
- సుమారు ఒక శాతం పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ
- మెరిసిన కన్స్యూమర్ డూరబుల్స్, ఆటో షేర్లు
- కొనసాగుతున్న ఎఫ్‌ఐఐల అమ్మకాలు
- డాలర్ మారకంలో 88.19 వద్ద రూపాయి
ముంబై: వరుసగా మూడు సెషన్లలో నష్టపోయిన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సోమవారం పుంజుకున్నాయి. సుమారు ఒక శాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 555 పాయింట్లు పెరిగి 80,364.49 వద్ద ముగియగా, నిఫ్టీ 198.20 పాయింట్లు (0.81శాతం) లాభపడి 24,625.05 వద్ద సెటిలయ్యింది. 555 పాయింట్లు పెరిగి . ఐటీ, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. సెసెన్సెక్స్ కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ట్రెంట్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ ఎక్కువగా లాభపడగా, సన్ ఫార్మా, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టైటాన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
మిడ్, స్మాల్ క్యాప్ షేర్లూ జూమ్
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ సోమవారం 1.64 శాతం, స్మాల్‌క్యాప్ 1.49శాతం పెరిగాయి. ఆటో ఇండెక్స్ 2.68శాతం లాభపడగా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ (2.07శాతం), కన్స్యూమర్ డిస్క్రిషనరీ (2శాతం), క్యాపిటల్ గూడ్స్ (1.93శాతం), పవర్ (1.80శాతం), మెటల్ (1.68శాతం), బీఎస్‌ఈ ఫోకస్డ్ ఐటీ (1.65శాతం), బీఎస్‌ఈ ఐటీ (1.62శాతం) ఇండెక్స్‌లు భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈలో 2,796 షేర్లు లాభాల్లో, 1,391 షేర్లు నష్టాల్లో ముగిశాయి. మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ ఎనలిస్ట్ ప్రశాంత్ తాప్సే ప్రకారం, “గత మూడు సెషన్లలో మార్కెట్ బాగా పడింది. ఇండెక్స్‌లు తిరిగి పెరగడం సహజం. బలమైన జీడీపీ డేటా, జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్‌పై ఆశలు మార్కెట్‌కు ఊపందించాయి. అయితే, ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐల) అమ్మకాలు కొనసాగుతున్నాయి. రూపాయి విలువ పడడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది” అని వివరించారు. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్ లాభాల్లో, కొరియా, జపాన్ నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర సోమవారం 0.92శాతం పెరిగి బ్యారెల్‌కు 68.10 డాలర్లకి చేరింది. ఎఫ్‌ఐఐలు శుక్రవారం రూ.8,312.66 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, సోమవారం మరో రూ.1,400 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. విదేశీ పెట్టుబడులు ఇండియా నుంచి వెళ్లిపోతుండడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ10 పైసలు తగ్గి 88.19 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది.
జీడీపీ పెరగడంతో మార్కెట్‌కు బూస్ట్..
ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ క్వార్టర్‌లో భారత జీడీపీ అంచనాలను మించి 7.8 శాతం వృద్ధి సాధించింది. గత ఐదు క్వార్టర్లలో ఇదే ఎక్కువ. దీంతో పాటు జీఎస్‌టీ రేషనలైజేషన్‌పై అంచనాలతో మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు ర్యాలీ చేశాయి. “జీడీపీ వృద్ధి అంచనాలను మించింది. గ్లోబల్‌గా అనిశ్చితులు ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతోంది. దీంతో ఇండియాపై పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతోంది. జీఎస్‌టీ రేట్లు తగ్గిస్తే వినియోగం పుంజుకుంటుందనే అంచనాలు ఎక్కువయ్యాయి”అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా మాట్లాడుతూ, “ మార్కెట్ ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించింది. నిఫ్టీ సోమవారం మార్నింగ్ సెషన్‌లో స్వల్ప లాభాల్లో కదిలినా, కొన్ని హెవీవెయిట్ షేర్ల కొనుగోళ్లతో సెషన్ చివరిలో ర్యాలీ చేసింది” అని అన్నారు.