
ముంబై: మార్కెట్‌లో బుల్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. బుధవారం నష్టాల్లో ఓపెన్ అయిన సెన్సెక్స్, నిఫ్టీ మార్నింగ్ సెషన్ మొత్తం నెగెటివ్‌లోనే కదిలాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ షేర్లు మార్కెట్‌కు సపోర్ట్ ఇచ్చినప్పటికీ, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ షేర్లు ఇండెక్స్‌లను కిందకి లాగాయి. కానీ, మధ్యాహ్నం సెషన్‌లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
ఐటీ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో నిఫ్టీ ఇంట్రాడేలో 22,497 దగ్గర ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 118 పాయింట్లు (0.53 శాతం) పెరిగి 22,474 దగ్గర సెటిలయ్యింది. సెన్సెక్స్ మొదటి సారిగా 74 వేల లెవెల్‌ను క్రాస్ చేసింది. 409 పాయింట్లు లాభపడి 74,086 దగ్గర ముగిసింది. బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు పాజిటివ్‌గా కదలగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్ షేర్లు నష్టపోయాయి. సెక్టార్ల పరంగా చూస్తే, బ్యాంక్, ఫార్మా, ఐటీ ఇండెక్స్‌లు ఒక శాతం వరకు లాభపడ్డాయి.
ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ , రియల్టీ ఇండెక్స్‌లు పడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో బుధవారం కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2 శాతం పడ్డాయి. నిఫ్టీ 22,600–22,650 వరకు పెరుగుతుందని బీఎన్‌పీ పారిబా ఎనలిస్ట్ జతిన్ గేడియా పేర్కొన్నారు. 22,224 లెవెల్ సపోర్ట్‌గా పని చేస్తుందని అంచనా వేశారు.