కరోనా ఎఫెక్ట్.. ఏడోరోజు మార్కెట్లు ఢమాల్

కరోనా ఎఫెక్ట్.. ఏడోరోజు మార్కెట్లు ఢమాల్
  • 153 పాయింట్లునష్టపోయిన సెన్సెక్స్‌‌
  • నిఫ్టీకి 69 పాయింట్ల నష్టం కరోనా ఎఫెక్టే కారణం

మనదేశంలో కొత్తగా రెండు కరోనా వైరస్‌‌ కేసులు బయటపడ్డట్టు తేలడంతో మార్కెట్లు సోమవారం నష్టపోయాయి. వరుసగా ఏడో రోజు కూడా సూచీలు డీలా పడ్డాయి. ఢిల్లీలో ఒకరికి, హైదరాబాద్‌‌లో ఒకరికి తాజాగా కరోనా సోకినట్టు వార్తలు రాగా, అమ్మకాల ఒత్తిడి ఎక్కువయింది. ఇంట్రాడే లాభాలన్నీ ఆవిరయ్యాయి. సెన్సెక్స్‌‌ ఒకదశలో 1,297 పాయింట్లు లాభపడినా, చివరికి 153 పాయింట్ల నష్టంతో 38,144 వద్ద ముగిసింది. ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 11,133 వద్ద ముగిసింది. నిఫ్టీ ఒకదశలో 11,036 వరకు తగ్గినా, చివరికి కోలుకుంది. కరోనా వైరస్ వల్ల చైనా నుంచి సప్లైలన్నీ నిలిచిపోతాయన్న వార్తల వల్ల మార్కెట్‌‌ బాగా ఒత్తిడికి గురయింది. ఇంటర్నేషనల్‌‌ మార్కెట్లకు కూడా నష్టం తప్పదనే అంచనాల వల్ల ఇన్వెస్టర్ సెంటిమెంట్‌‌ దెబ్బతింది. బీఎస్‌‌ఈలోని 19 సెక్టార్‌‌ సూచీల్లో 17 సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. మెటల్‌‌, ఆయిల్‌‌, గ్యాస్‌‌ ఇండెక్స్‌‌లు రెండు శాతం వరకు నష్టపోయాయి. బీఎస్ఈ యుటిలిటీస్ టెలికం, బ్యాంక్‌‌ఎక్స్‌‌, బేసిక్‌‌ మెటీరియల్స్‌‌, ఎనర్జీ సెక్టార్‌‌ సూచీలు ఒకశాతం వరకు నష్టపోయాయి. బీఎస్‌‌ఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రం టాప్‌‌ గేనర్‌‌గా నిలిచి ఒకశాతం పెరిగింది. అమ్మకాల ఒత్తిడి వల్ల మిడ్ స్మాల్‌‌క్యాప్‌‌ షేర్లకు నష్టాలు తప్పలేదు. మిడ్‌‌క్యాప్‌‌ ఇండెక్స్‌‌ 0.65 శాతం, బీఎస్ఈ స్మాల్‌‌క్యాప్‌‌ ఇండెక్స్‌‌ 0.8 శాతం పతనమయింది. నిఫ్టీ–50లో యెస్ బ్యాంక్‌‌ టాప్‌‌ లూజర్‌‌గా నిలిచింది. ఇది 6.65 శాతం నష్టపోయి రూ.32.30కి చేరింది. స్టేట్‌‌బ్యాంక్‌‌, టాటా స్టీల్‌‌, గెయిల్‌‌, హీరో మోటోకార్ప్‌‌, భారత్‌‌ పెట్రోలియం, బజాజ్‌‌ ఆటో, టాటా మోటార్స్‌‌, హిండాల్కో, ఎల్ అండ్‌‌ టీ, గ్రాసిమ్ షేర్లూ నష్టపోయాయి. హెచ్‌‌సీఎల్‌‌, ఐషర్‌‌ మోటర్స్‌‌, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌‌, టెక్ మహీంద్రా, భారతి ఇన్‌‌ఫ్రాటెల్‌‌, మహీంద్రా అండ్‌‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. మొత్తం 1,508 కంపెనీల షేర్లు నష్టపోగా, 946 కంపెనీల షేర్లకు లాభాలు వచ్చాయి.

రూపాయికి కరోనా షాక్‌‌ తప్పలేదు. డాలర్‌‌తో రూపాయి మారకం విలువ సోమవారం 52 పైసలు తగ్గి 72.76కు చేరింది. కరోనా కేసుల వల్ల ఈక్విటీ మార్కెట్లకు నష్టం రావడం, ఫారెక్స్‌‌ ఔట్‌‌ఫ్లోలు పెరగడమే ఇందుకు కారణం.