75 వేల పైన సెన్సెక్స్‌‌ .. మెరిసిన ఎఫ్‌‌ఎంసీజీ , మెటల్ షేర్లు

75 వేల పైన సెన్సెక్స్‌‌ .. మెరిసిన ఎఫ్‌‌ఎంసీజీ , మెటల్ షేర్లు
  • రూ. 2.27 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
  • 23 వేల దిశగా నిఫ్టీ!

ముంబై: బెంచ్‌‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ మొదటిసారిగా 75 వేల లెవెల్‌‌ పైన క్లోజయ్యింది.  ఎఫ్‌‌ఎంసీజీ, ఎనర్జీ, మెటల్ షేర్లు పెరగడంతో బుధవారం 354  పాయింట్లు (0.47 శాతం) లాభపడింది. 75,038 దగ్గర సెటిలయ్యింది. నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 22,754 దగ్గర క్లోజయ్యింది. ఇన్వెస్టర్ల సంపద రూ.2.27 లక్షల కోట్లు పెరిగింది.  ఆసియా, యూరోపియన్ మార్కెట్లు పడుతున్నా, ఇండియా మార్కెట్‌‌ మాత్రం పెరుగుతోందని  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్‌‌ వినోద్ నాయర్ అన్నారు.

 ఫెడ్ మినిట్స్‌‌, యూఎస్ ఇన్‌‌ఫ్లేషన్ డేటాపై ఇన్వెస్టర్ల  ఫోకస్‌‌ ఉందన్నారు. సెన్సెక్స్‌‌లో ఐటీసీ, కోటక్ బ్యాంక్‌‌, ఎయిర్‌‌‌‌టెల్‌‌, ఎస్‌‌బీఐ,  ఏషియన్ పెయింట్స్‌‌, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ షేర్లు ఎక్కువగా పెరిగాయి.  మారుతి, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్‌‌ మహీంద్రా షేర్లు పడ్డాయి. బీఎస్‌‌ఈ మిడ్‌‌క్యాప్‌‌ బుధవారం 0.89 శాతం పెరగగా, స్మాల్‌‌క్యాప్ ఇండెక్స్‌‌ 0.46 శాతం లాభపడింది. ఆయిల్ అండ్ గ్యాస్‌‌, ఎనర్జీ, మెటల్‌‌, కమొడిటీస్‌‌, సర్వీసెస్‌‌ ఇండెక్స్‌‌లు ఎక్కువగా  పెరిగాయి. యుటిలిటీస్‌‌, ఆటో ఇండెక్స్‌‌లు పడ్డాయి. 

టోక్యో, షాంఘై మార్కెట్‌‌లు నష్టాల్లో ట్రేడవ్వగా, హాంకాంగ్‌‌ పాజిటివ్‌‌గా ముగిసింది. ఎలక్షన్స్ సందర్భంగా సౌత్ కొరియా మార్కెట్‌‌కు సెలవు. యూరోపియన్ మార్కెట్‌‌లు బుధవారం లాభాల్లో ట్రేడయ్యాయి.  గ్లోబల్‌‌  ఆయిల్ బెంచ్‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్‌‌  బుధవారం  బ్యారెల్‌‌కు 89.58 డాలర్ల దగ్గర ట్రేడయ్యింది. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌ఐఐలు) బుధవారం నికరంగా రూ.2,778 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.  డొమెస్టిక్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు  నికరంగా రూ.163 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.  రంజాన్ సందర్భంగా గురువారం మార్కెట్‌‌కు సెలవు. 

ఎనలిస్టులు ఏమంటున్నారంటే?

1) నిఫ్టీకి 22,700–22,750 లెవెల్‌‌ వద్ద రెసిస్టెన్స్ ఉందని, 22,600 దగ్గర సపోర్ట్ దొరుకుతుందని ఎల్‌‌కేపీ సెక్యూరిటీస్‌‌ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్‌‌ దే అన్నారు. 22,750 లెవెల్‌‌ పైన సస్టయిన్‌‌ అయితే  23,000 వరకు  కదులుతుందని అంచనా వేశారు. మార్కెట్ రేంజ్ బౌండ్‌‌లో ఉందని, ‘పడినప్పుడు కొనడం, పెరిగినప్పుడు అమ్మేయడం’ స్ట్రాటజీని ఫాలో అవ్వొచ్చని సలహా ఇచ్చారు. 
2)  నిఫ్టీ 23 వేల వరకు వెళుతుందని, దిగువన 22,530 స్ట్రాంగ్‌‌ సపోర్ట్‌‌గా పనిచేస్తుందని  ప్రోగ్రెసివ్‌‌ షేర్స్‌‌ డైరెక్టర్ ఆదిత్య గగ్గర్ పేర్కొన్నారు. 

పెరిగిన యూఎస్ ఇన్‌‌ఫ్లేషన్‌‌..

యూఎస్‌‌ ఇన్‌‌ఫ్లేషన్ ఈ ఏడాది మార్చిలో 3.5 శాతంగా (ఏడాది ప్రాతిపదికన) రికార్డయ్యింది. కిందటేడాది మార్చిలో యూఎస్ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) 3.2 శాతంగా ఉంది. యూఎస్ ఇన్‌‌ఫ్లేషన్‌‌  3.4 శాతానికి పెరుగుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు.  నెల ప్రాతిపదికన  మార్చిలో యూఎస్ ఇన్‌‌ఫ్లేషన్‌‌ 0.4 శాతం పెరిగింది.  0.3 శాతం పెరుగుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఫిబ్రవరిలో 0.4 శాతంగా రికార్డయ్యింది. మార్చి నెలకు గాను  కోర్ ఇన్‌‌ఫ్లేషన్ ఏడాది ప్రాతిపదికన 3.8 శాతంగా, నెల ప్రాతిపదికన 0.4 శాతంగా రికార్డయ్యింది.