185 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌‌‌‌

185 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌‌‌‌

ముంబై: బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు వరసగా ఎనమిదో సెషన్‌‌లో కూడా లాభపడ్డాయి.  గ్లోబల్‌‌ మార్కెట్ల నుంచి సపోర్ట్ దొరకడంతో సెన్సెక్స్‌‌, నిఫ్టీలు గురువారం కూడా కొత్త రికార్డ్‌‌లను టచ్ చేశాయి. 30 షేర్లున్న సెన్సెక్స్ 185 పాయింట్లు (0.29 శాతం) పెరిగి 63,284 వద్ద క్లోజయ్యింది. క్లోజింగ్ బేసిస్‌‌లో ఈ ఇండెక్స్‌‌కు ఇదే ఆల్‌‌ టైమ్ హై. ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ 54 పాయింట్లు లాభపడి 18,813 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో  18,887.60 వరకు వెళ్లిన ఈ ఇండెక్స్‌‌, ఈ లెవెల్‌‌ దగ్గర ఆల్‌‌ టైమ్‌‌ హైని నమోదు చేసింది. సెన్సెక్స్‌‌లో అల్ట్రాటెక్‌‌ సిమెంట్‌‌, టాటా స్టీల్‌‌, టీసీఎస్‌‌, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్‌‌, హెచ్‌‌సీఎల్‌‌ టెక్, ఎల్‌‌ అండ్ టీ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. 

ఐసీఐసీఐ బ్యాంక్‌‌, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్‌‌, కోటక్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.  వడ్డీ రేట్లను తక్కువగా పెంచుతామనే సంకేతాలను  జెరోమ్‌‌ పావెల్‌‌ ఇచ్చారని, ఫలితంగా మార్కెట్‌‌లో బుల్స్ ఆధిపత్యం కొనసాగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. బ్రాడ్ మార్కెట్ చూస్తే బీఎస్‌‌ఈ స్మాల్‌‌క్యాప్ ఇండెక్స్‌‌ 0.63 శాతం, మిడ్‌‌క్యాప్ ఇండెక్స్‌‌ 0.62 శాతం లాభపడ్డాయి. సెక్టార్ల పరంగా చూస్తే ఐటీ, రియల్టీ, టెక్‌‌, కమొడిటీస్‌‌, ఇండస్ట్రియల్స్‌‌ ఎక్కువగా పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 8 పైసలు బలపడి 81.22 వద్ద సెటిలయ్యింది.

పెరిగిన తయారీ రంగం పనితీరు..

ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌లో దేశ తయారీ రంగం పనితీరు కొద్దిగా మెరుగుపడింది. ఎస్‌‌ అండ్ పీ గ్లోబల్‌‌ ఇండియా నెలవారీ విడుదల చేసే మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డేటా నవంబర్‌‌‌‌‌‌ నెలకు గాను 55.7 గా రికార్డయ్యింది. అక్టోబర్‌‌‌‌లో ఇది 55.3 గా ఉంది.