ మహీంద్రా 1.17 శాతం, టీసీఎస్ 1.06 శాతం పడ్డాయి. ఇండస్‌‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్‌‌టెల్, ఎస్‌‌బీఐ కూడా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

 టాటా స్టీల్, టైటాన్, మారుతీ, లార్సెన్ అండ్ టూబ్రో, ఐటీసీ, జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్ లాభపడ్డాయి.   ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో  హాంకాంగ్ దిగువన స్థిరపడగా, షాంఘై సానుకూలంగా ముగిశాయి. యూరప్ మార్కెట్లు దిగువన ట్రేడవుతున్నాయి. మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్ డే కారణంగా సోమవారం అమెరికా మార్కెట్లు పనిచేయలేదు.