సెన్సెక్స్​ @ 83 వేలు.. నిఫ్టీ 470 పాయింట్లు అప్.. లైఫ్ ​టైమ్ ​హైకి చేరిక

సెన్సెక్స్​ @   83 వేలు..  నిఫ్టీ 470 పాయింట్లు అప్.. లైఫ్ ​టైమ్ ​హైకి చేరిక
  • ఇన్వెస్టర్లకు రూ.6.5 లక్షల కోట్ల లాభం

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మురిపించాయి.  బెంచ్‌‌మార్క్ సెన్సెక్స్ గురువారం తొలిసారిగా చారిత్రాత్మక 83,000 స్థాయిని తాకింది.  నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది.  గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ,  విదేశీ నిధుల ప్రవాహం, కొనుగోళ్ల వల్ల ఇండెక్స్​లు రికార్డు స్థాయిలకు దూసుకెళ్లాయి.  ట్రేడ్ చివరి గంటలో సెన్సెక్స్​ 1,593.03 పాయింట్లు పెరిగి జీవితకాల ఇంట్రా-డే గరిష్ట స్థాయి 83,116.19కి చేరుకుంది. చివరికి 1,439.55 పాయింట్లు పెరిగి 82,962.71 వద్ద రికార్డు స్థాయిలో ముగిసింది.  ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ 470.45 పాయింట్లు పెరిగి రికార్డు ముగింపు గరిష్ట స్థాయి 25,388.90 వద్ద స్థిరపడింది. ఈ బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 25,433.35 లెవెల్‌ను టచ్ చేసింది.  దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6.5 లక్షల కోట్ల వరకు పెరిగింది. యూఎస్​ఫెడ్​రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు మార్కెట్లలో ఆశావాదాన్ని పెంచాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.  సెన్సెక్స్‌‌ కంపెనీల్లో భారతీ ఎయిర్‌‌టెల్‌‌, ఎన్‌‌టీపీసీ, జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్‌‌, మహీంద్రా అండ్‌‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌‌, టెక్‌‌ మహీంద్రా, లార్సెన్‌‌ అండ్‌‌ టూబ్రో, టాటా స్టీల్‌‌, స్టేట్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా, కోటక్‌‌ మహీంద్రా బ్యాంక్‌‌ అత్యధికంగా లాభపడ్డాయి.  నెస్లే మాత్రమే వెనుకబడింది.   బీఎస్​ఈ మిడ్‌‌క్యాప్ గేజ్ 1.32 శాతం, స్మాల్‌‌క్యాప్ ఇండెక్స్ 0.79 శాతం పెరిగాయి.


అన్ని సూచీలు పాజిటివ్‌‌గానే 

సూచీలన్నీ పరుగులు పెట్టాయి. మెటల్ 3.05 శాతం, టెలికమ్యూనికేషన్ 2.61 శాతం, పవర్ 2.02 శాతం, ఆటో 1.99 శాతం, యుటిలిటీస్ 1.93 శాతం, కమోడిటీలు 1.85 శాతం పెరిగాయి.  బీఎస్ఈలో మొత్తం 2,335 స్టాక్‌‌లు పురోగమించగా, 1,612 క్షీణించాయి. 278 స్టాక్‌‌లు 52 వారాల గరిష్టాన్ని తాకగా, 36 షేర్లు వాటి 52 వారాల కనిష్టానికి క్షీణించాయి.  ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో,  హాంకాంగ్ గణనీయమైన లాభాలతో స్థిరపడగా, షాంఘై స్వల్పంగా నష్టపోయింది.  యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ బుధవారం భారీ లాభాలతో ముగిసింది.    విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌ఐఐలు) బుధవారం రూ. 1,755 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.   గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌కు 1.39 శాతం పెరిగి 71.59 డాలర్లకు చేరుకుంది. సెన్సెక్స్​ బుధవారం 398.13 పాయింట్లు శాతం క్షీణించి 81,523.16 వద్ద స్థిరపడింది. ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ 122.65 పాయింట్లు క్షీణించి 24,918.45 వద్దకు చేరుకుంది.
 

మరిన్ని వార్తలు