Sensex Crash: బేర్స్ దెబ్బకి సెన్సెక్స్1000 పాయింట్లు ఫట్.. ఇన్వెస్టర్స్ మార్కెట్ నుంచి ఎందుకు పారిపోతున్నరు?

Sensex Crash: బేర్స్ దెబ్బకి సెన్సెక్స్1000 పాయింట్లు ఫట్.. ఇన్వెస్టర్స్ మార్కెట్ నుంచి ఎందుకు పారిపోతున్నరు?

Market Crash: నేడు నష్టాలతో తమ ప్రయాణాన్ని మెుదలు పెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడేలో నిన్నటి క్లోజింగ్ నుంచి గరిష్ఠంగా 1000 పాయింట్లకు పైగా పతనాన్ని నమోదు చేసింది. అయితే ప్రస్తుతం ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను వరుసగా విక్రయించటం ఒత్తిడికి కారణంగా నిపుణలు చెబుతున్నారు. వారం ప్రారంభంలో బాగానే ఉన్న మార్కెట్లు ఒక్కసారిగా ప్రతికూలతలకు గురికావటానికి, ఇన్వెస్టర్లు భయంతో మార్కెట్లను వీడటానికి కారణాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్లలో అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అసలు మార్కెట్ల పతనానికి మేజర్ కారణాలు ఏంటి, అనలిస్టులు దీనిపై ఏమంటున్నారనే విషయాలపై క్లారిటీ తెచ్చుకుందాం..

1. భారతీయ స్టాక్ మార్కెట్లను పరోక్షంగా భారీగా ప్రభావితం చేస్తు్న్న అంశం అమెరికా రుణాలు, వడ్డీ భారంపై పెరుగుతున్న ఆందోళనలే. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో అక్కడి అధికారులు తీసుకురానున్న కొత్త బడ్జెట్లో పన్ను తగ్గింపులకు చేస్తున్న ప్రయత్నాలు మరింత దారుణ ఆర్థిక పరిణామాలకు దారితీయవచ్చనే భయాలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగాయి. దీనికి తోడు ఇటీవల ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపై అలారమ్ మోగిస్తూ క్రెడిట్ రేటింగ్ తగ్గింపును ప్రకటించింది. ట్రంప్ సర్కార్ చర్యలు ఫెడరల్ డెఫిసిట్ భారీగా పెంచే ప్రమాదం ఉందని మూడీస్ పేర్కొంది. 

2. అమెరికా ఆర్థిక వ్యవస్థలోని అధిక ఆర్థిక లోటు కారణంగా యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదలను సూచిస్తోంది. వాస్తవానికి ఇది పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న ఆందోళనలు, తగ్గుతున్న నమ్మకాన్ని చూపుతోంది. పెరుగుతున్న యూఎస్ బాండ్ రాబడులు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలపై ప్రతికూలతను చూపుతుందని జియోజిత్ బ్రోకరేజ్ నిపుణులు వికె విజయకుమార్ పేర్కొన్నారు. 

3. అమెరికా మార్కెట్లలో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి ప్రపంచ ప్రధాన మార్కెట్లైన ఆసియా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్ సహా ఇండియా మార్కెట్లను ప్రభావితం చేస్తోందని వెల్లడైంది. ఈ దేశాల స్టాక్ మార్కెట్ సూచీలు దాదాపు 1 శాతం కరెక్షన్ నమోదు చేశాయి. మరో పక్క పెరుగుతున్న కరోనా కేసులు కూడా ఆందోళనలు పెంచుతున్న అంశంగా ఉంది. 

4. నేడు భారతీయ స్టాక్ మార్కెట్లలో ఐటీ సేవల రంగంలోని కంపెనీల పతనం మార్కెట్లను నష్టాల్లోకి దిగజార్చింది. ప్రధాన ఐటీ స్టాక్స్ అయిన టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్ రెండు శాతం మేర కరెక్షన్ చూడగా.. నిఫ్టీ ఐటీ సూచీలోని మిగిలిన కంపెనీల షేర్లు కూడా నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.

5. ఇక చివరిగా ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసే ఇండియాస్ వోలటాలిటీ ఇండెక్స్ సూచీ నేడు ఇంట్రాడేలో భారీగా పెరిగి 18.04 శాతాన్ని చేరుకుంది. ఇది మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడితో పాటు బేర్ మార్కెట్లను సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మార్కెట్లు కన్సాలిడేషన్ స్థాయిలో కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. టెక్నికల్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వారు అంటున్నారు.

మెుత్తానికి మధ్యాహ్నం 1.19 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీలు సెకండ్ హాఫ్ ట్రేడింగ్ పరిశీలిస్తే.. సెన్సెక్స్ సూచీ 923 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 277 పాయింట్లు నష్టపోయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 420 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 408 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. విదేశీ మదుపరులు సైతం అమ్మకాలకు దిగుతూ చైనా మార్కెట్లలో పెట్టుబడులకు ప్రయత్నించటం కూడా మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీస్తోందని తేలింది.